భారత్‌పై దాయాది పాకిస్థాన్ సంచలన ఆరోపణలకు దిగింది. భారత్‌కు చెందిన సూపర్‌సోనిక్ మిస్సైల్ ఒకటి తమ సరిహద్దులో కుప్పకూలిందంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేసి కలకలం రేపింది. ఇది ఉల్లంఘనే అవుతుందని, దీనిపై భారత్ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోంది.
బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్‌సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలిందని పాక్ ఆరోపించింది. ప్యాసింజర్ ఫ్లయిట్లు తిరిగే ఎత్తులోనే ఈ దూసుకొచ్చిందని, పైగా అది పడిన ప్రాంతం జనావాసమని ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు పాక్ మేజర్ జనరల్, ISPR డీజీ అయిన బాబర్ ఇఫ్తికర్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపాడు.
పాకిస్థానీ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్.. భారత సరిహద్దు నుంచి వచ్చిన మిస్సైల్ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. మియా చన్ను సమీపంలో అది పడిపోయింది. ఇది పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే. ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ, అక్కడే ఉన్న గోడ మాత్రం నాశనం అయ్యింది అని ఇఫ్తికర్ వెల్లడించాడు.
శిథిలాను బట్టి.. అదొక సూపర్ సోనిక్ మిస్సైల్ అయి ఉంటుందని భావిస్తున్నాం (BrahMos supersonic cruise missile గా అనుమానిస్తోంది పాక్). కానీ, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. భారత్ ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ ఘోరమైన ఉల్లంఘనను తీవ్రంగా నిరసిస్తూ.. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని భారత్‌ను హెచ్చరిస్తున్నాం అంటూ ప్రసంగించాడు ఇఫ్తికర్.
ఇదిలా ఉంటే పాక్ ఆరోపణలపై అటు రక్షణ శాఖ, ఇటు భారత వాయు సేన గానీ స్పందించాల్సి ఉంది.
2005 ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల క్షిపణి పరీక్షలు గనుక నిర్వహిస్తే.. మూడు రోజుల ముందు తెలియజేయడంతో పాటు, ఇరు దేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం జరగకుండా నిర్ణీత వ్యవధిలోనే ఆ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment