ఎయిర్ ఏసియా బ్లాక్ బాక్స్ స్వాధీనం
జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విచారణ నిమిత్తం పంపినట్లు సార్ (ఎస్ఏఆర్) ఆపరేషన్స్ డైరెక్టర్ సుప్రియాది తెలిపారు. జాతీయ రవాణా భద్రతా కమిటీ చీఫ్ ద్వారా సమాచారం అందిందని, బ్లాక్ బాక్స్ తన చుట్టూ 20 మీటర్ల పరిధిలో జరిగిన విషయాలను రికార్డు చేస్తుందని ఆయన చెప్పారు.
బ్లాకు బాక్సులో డాటా రికార్డర్, వాయిస్ రికార్డర్ అనే రెండు విభాగాలు ఉంటాయి. బాక్సుల బ్యాటరీల్లో 30 రోజుల వరకు సమాచారం నిల్వ ఉంటుంది. విమానం తోక భాగంలో ఉండే బ్లాక్ బాక్స్ లో పైలట్ల సంభాషణలు, ఇతర సమాచారం రికార్డు అవుతాయి. కనుక ప్రమాద వివరాలు త్వరలోనే వెలుగు చూస్తాయని అధికారులు భావిస్తున్నారు. విమానంలో ఉన్న మొత్తం 162 మంది ప్రయాణికుల్లో ఇంతవరకు 48 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల ఆచూకీ కనుగొనేందుకు ఇండొనేషియా రవాణా మంత్రి ఇగ్నేసియస్ జోనన్ నిధులను కేటాయించారు.