వాషింగ్టన్: నైపుణ్య ఆధారమైన వలసలను ప్రోత్సహించటం ద్వారా అక్రమ వలసలకు చెక్ పెట్టొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తద్వారా మంచి ట్రాక్ రికార్డున్న నిపుణులు అమెరికాకు వచ్చేందుకు వీలుంటుందన్నారు. శ్వేతసౌధంలో రిపబ్లిక్, డెమొక్రాట్ చట్ట సభ్యుల బృందంతో ట్రంప్ సమావేశమయ్యారు. అమెరికాలో ప్రవేశానికి ప్రస్తుతం అనుసరిస్తున్న చైన్ మైగ్రేషన్ విధానానికి (అమెరికా పౌరుడై ఉన్న లేదా అక్కడ చట్టపరంగా నివసిస్తున్న కుటుంబ సభ్యుల స్పాన్సర్‌షిప్ ద్వారా ప్రవేశం పొందటం) ముగింపు పలకాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
ఈ విధానం ద్వారా అమెరికాలో వేగంగా, సులభంగా ప్రవేశం పొందేందుకు అనుమతి లభిస్తోంది. ‘వీసాల గురించి మనం ప్రవేశపెట్టే అన్ని బిల్లుల్లోనూ నైపుణ్యం అనే పదాన్ని జోడించాలి. ఎందుకంటే.. కెనడాలో, ఆస్ట్రేలియాలో ఉన్నట్లుగా మనకు కూడా నైపుణ్యాధారిత వలసలుండాలని భావిస్తున్నాను. అందుకే మంచి ట్రాక్ రికార్డున్న వారు మనదేశానికి వస్తే బాగుంటుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ: సరైన అనుమతి పత్రాలు లేకుండా చిన్నతనంలోనే తల్లిదండ్రులతోపాటు అమెరికా వెళ్లి,అక్రమంగా నివసిస్తున్న స్వాప్నికుల (డ్రీమర్స్)ను తిరిగి స్వదేశాలకు పంపేందుకు ప్రయత్నించిన ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పథకాన్ని రద్దు చేయాలన్నప్రతిపాదనను శాన్‌ఫ్రాన్సిస్కోలోని జిల్లా కోర్టు తిరస్కరించింది. విచారణ ముగిసేవరకు దీన్ని కొనసాగించాలని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment