మా అల్లుడు సూపర్.. గర్వంగా ఉంది: ట్రంప్
న్యూయార్క్: తన అల్లుడిని చూసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గర్వంతో ఉప్పొంగిపోతున్నారంట. రష్యాతో తనకు ఉన్న సంబంధాలను నిర్మొహమాటంగా, పారదర్శకతతో ఉన్నది ఉన్నట్లు ఏ మాత్రం దాచకుండా విచారణ కమిటీకి వెల్లడించడంపట్ల ట్రంప్ తన అల్లుడు, తనకు కీలక సలహాదారు అయిన జేర్‌డ్ కుష్నర్‌ను చూసి తెగ సంతోష పడుతున్నారని శ్వేతసౌదం మీడియా అధికారిక ప్రతినిధి సారా శాండర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. 'జేర్‌డ్ స్వచ్ఛందంగా సెనేట్ సెలక్ట్ కమిటీ ముందుకు వెళ్లడం, రష్యాతో తాను చేసిన ప్రతి సంభాషణను నిష్పక్షపాతంగా చెప్పడంపట్ల అధ్యక్షుడు ట్రంప్ చాలా గర్వపడుతున్నారు' అని ఆమె చెప్పారు.
జేర్‌డ్ చాలా గొప్ప కార్యం నిర్వహించారని, ఏదో ఉందని తనను వేదించేందుకు ప్రయత్నించిన వారికి ఇక ఏ విధంగాను ప్రశ్నించలేని విధంగా సమాధానం చెప్పారని ట్రంప్ భావిస్తున్నట్లు ఆమె వివరించారు. రష్యాతో సన్నిహిత సంబంధాలు ట్రంప్ అల్లుడికి ఉన్నాయని, ఎన్నికల సమయంలో రష్యా సహకారం తీసుకొని తప్పిదాలకు పాల్పడ్డారని కొంతకాలంగా ట్రంప్ కుటుంబంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తుతం సెనేట్ కమిటీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కమిటీ ముందుకు వెళ్లిన ట్రంప్ అల్లుడు జేర్‌డ్ రష్యాతో తాను ఎలాంటి లాలూచీ పడలేదని, ఆ దేశ ప్రతినిధులతో తనకు ఉన్న సంబంధాలను పూసగుచ్చినట్లుగా వివరించారట. లిఖిత పూర్వక సమాధానం కూడా వారికి ఇచ్చినట్లు వైట్ హౌస్ తెలిపింది.