ఇస్లామాబాద్ : ట్రంప్ ట్వీట్ పాకిస్తాన్‌లో మంటలు పుట్టిస్తోంది. నిధులు నిలుపుదలతో పాటు, ఉగ్రవాదులకు అడ్డగా మారిందనే వ్యాఖ్యలపై పాక్ తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడి తాజా నిర్ణయంపై ఆ దేశ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ నేషనల్ సెక్యూరిటీ కమిటీ (ఎన్‌ఎస్‌సీ) సమావేశం నిర్వహిచారు. ‘ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహబంధాన్ని ఒక్క ట్వీట్‌తో నాశనం చేశారు. అర్థరహితమైన వ్యాఖ్యలతో మా దేశ గౌరవానికి భంగం కలిగించారు’ అంటూ పాకిస్తాన్ నేతలు వ్యాఖ్యానించారు.
అమెరికా సహాయ సహకారాలు లేకపోయినా మేం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆ దేశ ప్రధాని షాహిద్ ఖాన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో మేం చేసిన త్యాగాలను డబ్బుతో వెలకట్టడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అమెరికా నాయకత్వం తీసుకున్న తాజా నిర్ణయం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురించేసిందని అబ్బాసీ వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలపై పునరాలోచన చేసుకోవాల్సి ఉంటుందని పాక్ ప్రధాని హెచ్చరించారు.
ఇదిలావుండగా.. అమెరికాలోని తమ రాయబారిని వెనక్కు పిలిపించాలని పొరుగు దేశం నిర్ణయించింది. అంతేకాక విదేశాంగ విధానంపై పూర్తిస్థాయిలో సమీక్ష జరపాలన్న ఆలోచనతో ఆ దేశం ఉంది.
ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాక్ అందించిన సహకారాన్ని అమెరికా మరిచిపోయిందని ఎన్‌ఎస్‌సీ అభిప్రాయపడింది. అంతేకాక అమెరికాకు సహరించడంతో దేశంలోని ఒక వర్గం ప్రజల నుంచి ప్రభుత్వం వ్యతిరేకత ఎదురైందని కమిటీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment