పాక్.. తీరు మార్చుకో: ట్రంప్
వాషింగ్టన్: ఉగ్రవాదులకు పాక్ స్వర్గ దామంగా మారిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు కొనసాగిస్తోందని, ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుం దని హెచ్చరించారు. ఉగ్రవాద సంస్థలకు, తాలిబన్లకు పాక్ చేస్తున్న సాయంపై ఎక్కువ కాలం నిశ్శబ్దంగా ఉండబోమని స్పష్టం చేశారు. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా చేపట్టిన ఆపరేషన్లలో భాగస్వామిగా ఉంటూ పాకిస్తాన్ భారీ లబ్ధి పొందిందని, కాని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం ద్వారా కూడా భారీగానే నష్టపోతుందని హెచ్చరించారు.
శాంతి నెలకొల్పేందుకు భారత్‌తో కలసి పనిచేయాలని సూచించా రు. మంగళవారం వర్జీనియా రాష్ట్రం అర్లింగ్టన్‌లోని ఫోర్ట్ మేయర్‌లో తన పాలనా యంత్రాంగంలోని ముఖ్య అధికారులు సహా సుమారు 2 వేల మందిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. అఫ్గాన్‌లోని తమ సైనికులను వెనక్కి రప్పించే విషయంలో ఎలాంటి కాలపరిమితి లేదని స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్, దక్షిణాసియాపై తమ వ్యూహం మారిందని, అమెరికా దళాలు విజయం కోసమే పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం 8,500 దళాలు అఫ్గాన్‌లో ఉండగా.. మరో 4 వేల దళాలను అక్కడికి పంపనున్నట్లు సమాచారం.
భారత్ కీలక భాగస్వామి
తాము తెచ్చిన కొత్త ‘దక్షిణాసియా విధానం’.. భారత్‌తో వ్యూహాత్మక భాగ స్వామ్యాన్ని మరింత అభివృద్ధి పరచడంలో ముఖ్య భూమిక పోషించనుందని ట్రంప్ పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. భద్రత, ఆర్థిక రంగాల్లో అమెరికాకు కీలక భాగస్వామి’ అని పేర్కొన్నారు. ‘పొరుగు దేశమైన అఫ్గాన్‌లో శాంతి, స్థిరత్వం తీసుకొచ్చే ందుకు భారత్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. అమెరికాతో భారత్ బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది. అలాగే అఫ్గాన్‌కు ఆర్థిక చేయూతనిస్తూ ఆదేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని కోరుతున్నాం’ అని చెప్పారు. కాగా, పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిం దంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. మరోవైపు పాక్‌కు మిత్ర దేశం చైనా మరోమారు బాసటగా నిలిచింది.