వాషింగ్టన్ : కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అమెరికాలో అందుబాటులోకి వస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ మీడియా సంస్థ ఫ్యాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయం చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందని చాలా నమ్మకంగా ఉందని అన్నారు. అన్ని రాష్ట్రాలు సెప్టెంబర్‌లో పాఠశాలలు, యూనివర్సిటీలు తెరవాలని కోరారు. వీలైనంత త్వరగా అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. (చదవండి : వుహాన్ నుంచే వైరస్ విడుదల.. ఆధారాలున్నాయి)
వ్యాక్సిన్ తయారీలో భాగంగా జరిపే హ్యుమన్ ట్రయల్స్ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. అందులో పాల్గొనేవారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఆ తర్వాత జరిగే పరిణామాలపై వారికి పూర్తి అవగాహన ఉంటుందని చెప్పారు. మరోవైపు కరోనాకు వ్యాక్సిన్‌ను తయారుచేయడం కోసం యూఎస్‌తోపాటుగా ఇతర దేశాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మాత్రం కరోనా వ్యాక్సిన్ తయారీకి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెబుతోంది. పలువురు నిపుణులు కూడా వ్యాక్సిన్ తయారీకి 12 నుంచి 18 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ ధీమాతో ట్రంప్ ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందని చెప్పారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇప్పటివరకు యూఎస్‌లో 11.8 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. దాదాపు 68 వేల మంది మృతిచెందారు.(చదవండి : కిమ్ తిరిగి రావడంపై ట్రంప్ ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment