అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)
వాషింగ్టన్: ఇంటికే పరిమితం కావాలన్న నిబంధనల ఎత్తివేత గురించి వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటొని ఫాసీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ముఖ్యంగా పాఠశాలలు తిరిగి ప్రారంభించే అవకాశాలపై ఫాసీ అభిప్రాయాలతో తాను ఏకీభవించలేనన్నారు. లాక్‌డౌన్ నిబంధనలను త్వరతిగతిన ఎత్తివేస్తే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మరిన్ని కరోనా మరణాలు సంభవిస్తాయని.. ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవాల్సి వస్తుందంటూ ఫాసీ హెచ్చరించిన విషయం తెలిసిందే. కరోనా సంక్షోభంతో అల్లాడుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే క్రమంలో... లాక్‌డౌన్ నిబంధనలను సడలించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఫాసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (నిబంధనల సడలింపు: మరణాలు రెట్టింపయ్యే అవకాశం!)
లాక్‌డౌన్ సడలింపు గురించి ఫాసీ మాట్లాడుతూ... ‘స్టే ఎట్ హోం’నిబంధనను ఎత్తివేయడం వల్ల పరిస్థితులు చేయిదాటి పోతాయని హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ.. స్కూళ్లు తెరిచేలోపు మాత్రం అది సాధ్యపడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయం గురించి విలేకరులు ట్రంప్‌ను బుధవారం ప్రశ్నించగా... ఫాసీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. స్కూళ్లు తెరిస్తే విద్యార్థులకు పెద్దగా ప్రమాదం ఉండబోదని తాను భావిస్తున్నానని.. అయితే వయసు పైబడిన ప్రొఫెసర్లు, టీచర్ల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వారికి మరికొన్ని వారాల పాటు సెలవు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ‘‘ఆంటోనీ చాలా చాలా మంచివారు. కానీ ఆయనతో నేను అస్సలు ఏకీభవించను. కచ్చితంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభిస్తాం. భద్రతా ప్రమాణాలతో ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా అన్ని సంస్థలు తిరిగి ప్రారంభమవుతాయి’’ అని ట్రంప్ స్పష్టం చేశారు.(నిందలు సరే... నిర్ధారణ ఎలా?)
Comments
Please login to add a commentAdd a comment