భారత్‌పై వాడేందుకే..! | Pakistan short-range nuclear weapons to counter 'Cold Start' doctrine | Sakshi
Sakshi News home page

భారత్‌పై వాడేందుకే..!

Published Fri, Sep 22 2017 1:32 AM | Last Updated on Fri, Sep 22 2017 8:40 PM

Pakistan short-range nuclear weapons to counter 'Cold Start' doctrine

► అణ్వాయుధాలపై పాకిస్తాన్‌ ప్రధాని షాహిద్‌ అబ్బాసీ
► 15 ఏళ్లుగా మేమూ ఉగ్రబాధితులమే


న్యూయార్క్‌: అవసరమైతే భారత్‌పై వినియోగించేందుకు తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను తయారుచేసుకున్నామని పాక్‌ ప్రధాని షాహిద్‌ అబ్బాసీ వెల్లడించారు. పాకిస్తాన్‌ అణుశక్తి తమ నియంత్రణలోనే భద్రంగానే ఉందన్నారు. ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్న షాహిద్‌ అబ్బాసీ.. ఆ దేశ మేధోసంస్థ కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ భేటీలో గురువారం మాట్లాడారు. పాకిస్తాన్‌తో యుద్ధమంటూ జరిగితే ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ‘కోల్డ్‌ స్టార్ట్‌ సిద్ధాంతం’ను రూపొందించింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు పాకిస్తాన్‌ అణ్వాయుధాలు వినియోగించకుండా భారత బలగాలు నిలువరించే ప్రత్యేక వ్యూహమే ఈ సిద్ధాంతం.

ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనకు వచ్చిన షాహిద్‌ అబ్బాసీ.. భారత కోల్డ్‌స్టార్ట్‌ సిద్ధాంతాన్ని ఎదుర్కొనేందుకే అణ్వాయుధాలను తయారుచేసుకున్నామని వెల్లడించారు. ప్రపంచంలో వేగంగా అణ్వాయుధ శక్తిని పెంచుకుంటున్న దేశాల్లో పాకిస్తాన్‌ ఒకటని ఆయన పేర్కొన్నారు. ‘అణ్వాయుధాలను కాపాడుకునేందుకు మావద్ద బలమైన, భద్రమైన నియంత్రణ వ్యవస్థ ఉంది. న్యూక్లియర్‌ కమాండ్‌ అథారిటీ (ఎన్సీఏ) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రపంచంలోని ఇతర అణ్వాయుధ దేశాల్లాగే మా అణువ్యవస్థ కూడా క్షేమమే. 20 ఏళ్లుగా ఇది నిరూపితమవుతోంది’ అని అబ్బాసీ వెల్లడించారు.

ఏ ఉగ్రవాద సంస్థ చేతుల్లోకో.. మరో వ్యవస్థ చేతుల్లోకో పాక్‌ అణ్వాయుధ వ్యవస్థ వెళ్లిందనే విషయంలో సందేహం అక్కర్లేదన్నారు. పాకిస్తాన్‌ అణ్వాయుధాల వినియోగంపై నిర్ణయం, నియంత్రణ అంతా ఎన్సీఏ చేతుల్లోనే ఉంటుంది. ‘మాకు అణుసామర్థ్యం ఉంది. అందులో సందేహం అక్కర్లేదు. అణువ్యర్థాలను ఏం చేయాలో కూడా మాకు తెలుసు. 60వ దశకంలోనే మేం అణుకార్యక్రమాలను చేపట్టాం. 50 ఏళ్లుగా అణుశక్తి నిర్వహణ చేస్తున్నాం.. ఇకపై కొనసాగిస్తాం’ అని అబ్బాసీ వెల్లడించారు. పాకిస్తాన్‌ ఓ బాధ్యతాయుతమైన దేశమన్న షాహిద్‌ అబ్బాసీ.. క్షేత్రస్థాయిలో 15 ఏళ్లుగా ఉగ్రవాదంతో పోరాడుతూనే ఉన్నామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement