సెకన్లలో పరీక్షలు..చిటికెలో మందులు
చుట్టూ చూస్తే అది ఆసుపత్రి అని అస్సలు అనిపించదు.. మందుల వాసన, ఆకుపచ్చటి తెరలు కూడా ఉండవు.. రిసెప్షన్ దాటుకుని లోపలికెళ్లగానే.. నిలువెత్తు స్కానర్ ఒకటి ఉంటుంది. బరువు చూసుకునే యంత్రంలా ఉండే దీనిపై ఎక్కి నిలుచుంటే చాలు.. సెకన్లలో మీ బీపీ, హార్ట్‌రేట్, రక్తంలో కొవ్వులు, చక్కెర మోతాదులు నమోదైపోతాయి. అక్కడి నుంచి కొంచెం పక్కకు తిరిగితే గోడ మొత్తం పరచుకున్న స్క్రీన్‌పై మీ వివరాలు ప్రత్యక్షం. తెర పక్కనే నవ్వుతూ ఓ డాక్టర్. మీ కష్టాలు ఆయనతో మాట్లాడుతుండగానే.. అవి రికార్డయిపోవడం.. మీ సమస్యల పరిష్కారానికి తగిన వైద్య సూచనలు తెరపై ప్రత్యక్షం కావడం చకచకా జరిగిపోతుంటాయి. ఇంతలోపే మీరు తీసుకోవాల్సిన మందులు, వాటి వివరాలు మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్షం!
ఏంటిది.. సైన్స్ ఫిక్షన్ స్టోరీ అనుకుంటున్నారా, అస్సలు కాదు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఈ మధ్యే ఏర్పాటైన సూపర్ హైటెక్ ఆసుపత్రి పనిచేసే తీరిది! పేరు ‘ఫార్వర్డ్’. అవసరమొచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లడం.. ఫీజు చెల్లించడం మందులు తెచ్చుకోవడం మనం చేసే పని. కానీ ఫార్వర్డ్‌లో ఇలా ఉండదు. నెలకు రూ.పది వేలు (149 డాలర్లు) చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా ఫార్వర్డ్‌లోకి చేరిపోవచ్చు. అంతేకాదు.. ఒకసారి సభ్యత్వం తీసుకుంటే చాలు.. సాధారణమైన పరీక్షలతోపాటు మీ జన్యుక్రమం మొత్తాన్ని విశ్లేషించి భవిష్యత్తులో మీకు రాగల జబ్బులను అంచనా కట్టి వాటి నివారణకు ప్రయత్నాలు మొదలుపెడుతుంది ఈ సంస్థ.
అంతా కృత్రిమ మేధ మహిమ...
సాధారణ ఆసుపత్రులకు పూర్తి భిన్నంగా పనిచేసే ఫార్వర్డ్ క్లినిక్‌లలోనూ వైద్యులు ఉంటారు. అయితే ఇతరుల మాదిరి బీపీ, పల్స్‌రేట్లు చెక్ చేస్తూ.. ప్రిస్క్రిప్షన్లు రాస్తూ టైమ్ వృథా చేయరు. ఈ పనులన్నీ కంప్యూటర్లు, హైటెక్ సెన్సర్లు చూసుకుంటాయి. తద్వారా వైద్యులు రోగులకు మెరుగైన చికిత్స అందించడం ఎలా అనే అంశంపై దృష్టి పెట్టవచ్చు. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ సాయంతో ఫార్వర్డ్‌లో అన్ని పనులు ఆటోమేటిక్‌గా జరిగిపోతూంటాయి. బాడీ స్కానర్ 30 సెకన్లలో అందించే వివరాలు నేరుగా రోగి తాలూకూ రికార్డుల్లోకి ఎలక్ట్రానిక్ రూపంలో చేరిపోతాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసే పని కూడా లేకుండా.. ఆయన చెప్పే మాటలను రికార్డు చేసుకుని ఫార్మసీ సిబ్బంది అవసరమైన మందులను సిద్ధం చేస్తారు.
ఎవరి ఆలోచన?
ఫార్వర్డ్‌ను స్థాపించింది ఆడ్రియాన్ ఔన్. గూగుల్ కంపెనీలో స్పెషల్ ప్రాజెక్ట్స్ విభాగానికి ఈయన అధ్యక్షుడిగా పనిచేశారు. ‘ప్రపంచంలో చాలా రంగాల్లో మార్పులు వచ్చాయి కానీ.. వైద్యంలో మాత్రం పరిస్థితి మారలేదు. అందుకే ఫార్వర్డ్‌ను స్థాపించాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది’అని అంటున్నారు ఆయన. కేవలం రోగమొచ్చినప్పుడు మందులిచ్చే వ్యవస్థగా ఫార్వర్డ్ పనిచేయదని, వ్యక్తి జన్యువివరాల ఆధారంగా భవిష్యత్తులో వచ్చే సమస్యలకూ ముందస్తు పరిష్కారాలు కనుక్కునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
క్లినిక్‌లో సభ్యుడిగా చేరిన ప్రతి ఒక్కరికీ వారి అవసరాలను బట్టి కొన్ని సెన్సర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఇస్తామని.. వీటిద్వారా అందే సమాచారంతో సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో సభ్యత్వానికి వసూలు చేస్తున్న రూ.పదివేలు చౌక మాత్రం కాదని, కాకపోతే భవిష్యత్తులో వినియోగదారుల సంఖ్య ఆధారంగా గణనీయంగా తగ్గే అవకాశముందని సూచిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్