నేరేడుచర్ల/హుడా కాంప్లెక్స్ (హైదరాబాద్): అమెరికాలోని టెక్సాస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాటికొండ ఐశ్వర్య (27) మృతి చెందింది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఆమె.. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది. కొన్ని నెలల కిందే అక్కడ ఉద్యోగంలో చేరింది. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
షాపింగ్ కోసమని వెళ్లి..: ఐశ్వర్య కుటుంబం స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్ల. తాత రామనర్సింహారెడ్డి గతంలో ఎంపీపీగా పనిచేశారు. తండ్రి తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులోని ఆర్థిక వివాదాల పరిష్కారాల కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరు చాలా ఏళ్ల కిందటే హైదరా బాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం సరూర్‌నగర్ హుడాకాలనీలో ఉంటున్నారు. హైదరాబాద్‌లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య.. 2019 జనవరిలో ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లారు. టెక్సాస్ వర్సిటీలో ఎంఎస్ పూర్తిచేశాక.. అక్కడే పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా ఉద్యోగంలో చేరారు.
శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున) టెక్సాస్‌లోని డాలస్‌లో ఓ ఫ్రెండ్‌తో కలసి షాపింగ్‌కు వెళ్లింది. ఆ సమయంలో షాపింగ్ మాల్‌లోకి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. కాల్పుల్లో ఐశ్వర్య ముఖం ఛిద్రం కావడంతో తొలుత ఆమె ఎవరనేది తెలియలేదు. పోలీసులు వేలిముద్రల ఆధారంగా ఐశ్వర్యను గుర్తించి సోమవారం ఉదయం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఐశ్వర్య మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు మూడు రోజులు పట్టవచ్చని ఆమె సోదరుడు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
చదవండి: ఆస్ట్రేలియా తీరంలో వింతచేప.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
నా చిట్టి తల్లి ఇంకా ఫోన్ చేయలేదా?
అల్లారుముద్దుగా చూసుకున్న ఐశ్వర్య ఇక లేదనే విషయం తెలిసి ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కొన్ని నెలల కిందే హైదరాబాద్‌కు వచ్చి వెళ్లిన ఆమెను గుర్తు చేసుకుంటూ తండ్రి తాటికొండ నర్సిరెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. ‘‘నన్ను, అమ్మను వెంట తీసుకెళతానంది. తనతోపాటు నేను కూడా అక్కడే ఉండాలన్నది. నా చిట్టి తల్లి ఇంకా ఫోన్ చేయలేదా?’’ అంటూ ఆయన తీవ్రంగా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.
(చదవండి : అమెరికాలో ఉన్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?)
రోజూ ఫోన్ చేసి మాట్లాడేదని, వేళకు మందులు వేసుకోవాలని చెప్పేదని, ఇంతలోనే తమకు శాశ్వతంగా దూరమైందంటూ ఐశ్వర్య తల్లి విలపించింది. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన తన మనవరాలు దుండగుడి కాల్పుల్లో మృతిచెందడం దురదృష్టకరమని ఐశ్వర్య తాత తాటికొండ రామనర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: బంగారు గనిలో ప్రమాదం.. 27 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment