వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా మధ్య నడిచే కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రంప్ పాలన, విధానాలను ఎండగడుతూ అవి ప్రచురించే కథనాలు.. వాటిని ‘పచ్చి అబద్ధాలు’’గా పేర్కొంటూ ఆయన విరుచుకుపడటం చూస్తున్నదే. అయితే ఎట్టకేలకు మాత్రం ఆయన ది న్యూ యార్క్ టైమ్స్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
కానీ, అధ్యక్షులవారి ఇంటర్వ్యూను చదివేందుకు అమెరికన్లు అస్సలు సాహసించటం లేదు. అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు, ఆరోపణలు, గందర గోళానికి గురి చేసే వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి రావటమే అందుకు కారణం. అర్ధ గంటపాటు సాగిన ఆ ఇంటర్వ్యూలో ఆయన 24 సమాధానాలు ఇస్తే అన్నీ అలాగే ఉన్నాయంట. ఈ కథనాన్ని వాషింగ్టన్ ప్రముఖంగా ప్రచురించగా.. ఇప్పుడు అది మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
రష్యన్ గూఢాచర్యం దగ్గరి నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న సమస్యల దాకా అన్నింటిపైనా ఆయన సమాధానాలు సహేతుకంగా లేవు. హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచార మేనేజర్ జాన్ పొడెస్టా రష్యన్ కంపెనీతో కుమ్మక్కయ్యారని ఆరోపించగా.. సదరు కంపెనీ అమెరికాకు చెందినదే కావటం విశేషం. ఇక అధ్యక్ష ఎన్నికల సమయంలో మిచిగాన్, విస్కాన్‌సిన్‌లో హిల్లరీ ప్రచారమే నిర్వహించకపోయినా.. ఆమె ‘పాపులర్ ఓట‍్ల’ కోసం అడ్డదారి తొక్కిందంటూ నోరు జారారు. పశ్చిమ వర్జీనియా ఆర్థిక ప్రగతి గురించి కూడా ఆయన చెప్పిన లెక్కలన్నీ తప్పుగానే తేలాయి.
మిడిల్ ఈస్ట్ దేశాలకు యూఎస్‌ఏ అందించిన ఆర్థిక సాయం విషయంలో కూడా ట్రంప్ అబద్ధాలే చెప్పుకొచ్చాడు. ఉత్తర కొరియా, కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తావనరాగా.. అది గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్య అని తప్పించుకునే యత్నం చేశాడు. మిత్ర దేశాలతో సహకారం విషయంపై అడిగిన ప్రశ్నకు కూడా ఆయన దారుణంగా తడబడ్డాడు. అన్నింటికి మించి కెనెడాతో ఆర్థిక లోటు విషయంలో చెప్పిన గణాంకాలను సుద్ధ తప్పు అని స్వయంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడెవూ చెప్పటంతో... ట్రంప్ ఇంటర్వ్యూ అంతా అస్తవ్యస్థంగా ఉందని.. ఏదో నామ మాత్రపు ఇంటర్వ్యూతో తప్పించుకునే యత్నం చేశారని డెమొక్రటిక్ పార్టీ విరుచుకుపడుతోంది. డిసెంబర్ 28న న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులు ట్రంప్‌ను ఇంటర్వ్యూ తీసుకున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment