అమెరికా ఫస్ట్‌ | Donald trump as the 45th President of the United States of America | Sakshi
Sakshi News home page

అమెరికా ఫస్ట్‌

Published Sat, Jan 21 2017 2:22 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

అమెరికా ఫస్ట్‌ - Sakshi

అమెరికా ఫస్ట్‌

డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టీకరణ
అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణం
నేటి నుంచి ప్రజలే పాలకులని వెల్లడి
‘బై అమెరికన్, హైర్‌ అమెరికన్‌’ నినాదంతో ముందుకెళ్తామని ప్రకటన
దేశానికి పునర్వైభవం తెస్తానని హామీ


నా చివరి శ్వాస వరకు అమెరికాకు నష్టం కలగకుండా చూసుకుంటా.. మీ ఉద్యోగాలు తీసుకొస్తా.. మీ కలను వెనక్కు తెస్తా.. మీ సంపదను వెనక్కు తెప్పిస్తా.. అమెరికా వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పిస్తా.. మీకోసం ‘బై అమెరికన్, హైర్‌ అమెరికన్‌’ నినాదాలు తీసుకొస్తున్నా.  
– అధ్యక్షుడిగా తొలి ప్రసంగంలో ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ జే ట్రంప్‌ (70) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో ఈరోజు (జనవరి 20, 2017) ప్రత్యేకంగా నిలిచిపోతుందని.. నేటినుంచి ప్రజలే పాలకులని ప్రమాణస్వీకారం సందర్భంగా ట్రంప్‌ స్పష్టం చేశారు. ‘అమెరికా ఫస్ట్‌’ అనే నినాదంతోనే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని.. దేశానికి పునర్వైభవం తీసుకురావటమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇన్నాళ్లూ వాషింగ్టన్‌ డీసీ (రాజధాని)కి పరిమితమైన అధికారం ఇప్పుడు ప్రజలవద్దకు వెళ్తుందన్నారు. ఇన్నాళ్లూ రాజకీయ నాయకులే బాగుపడ్డారని.. ఫ్యాక్టరీలు మూతపడి ఉద్యోగాలు పోయినా పట్టించుకోలేదని విమర్శించారు. ఓవైపు మంచు కురుస్తున్నా.. ప్రతికూల వాతావరణంలో దాదాపు 8 లక్షల మంది నేషనల్‌ మాల్‌ సమీపంలో జరిగిన ట్రంప్‌ ప్రమాణ స్వీకారకార్యక్రమానికి హాజరయ్యారు.

అమెరికా అధ్యక్షుడిగా బైబిల్‌పై ప్రమాణంచేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌.
చిత్రంలో ట్రంప్‌ సతీమణి మెలానియా, కూతురు ఇవాంకా, కొడుకులు ట్రంప్‌ జూనియర్, బరాన్, చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ఉన్నారు

లింకన్‌ బైబిల్‌పై ప్రమాణం చేసి..
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ వినియోగించిన బైబిల్‌తోపాటు మరో బైబిల్‌పై ప్రమాణం చేస్తూ రాజ్యాంగ రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తానని ట్రంప్‌ ప్రమాణం చేశారు. అమెరికా చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. అధ్యక్షుడితో ప్రమాణం చేయించారు. అధికార మార్పిడిలో సహకరించిన ఒబామా దంపతులకు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ముందు అమెరికా.. తర్వాతే అన్నీ
ఇన్నాళ్లుగా రాజకీయ కారణాల వల్ల అమెరికాలో స్థానికులు దారుణంగా నష్టపోయారని.. ఫ్యాక్టరీలు, కంపెనీలు మూతబడి చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని ట్రంప్‌ తెలిపారు. ఇకపై ‘అమెరికా ఫస్ట్‌’ అనే నినాదంతోనే పాలన కొనసాగుతుందన్నారు. ‘మీ అందరి (ప్రజల) సహకారంతో తిరిగి అమెరికాకు పూర్వవైభవం తెస్తాం. మీ కలలు, ఆశయాలను నెరవేరుస్తాం. మీ బాధను మా బాధగా, మీ సంతోషాన్ని మా సంతోషంగా స్వీకరిస్తాం. ఇది మీ దేశం. మీరు సంబరాలు చేసుకోవాల్సిన సమయమిది. నేటినుంచి ప్రజలే ఈ ప్రభుత్వాన్ని పాలిస్తారు. ఈ రోజు అమెరికా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’ అని ట్రంప్‌ ప్రసంగించారు. ఇన్నాళ్లూ దేశంలో మధ్యతరగతి ప్రజలు దోపిడీకి గురయ్యారని.. ఇకపై ‘విస్మరణకు గురైనవారు’ అనే మాటే వినిపించకూడదన్నారు. వాణిజ్యం, పన్నులు, ఇమిగ్రేషన్, విదేశాంగ విధానం ఇలా ప్రతి నిర్ణయంలో అమెరికా ఫస్ట్‌ అనే నినాదమే ప్రతిబింబిస్తుందన్నారు.

ఉద్యోగకల్పనలో స్థానికత
‘మనమంతా కలిసి అమెరికా, ప్రపంచ భవిష్యత్తును నిర్ణయిద్దాం. మన ముందున్న సవాళ్లను, ఒడిదుడుకులను స్వీకరించి.. సమైక్యంగా ముందుకెళదాం. అన్ని సమస్యలను అధిగమించి గొప్ప అమెరికాను నిర్మించుకుందాం’ అని ట్రంప్‌ కోరారు. స్థానికులకు ఉద్యోగాలివ్వాలనే ఎన్నికల హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్న ట్రంప్‌.. అమెరికన్లకు భద్రత కల్పించటం కూడా తమ బాధ్యతని తెలిపారు. విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ‘ఇన్నాళ్లూ జరిగిన దోపిడీ ఆగిపోతుంది. మార్పు నేటితోనే మొదలవుతుంది. ఎందుకంటే ఇదీ మీ సంబరం. మాటలు చెప్పటానికి నేటితో చెల్లిపోయింది. ఇకపై చేతల్లో చూపించాల్సిందే’ అని ట్రంప్‌ తెలిపారు. అమెరికన్లకు ఉద్యోగాలు వెనక్కు తెస్తామని, సరిహద్దులను కాపాడతామని, అమెరికా సంపదను, అమెరికన్ల కలలను తిరిగి తీసుకొస్తామన్నారు.

మన విశ్వాసాన్ని దెబ్బతీశారు
‘ఇన్నాళ్లూ ప్రభుత్వ విధానాల కారణంగా సైనికశక్తి కుదేలైంది. ఇది చాలా బాధాకరం. మన దేశ సరిహద్దులను మనం కాపాడుకోవాలి. కానీ లక్షల కోట్ల డాలర్లను, అమెరికా మెషినరీని విదేశాల్లో పెట్టి వచ్చాం. విదేశాలను ధనికులను చేశాం. దీని వల్ల మన సంపద, విశ్వాసం అన్నీ అదృశ్యమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మన గౌరవాన్ని వదులుకున్నాం. ఒక్కొక్కటిగా ఫ్యాక్టరీలన్నీ మూతబడ్డాయి. లక్షల మంది అమెరికన్లను నిరుద్యోగులుగా మారారు’ అని ట్రంప్‌ అన్నారు. తుది శ్వాస వరకు అమెరికాను గొప్పగా నిలిపేందుకే ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా  దూసుకుపోయేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తానన్నారు.

ట్రంప్‌కు మోదీ అభినందన  
న్యూఢిల్లీ: ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనను అభినందిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల, సహకారాల బలోపేతం కోసం ఆయనతో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని, రాబోయే రోజుల్లో అమెరికా గొప్ప విజయాలు అందుకోవాలని అభిలషిస్తున్నానని పేర్కొన్నారు. ఇరు దేశాల వ్యూహాత్మ భాగస్వామ్య బలం ఉమ్మడి విలువలు, ప్రయోజనాల్లో ఉందని వ్యాఖ్యానించారు.  

ఇకనుంచి అంతా మనవాళ్లే..!
అమెరికాలో మౌలికవసతుల రంగంలో కొత్త మార్పులు తీసుకొస్తామని ట్రంప్‌ తెలిపారు. అన్ని పనుల్లో లేబర్ల దగ్గర్నుంచి, ఇంజనీర్ల వరకు అందరినీ అమెరికన్లనే వినియోగించుకుంటామన్నారు. ఇందుకోసం ‘బై అమెరికన్, హైర్‌ అమెరికన్‌’ (అమెరికన్‌ వస్తువులు కొనాలి, అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలి) నినాదాన్ని తీసుకొచ్చారు. ‘గతంలో కన్నా అమెరికన్లు గొప్పగా ఆలోచించాలి. మనం విఫలమవ్వం. మనమంతా కలిసి బలమైన, సంపన్న దేశాన్ని నిర్మిద్దాం. ప్రతి అమెరికన్‌ గర్వపడేలా పరిస్థితిని తీసుకొద్దాం’ అని ట్రంప్‌ ఉద్ఘాటించారు. అమెరికన్లకు భద్రత కల్పించటం తమ బాధ్యతన్న ట్రంప్‌.. దేశానికి సమర్థవంతమైన మిలటరీ, దేవుడు రక్షణగా ఉంటారన్నారు. వివిధ జాతులున్నా మనమంతా ఒక్కటే అనే భావన, దేశభక్తి ముందుకు నడిపిస్తుందన్నారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. అంతకుముందు. మైక్‌ పెన్స్‌ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.

1.ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు వైట్‌హౌస్‌లో మీడియా ముందుకొచ్చిన ఒబామా, ట్రంప్‌ దంపతులు
2.యూఎస్‌ కాపిటల్‌ ముందు ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన అశేషజనవాహిని

ట్రంప్‌ జీవితంలో కీలక ఘట్టాలు
►  క్వీన్స్‌ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌ ఫ్రెడ్‌ ట్రంప్‌కు జూన్‌ 14, 1946లో నాలుగో సంతానంగా జననం
► వార్టన్‌ స్కూల్లో, ఫోర్దమ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో విద్యాభ్యాసం
► తండ్రి నుంచి అప్పు తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభం
► తండ్రి కంపెనీపై ఆధిపత్యం సాధించి ఆ కంపెనీకి ట్రంప్‌ ఆర్గనైజేషన్‌గా 1971లో నామకరణం
► ఎంటర్‌టైన్‌ మెంట్‌ బిజినెస్‌లో టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌గా ప్రఖ్యాతి..
► మూడు సార్లు వివాహం. ప్రస్తుత భార్య మెలానియా. సంతానం.. డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్, ఇవాంకా, ఎరిక్, టిఫానీ, బారన్‌
► అధ్యక్ష పదవికి పోటీపడాలని 1987 నుంచి ప్రయత్నాలు
► రిపబ్లిక్‌ పార్టీ తరఫున పోటీ పడుతున్నట్లు 2015లో ప్రకటన
► 2016 జూలై 19న రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిగా అధికారిక ప్రకటన
► కుమారులు డొనాల్డ్, ఎరిక్‌లకు వ్యాపార సామ్రాజ్యం అప్పగింత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement