Shahid Khaqan Abbasi
-
పశ్చిమాసియా దేశానికి సయీద్ తరలింపు??
న్యూఢిల్లీ : ముంబై దాడుల కేసులో ప్రధాన నిందితుడు, జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌ను తప్పించేందుకు కుట్ర జరగుతోందా?. ఈ మేరకు పాకిస్తాన్, చైనాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ సంచలన రిపోర్టును ప్రచురించింది. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్‌ను ఏదైనా పశ్చిమాసియా దేశానికి పంపి, సంరక్షించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖాన్ అబ్బాసీకి సూచించినట్లు ది హిందూ తన కథనంలో పేర్కొంది. పశ్చిమాసియా దేశాలు అయితేనే సయీద్ ‘ప్రశాంత జీవితం’ గడపటానికి అవకాశం ఉంటుందని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు తెలిపింది. గత నెలలో చైనాలో బీఓఏఓ సమావేశం వేదికగా జిన్‌పింగ్, అబ్బాసీలు కలుసుకున్నారు. దాదాపు 35 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. ఇందులో దాదాపు 10 నిమిషాల పాటు హఫీజ్ సయీద్ అంశంపైనే జిన్‌పింగ్ మాట్లాడినట్లు ది హిందూ పేర్కొంది. సయీద్‌ను వెలుగులో నుంచి తప్పించడం వల్ల తొందరగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చని జిన్‌పింగ్ అబ్బాసీకి చెప్పినట్లు తెలిపింది. ఈ మేరకు అబ్బాసీ ప్రభుత్వ న్యాయకోవిదులతో ఈ మేరకు చర్చించినట్లు పేర్కొంది. అయితే, వారు ఇప్పటికే పరిష్కారాన్ని చూపలేదని వెల్లడించింది. ఈ నెల 31తో అబ్బాసీ ప్రభుత్వ సమయం ముగుస్తుండటంతో కొత్త ప్రభుత్వానికి సమస్యను అప్పజెప్పే ఆలోచనలో కూడ ఉన్నారని తెలిపింది. ఈ ఏడాది జులై మాసం ఆఖర్లో పాకిస్తాన్లో జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ముంబై దాడుల అనంతరం ఐక్యరాజ్యసమితి హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమతి, భారత్, అమెరికాలు సయీద్ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు బహుమానాన్ని సైతం ప్రకటించాయి. -
ప్రధాని నగ్న ఫోటోలు.. బీజేపీ అతి
సాక్షి, ముంబై : సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే నవ్వులపాలయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది. సరిగ్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అలాంటి పరిస్థితులనే ఎదుర్కుంటోంది. తాజాగా పాక్ ప్రధాని షాహిద్ కక్కాన్ అబ్బాసీ అమెరికా పర్యటనలో చేదు అనుభవం ఎదుర్కున్న వార్త ఒకటి విపరీతంగా చక్కర్లు కొట్టింది. న్యూయార్క్ జేఎఫ్‌కే ఎయిర్పోర్ట్ వద్ద భద్రతా సిబ్బంది ఆయన్ని క్షుణ్ణంగా పరిశీలించారని.. ఈ క్రమంలో ఆయన బట్టలూడదీసినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీకి చెందిన ఓ ఫేస్బుక్ పేజీ అబ్బాసీ ఫోటోలంటూ వాటిని వైరల్ చేస్తూ... ‘పందులు కులభూషణ్ భార్య మంగళసూత్రాన్ని తీయించాయి. అమెరికా అధికారులు పాక్ ప్రధాని గుడ్డలూదీయించారు’ అంటూ సందేశాన్ని ఉంచింది. ఆ గ్రూప్‌లో లక్షల్లో ఫాలోవర్లు ఉండటంతో ఆ ఫోటో వేల సంఖ్యలో షేర్ అయ్యింది. అదే తరహాలో మరికొన్ని గ్రూప్‌లు ‘భారత్‌తో పెట్టుకుంటే అంతే..’ అంటూ కామెంట్లతో ఆ ఫోటోలను షేర్ చేశాయి. కానీ, ఆ ఫోటోలు అబ్బాసీవి కాదన్న విషయం ఇప్పుడు తేలిపోయింది. ముంబైకి చెందిన ఓ వార్తాసంస్థ గూగుల్ ద్వారా ఆ ఫోటోలను నిర్ధారణ చేసేసింది. 2015లో డెయిలీ మెయిల్ ప్రచురించిన ఓ కథనంలోని ఫోటోలు అవి. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఓ రష్యన్ ప్రయాణికుడు మొత్తం బట్టలిప్పదీసి నగ్నంగా నడిచాడు. ఆ ఘటనంతా సీసీ ఫుటేజీలో నమోదు కాగా.. అప్పటి ఫోటోలను ఇప్పుడు అబ్బాసీ ఫోటోలంటూ ఎవరో అప్ లోడ్ చేశారు. వాటిని పట్టుకున్న బీజేపీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేసింది. ఇక ఇప్పుడు ఈ వ్యవహారాన్నంతా బీజేపీ అతి అంటూ ట్రోల్ చేసి పడేస్తున్నారు. బీజేపీ వైరల్ చేసిన పోస్ట్ ఇదే... వార్త సంస్థ బయటపెట్టిన వీడియో తాలుకూ స్క్రీన్ షాట్ -
భారత్ దారుణంగా అణచివేస్తోంది
ఇస్లామాబాద్ : కశ్మీర్ వ్యవహారంలో పాకిస్థాన్ మరోసారి తన అక్కసు వెల్లగక్కింది. భారత్ దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు గుప్పించింది. పాక్ ప్రధాని షాహిద్ ఖక్కన్ అబ్బాసీ స్వయంగా ఆ ఆరోపణలకు దిగటం విశేషం. ‘కశ్మీరు ప్రజలతో భారత సైన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. వారిని మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ధర్నాలు, ఆందోళన చేపట్టే వారిపై పెల్లెట్ గన్లను ప్రయోగిస్తూ అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోంది. స్వేచ్ఛ కోసం పోరాడే వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తోంది’ అని పేర్కొంటూ అబ్బాసీ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, అంతర్జాతీయ సమాజం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. నిజనిర్ధారణ కమిటీ ద్వారా కశ్మీర్‌లోని పరిస్థితులపై అధ్యయనం చేపట్టాలని ఐకరాజ్యసమితిని కోరారు. కాగా, ఆదివారం వరుస ఎన్కౌంటర్లలో 13 మంది మిలిటెంట్లు హతమయ్యారు. తీవ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయనే విషయం తెలియడంతో దక్షిణ కశ్మీర్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ప్రతిగా బలగాలు వారిపైకి కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు కశ్మీర్ డీజీపీ వాయిద్ ప్రకటించారు. ఈ పరిణామాల అనంతరం అబ్బాసీ ప్రకటన వెలువడటం గమనార్హం. 20martyred in South Kashmir Shopian,Islamabad districts of occupied Kashmir bloodbath today, Indian occupation forces martyred 20 Kashmiris,300 injured and destroyed over 5 houses and still counting..worst day of state terrorism in Kashmir valley — Khawaja M. Asif (@KhawajaMAsif) 1 April 2018 -
పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
-
పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్ : ఉగ్రవాద నిర్మూలన విషయంలో పాకిస్తాన్‌ను అమెరికా మరోసారి ఘాటుగా హెచ్చరించింది. ‘ముష్కర ముఠాలపై మీరు చర్యలు తీసుకోకుంటే మేమే నేరుగా దాడులు చేస్తామని’ ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్.. పాక్ ప్రధాని అబ్బాసీతో అన్నారు. అమెరికా పర్యటనకు వచ్చిన పాక్ ప్రధాని శుక్రవారం ట్రంప్ డిప్యూటీని కలుసుకున్నారు. ఉగ్రవాద నిరోదానికి పాక్ చేపట్టిన చర్యలను అబ్బాసీ వివరించగా, పేన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాలిబన్లతోపాటు అన్ని ఉగ్రవాద స్థావరాలను తక్షణమే నేలమట్టం చేయాలని పాక్‌కు సూచించారు. ఉగ్రవాదం విషయంలో పాక్ ద్వంద్వవైఖరి పట్ల అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారని, అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించే ఏ సంస్థలనైనా వదిలిపెట్టబోమని పేన్స్ గుర్తుచేశారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తిరిగి ఆ సాయాన్ని పొందేందుకు పాక్ చేస్తోన్న యత్నాలన్నీ విఫలమవుతున్నాయి. -
హఫీజ్‌కు పాక్ ప్రధాని మద్దతు
ఇస్లామాబాద్ : ముంబై దాడుల సూత్రధారి, ఉగ్ర సంస్థ జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన హఫీజ్ సయీద్‌పై పాకిస్తాన్లో ఎటువంటి కేసులు లేవని.. ఆయన స్పష్టం చేశారు. ఒక పాకిస్తాన్ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో పాక్ ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హఫీజ్ సయీద్‌ను పొరుగుదేశ ప్రధాని సహాబ్ అని సంబోధించడం గమనార్హం. ఇదిలావుండగా అమెరికా నిధులు నిలిపివేయడంతో... హఫీజ్ సయీద్‌ను పొరుగుదేశం నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో హఫీజ్ గురించి.. పాక్ ప్రధాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అబ్బాసీ వ్యాఖ్యలు మరింత అంతర్జాతీయంగా మరింత మంటలు రాజేస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ట్రంప్ నిర్ణయంపై పాక్ ఆగ్రహం
ఇస్లామాబాద్ : ట్రంప్ ట్వీట్ పాకిస్తాన్లో మంటలు పుట్టిస్తోంది. నిధులు నిలుపుదలతో పాటు, ఉగ్రవాదులకు అడ్డగా మారిందనే వ్యాఖ్యలపై పాక్ తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడి తాజా నిర్ణయంపై ఆ దేశ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ నేషనల్ సెక్యూరిటీ కమిటీ (ఎన్ఎస్సీ) సమావేశం నిర్వహిచారు. ‘ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహబంధాన్ని ఒక్క ట్వీట్‌తో నాశనం చేశారు. అర్థరహితమైన వ్యాఖ్యలతో మా దేశ గౌరవానికి భంగం కలిగించారు’ అంటూ పాకిస్తాన్ నేతలు వ్యాఖ్యానించారు. అమెరికా సహాయ సహకారాలు లేకపోయినా మేం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆ దేశ ప్రధాని షాహిద్ ఖాన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో మేం చేసిన త్యాగాలను డబ్బుతో వెలకట్టడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అమెరికా నాయకత్వం తీసుకున్న తాజా నిర్ణయం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురించేసిందని అబ్బాసీ వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలపై పునరాలోచన చేసుకోవాల్సి ఉంటుందని పాక్ ప్రధాని హెచ్చరించారు. ఇదిలావుండగా.. అమెరికాలోని తమ రాయబారిని వెనక్కు పిలిపించాలని పొరుగు దేశం నిర్ణయించింది. అంతేకాక విదేశాంగ విధానంపై పూర్తిస్థాయిలో సమీక్ష జరపాలన్న ఆలోచనతో ఆ దేశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాక్ అందించిన సహకారాన్ని అమెరికా మరిచిపోయిందని ఎన్ఎస్సీ అభిప్రాయపడింది. అంతేకాక అమెరికాకు సహరించడంతో దేశంలోని ఒక వర్గం ప్రజల నుంచి ప్రభుత్వం వ్యతిరేకత ఎదురైందని కమిటీ తెలిపింది. -
భారత్‌పై వాడేందుకే..!
► అణ్వాయుధాలపై పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ► 15 ఏళ్లుగా మేమూ ఉగ్రబాధితులమే న్యూయార్క్: అవసరమైతే భారత్‌పై వినియోగించేందుకు తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను తయారుచేసుకున్నామని పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ వెల్లడించారు. పాకిస్తాన్ అణుశక్తి తమ నియంత్రణలోనే భద్రంగానే ఉందన్నారు. ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్న షాహిద్ అబ్బాసీ.. ఆ దేశ మేధోసంస్థ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ భేటీలో గురువారం మాట్లాడారు. పాకిస్తాన్‌తో యుద్ధమంటూ జరిగితే ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ‘కోల్డ్ స్టార్ట్ సిద్ధాంతం’ను రూపొందించింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలు వినియోగించకుండా భారత బలగాలు నిలువరించే ప్రత్యేక వ్యూహమే ఈ సిద్ధాంతం. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనకు వచ్చిన షాహిద్ అబ్బాసీ.. భారత కోల్డ్‌స్టార్ట్ సిద్ధాంతాన్ని ఎదుర్కొనేందుకే అణ్వాయుధాలను తయారుచేసుకున్నామని వెల్లడించారు. ప్రపంచంలో వేగంగా అణ్వాయుధ శక్తిని పెంచుకుంటున్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటని ఆయన పేర్కొన్నారు. ‘అణ్వాయుధాలను కాపాడుకునేందుకు మావద్ద బలమైన, భద్రమైన నియంత్రణ వ్యవస్థ ఉంది. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రపంచంలోని ఇతర అణ్వాయుధ దేశాల్లాగే మా అణువ్యవస్థ కూడా క్షేమమే. 20 ఏళ్లుగా ఇది నిరూపితమవుతోంది’ అని అబ్బాసీ వెల్లడించారు. ఏ ఉగ్రవాద సంస్థ చేతుల్లోకో.. మరో వ్యవస్థ చేతుల్లోకో పాక్ అణ్వాయుధ వ్యవస్థ వెళ్లిందనే విషయంలో సందేహం అక్కర్లేదన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాల వినియోగంపై నిర్ణయం, నియంత్రణ అంతా ఎన్సీఏ చేతుల్లోనే ఉంటుంది. ‘మాకు అణుసామర్థ్యం ఉంది. అందులో సందేహం అక్కర్లేదు. అణువ్యర్థాలను ఏం చేయాలో కూడా మాకు తెలుసు. 60వ దశకంలోనే మేం అణుకార్యక్రమాలను చేపట్టాం. 50 ఏళ్లుగా అణుశక్తి నిర్వహణ చేస్తున్నాం.. ఇకపై కొనసాగిస్తాం’ అని అబ్బాసీ వెల్లడించారు. పాకిస్తాన్ ఓ బాధ్యతాయుతమైన దేశమన్న షాహిద్ అబ్బాసీ.. క్షేత్రస్థాయిలో 15 ఏళ్లుగా ఉగ్రవాదంతో పోరాడుతూనే ఉన్నామన్నారు. -
భయంతో.. యూఎన్‌కు..!?
-
భయంతో.. యూఎన్‌కు..!?
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖాన్ అబ్బాసీ ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సమావేశాల్లో పాల్గొంటారని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్ ప్రధానిగా తొలిసారి న్యూయార్క్ వెళ్లనున్నా ఆయన.. అక్కడ ప్రపంచ దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశామవుతారని ఆదేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. సమితి నుద్దేశించి పాక్ ప్రధాని చేసే ప్రసంగంలో కశ్మీర్‌తో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో భారత్-అమెరికా, భారత్-జపాన్ల బంధం బలోపేతం కావడం, రక్షణ, సాంకేతిక, అణు రంగాల్లో భారత్ ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక బంధాలను పెంచుకోవడంతో పాక్ కలవరపాటుకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాధినేతలతో పాక్ ప్రధాని సమావేశం కావాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సమితిలో పాక్ ప్రధానికి చైనా పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని తెలుస్తోంది. -
మాజీ ప్రధాని కుమార్తెకు కీలక బాధ్యతలు
సాక్షి, లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె కీలక బాధ్యతలు భుజాన వేసుకున్నారు. పనామా పత్రాల లీక్‌నకు సంబంధించి ఇటీవల కోర్టు తీర్పుతో నవాజ్ షరీఫ్ పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే. ఆయన ఎన్నికైన లాహోర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన సతీమణి కుల్సూం ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆమె గొంతు సంబంధిత కేన్సర్‌తో లండన్‌లో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని పాకిస్తాన్ ముస్లిం లీగ్ వర్గాలు చెప్పాయి. దీంతో కుల్సూం తరఫున ఆమె కుమార్తె మరయం నవాజ్ (43) ప్రచార బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ నేతలు తెలిపారు. వచ్చే నెల 17న జరిగే ఈ ఎన్నికకుగాను మరయం నేటి (శనివారం) ఉదయం నవాజ్ షరీఫ్ నివాసం నుంచి ప్రచారం ప్రారంభించారు. ఆమె వెంట పార్టీ నేతలు పర్వేజ్ మాలిక్, పర్వేజ్ రషీద్‌తోపాటు లాహోర్ మేయర్ పాల్గొన్నారు. ఒకవేళ కుల్సూం ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా ఉన్న షాహీద్ ఖాకన్ అబ్బాసీ స్థానంలో నియమితులయ్యే అవకాశం ఉంది. -
పాక్ కొత్త ప్రధాని ఈయనే
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు కొత్త ప్రధాని వచ్చారు. మంగళవారం షాహిద్ ఖాఖన్ అబ్బాసీని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ తమ కొత్త ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు 342 సభ్యులున్న అసెంబ్లీలో 221మంది అబ్సాసీకి ఓటు వేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన నవీద్ ఖమర్‌కు 47 ఓట్లు రాగా, పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్షాప్కు 33 ఓట్లు, జమాతే ఇ ఇస్లామికి చెందిన సహిబ్జాదా తారీఖుల్లాకు రెండే ఓట్లు వచ్చాయి. ఫలితాలు వెల్లడించగానే సభలో పలువురు నినాదాలు చేస్తుండగా నేషనల్ స్పీకర్ అయాజ్ సాదిక్ అబ్బాసీని ప్రధాని పదవిని అలంకరించాలని ఆహ్వానించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. పనామా కుంభకోణం కేసులో దోషిగా ప్రకటిస్తూ పాకిస్థాన్ ప్రధానిగా పనిచేస్తున్న నవాజ్ షరీఫ్‌పై అనూహ్యంగా సుప్రీంకోర్టు వేటువేసిన విషయం తెలిసిందే. దీంతో నవాజ్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా ఆయన అనంతరం ప్రధానిగా వచ్చే వ్యక్తికోసం ప్రత్యేకంగా జాతీయ అసెంబ్లీలో నాలుగుచోట్ల ఏర్పాటుచేసిన ప్రత్యేకచోట్లలో ఓటింగ్ నిర్వహించారు. అయితే, ఓటింగ్ నిర్వహించే సమయంలో షరీఫ్ మద్దతుదారులు ఆయన ఫొటోలతో లోపలికి ప్రవేశించి ఆందోళన చేసే ప్రయత్నం చేయగా స్పీకర్ జోక్యం చేసుకొని వారిని మార్షల్స్ ద్వారా అడ్డుకున్నారు. -
ఆపద్ధర్మ ప్రధానిగా పెట్రోలియం మంత్రి
తెరపైకి షాహిద్ అబ్బాసీ.. షరీఫ్ తమ్ముడికే పూర్తికాలపు ప్రధాని పదవి ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పెట్రోలియం, సహజ వనరులశాఖ మంత్రి షాహిద్ ఖాకన్ అబ్బాసి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో అబ్బాసీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పనామా పత్రాల్లో తన కుటుంబసభ్యుల పేర్లు ఉండటంతో నవాజ్ షరీఫ్‌పై చట్టసభ సభ్యుడిగా పాక్ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పాక్ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసి 45 రోజులు సేవలు అందించనున్నారని, ఈ లోపు పార్లమెంటుకు పోటీచేసి.. నవాజ్ షరీఫ్ సోదరుడు, పంజాబ్ సీఎం షెహ్బాజ్ షరీఫ్ ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధమవుతారని అధికార పీఎంఎల్ఎన్ వర్గాలు తెలిపాయి. నవాజ్‌పై అనర్హత వేటు నేపథ్యంలో ఆయన వారసుడిగా సోదరుడు షెహ్బాజ్ ఎన్నికకు పీఎంఎల్ఎన్ మెజారిటీ నేతలు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. షరీఫ్ సంతానానికి విదేశాల్లో అక్రమ కంపెనీలు ఉన్నాయని 2015లో వెలుగుచూసిన పనామా పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన జిట్ నివేదిక మేరకు.. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవాజ్‌పై అనర్హత వేటువేస్తూ ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.