
ఇస్లామాబాద్ : భారత్‌ను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. భారత్‌లో నివసిస్తున్న తమ దౌత్యవేత్తలను, వారి కుటుంబాలను భారత్ వేధిస్తోందని పాక్ ఆరోపించింది. ఈ అంశాన్ని పాక్ ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్‌తో పాటు భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లినట్టు డాన్ పత్రిక పేర్కొంది. తమ అధికారులపై వేధింపులు నిలిపివేయకపోతే తమ దౌత్యవేత్తలను, వారి కుటుంబాలను వెనక్కిపిలిపిస్తామని పాక్ హెచ్చరించినట్టు ఈ కథనం వెల్లడించింది. పాక్ డిప్యూటీ హైకమిషనర్ పిల్లలు స్కూలుకు వెళుతుండగా వారిని అడ్డగించి వేధింపులకు గురిచేశారని పాక్ దౌత్యవర్గాలు పేర్కొన్నాయి. మరికొందరు దౌత్య సిబ్బందినీ వేధిస్తున్నారని తెలిపాయి. న్యూఢిల్లీలో తమ సీనియర్ దౌత్యవేత్తనూ వేధించారని పాక్ ఆరోపించినట్టు డాన్ పేర్కొంది.
పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన పలు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయని కూడా ఈ కథనం తెలిపింది. కాగా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ బాధిత దేశంగా ప్రపంచం ముందు నిలవాలని ప్రయత్నిస్తోందని ఐరాస వేదికగా భారత్ ధ్వజమెత్తిన నేపథ్యంలో పాక్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment