ట్రంప్(ఎడమ), కిమ్(కుడి)
ప్యాంగ్‌యాంగ్, ఉత్తరకొరియా : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో భేటిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ భేటి రద్దు ప్రభావం కిమ్ ప్రభుత్వ అంతర్గత విభాగాలపై ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అణ్వాయుధ కేంద్రాలను నాశనం చేసి భేటిలో పాల్గొనడానికి సిద్ధమైన కిమ్, ట్రంప్ రద్దు నిర్ణయంతో షాక్ తిన్నారు.
ప్యాంగ్ యాంగ్ నుంచి వస్తున్న సందేశాల కారణంగానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, కిమ్ పూర్తిగా ట్రంప్ నియంత్రణలోకి వచ్చారని అనుకోవడానికి లేదని ప్రముఖ విశ్లేషకులు బ్రుస్ బెన్నెట్ పేర్కొన్నారు. జూన్ 12న ట్రంప్, కిమ్‌లు సింగపూర్‌లో భేటి కావాల్సి ఉంది. కాగా భేటిని రద్దు చేస్తున్నట్టు గురువారం ట్రంప్ ప్రకటించారు.
2011లో తండ్రి మరణాతరం ఉత్తరకొరియా అధ్యక్ష పదవిని చేపట్టిన కిమ్, తన ప్రత్యర్థులను హతమార్చి ప్రభుత్వంపై పట్టును సాధించారు. అమెరికా అధ్యక్షుడితో భేటి కోసం అంతర్జాతీయ జర్నలిస్టుల సమక్షంలో పంగేరి అణ్వాయుధాల కేంద్రాన్ని సైతం నాశనం చేశారు. అయితే, కిమ్ దేనికోసం ఇదంతా చేశారో అదే లేకుండా పోయింది. ఈ దశలో ఆయన ఉత్తరకొరియా సైన్యానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
అణ్వాయుధ నిరాయుధీకరణ గురించి కిమ్ దేశ సైన్యం ఏ విధంగా భావిస్తోందో అర్థంకావడం లేదని రక్షణ రంగ నిపుణుడు బెన్నెట్ అన్నారు. కిమ్‌తో భేటికి మార్చి నెలలో అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. అప్పటినుంచి వివాదాలకు కిమ్ దూరంగా ఉంటున్నారు. ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన ముగ్గురు ఖైదీలను కిమ్ ప్రభుత్వం విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment