'55 నిమిషాలు నడవడానికే సరిపోయింది'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ అధికారులు భారత అధికారులపై ఆరోపణలు చేశారు. పఠాన్ కోట్పై దాడిని పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులే చేశారని భారత అధికారులు ఆధారాలు చూపించలేకపోయారని అన్నట్లు పాక్ కు చెందిన మీడియా వర్గాలు చెప్పాయి. పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు పాకిస్థాన్ నుంచి కొంతమంది అధికారులు మార్చి 29న పఠాన్ కోట్ ఎయిర్ బేస్కు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే, భారత ఎన్ఐఏ అధికారులు తమకు కేవలం 55 నిమిషాలు మాత్రమే ఎయిర్ బేస్లోకి అనుమతించారని, ప్రధాన మార్గం నుంచి కాకుండా ఏదో ఇరుకైనా మార్గం నుంచి తమను తీసుకెళ్లారని, వారిచ్చిన ఆ గడువు కేవలం నడిచేందుకు సరిపోయింది తప్ప ఆధారాలు సేకరించేందుకు వీలుకాలేదని అన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్ఐఏ అధికారులు మాత్రం మొత్తం ఘటనను పాక్ దర్యాప్తు బృందానికి వివరించామని, ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాన్ని కూడా చూపించామని అంటున్నారు. కొన్ని ఆధారాలు కూడా వారు స్వీకరించినట్లు చెబుతున్నారు.