మానసిక రోగులకు తుపాకులు: ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ వైపు దేశంలో విదేశీయులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూనే.. మానసిక రోగులు కూడా ఆయుధాలను కొనుక్కొవచ్చనే కొత్త రూల్‌ను పాస్ చేసినట్లు చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సారధ్యంలో మానసిక రోగులకు ఆయుధాల అమ్మకాన్ని నిషేధించారు. ఒబామా నిర్ణయాన్ని మార్చాలని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్‌లు నిర్ణయం తీసుకున్నాయని ఇందుకు సంబంధించిన బిల్లు రెండు వారాల క్రితమే పాసయిందని నెల రోజుల పరిపాలనపై మాట్లాడుతూ వెల్లడించారు ట్రంప్.
ట్రంప్ నిర్ణయంతో దాదాపు 75 వేల మంది మానసిక రోగులకు ఆయుధాలు కొనుక్కునే అర్హత కలుగుతుంది. గతంలో వీరందరికి ఉన్న లైసన్లను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. 2012లో దాదాపు 20 పాఠశాల విద్యార్థులను ఓ మానసిక రోగి కాల్చి చంపిన తర్వాత ఒబామా మానసిక రోగులు ఆయుధాలు కలిగివుండటంపై నిషేధం తీసుకువచ్చారు. అమెరికాలో తాజాగా భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగాయి. ఓ మానసిక రోగి హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్‌ను కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగి కొద్ది రోజులు కూడా గడవకముందే మానసిక రోగులు ఆయుధాలు కలిగివుండొచ్చనే ఆర్డర్లను ట్రంప్ సర్కారు తీసుకురావడం ఆందోళన కలిగించే విషయమే.