బీజింగ్: చైనాలో వందలాది మందిని బలి తీసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్.. ఓ దివ్యాంగుడి మృతికి పరోక్ష కారణమైంది. తనకు తానుగా ఏ పనీ చేసుకోలేని యాన్ చెంగ్ అనే 17 ఏళ్ల యువకుడి దుర్మరణానికి దారితీసింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆ యువకుడు.. కరోనా కారణంగా తండ్రి దూరంగా ఉండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మృత్యువాత పడటం పలువురిని కలచివేస్తోంది. కాగా వుహాన్ నగరంలో తొలిసారిగా బయటపడ్డ కరోనా ధాటికి చైనాలో ఇప్పటికే 361 మందికి పైగా మృత్యువాత పడగా.. నేటికీ ఎంతో మంది అనుమానితులకు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో యాన్ చెంగ్ తండ్రి యాన్ జియావెన్ కూడా ఉన్నారు. కరోనా సోకిందన్న అనుమానంతో అతడిని జనవరి 22న అధికారులు వైద్య శిబిరానికి తరలించారు. (కరోనా ముందు ఏ ప్రేమైనా భారమే.. )
ఈ క్రమంలో సెబరల్ పాల్సీతో వీల్‌చైర్‌కే పరిమితమైన యాన్ చెంగ్ ఒంటరివాడయ్యాడు. అతడికి కనీసం మాటలు కూడా రావు.. తనకు తానుగా ఆహారం కూడా తీసుకోలేడు. దీంతో తన కొడుకుకు ఎవరినైనా సహాయంగా పంపాల్సిందిగా జియావెన్ అధికారులను కోరాడు. అదే విధంగా తమ పరిస్థితిని వివరిస్తూ.. సోషల్ మీడియాలో సహాయం కోసం అర్థించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో యాన్ చెంగ్ జనవరి 29న చనిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటన హృదయాలను కలచివేసిందని.. ఇంతకన్నా అమానుషమైన చర్య మరొకటి ఉండదని విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా యాన్ విషయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా స్థానిక ప్రభుత్వం సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. (నిర్మానుష్య వీధిలో శవం.. భయం వేస్తోంది)
Comments
Please login to add a commentAdd a comment