పరిస్థితులకు తగ్గట్లు ప్రవర్తించడం నా డిక్షనరీలోనే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా ట్రంప్ భార్య మెలానియా ట్విటర్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో వివాదాస్పదమైంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలుడిని మెలానియా ఎత్తుకొనగా ట్రంప్ థమ్సప్ ఫోజు ఇచ్చారు. దీంతో ట్రంప్‌పై సోషల్‌మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. గతవారం అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 32మంది వరకు మరణించారు. ఈ కాల్పుల్లో రెండునెలల బాలుడి తల్లిదండ్రులు చనిపోయారు. బాలుడికి సైతం బుల్లెట్ తగిలి రెండు చేతి వేళ్లు తెగిపోయాయి.
అయితే ఈ ప్రాంతాన్ని ఇటీవలే సందర్శించిన ట్రంప్ దంపతులు ఆ బాలుడిని ఎత్తుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇంతవరకు ఓకే కానీ, ట్రంప్ థమ్సప్ ఫోజుతో చీర్స్ అన్నట్లుగా ఫోజు ఇవ్వడం పలువురి ఆగ్రహానికి కారణం అయింది. దీనిపై డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ‘ఎలాంటి సానుభూతి లేని ఓ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అయ్యాడని’ ఘాటుగా స్పందించారు. ట్రంప్ టెక్సాస్ పర్యటనకు మీడియాను అనుమతించలేదు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఈ ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ట్రంప్‌పై వస్తున్న విమర్శలపై ఆయన సానుభూతిపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో కూడా తప్పులు వెతికి రాజకీయం చేస్తున్నారంటే నైతికత లేనిది మీకేనని ఎదురుదాడి చేస్తున్నారు. కాగా ట్రంప్ పక్కనే నిలబడిన వ్యక్తి ఆ బాలుడి అంకుల్. పనిలో పనిగా అతను ట్రంప్ భుజాలపై చేయి వేసి నవ్వుతూ ఫోటోకు ఫోజు ఇచ్చేయడంపై ‘ట్రంప్ పక్కన ఉంటే ట్రంప్‌లాగే ఉంటారనడానికి చక్కటి ఉదాహరణ’ ఇదేనని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment