
'డిక్టేటర్'ను తక్కువగా అంచనా వేయొద్దు...
కాలిఫోర్నియా: నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తాడంటూ ప్రపంచదేశాలు ఆ నేతపై మండిపడుతున్నప్పటికీ.. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ను తక్కువగా అంచనా వేయొద్దని వ్యాఖ్యానించారు. ఆయన అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. సంచలనవ్యాఖ్యలు చేసే ట్రంప్ మరోసారి వివాదానికి తెరతీశారు. చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నాడంటూ నార్త్ కొరియా 'డిక్టేటర్' ను తెగ పొగిడేశాడు. గత నెలలో అతి ప్రమాదకరమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించి సక్సెస్ అయ్యామని ఆ దేశం ప్రకటించడంపై ప్రపంచదేశాల నుంచి కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర విమర్శల పాలయ్యాడు.
దక్షిణ కాలిఫోర్నియా, ఫ్లోరెన్స్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ... కిమ్ జాంగ్ ఉన్ టాలెంట్ ను తక్కువగా అంచనా వేయొద్దని.. తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మృతిచెందిన తర్వాత దేశాన్ని చాలా సులువుగా నియంత్రణలోకి తెచ్చుకున్నాడంటూ ప్రశంసించాడు. నార్త్ కొరియా నియంతగా పిలువబడే కిమ్ జాంగ్ ఉన్ ను ట్రంప్ పొగడటం ఇది రెండోసారి. సుదీర్ఘ దూరాలలోని లక్ష్యాలను చేధించగల క్షిపణిని ప్రయోగించామని నార్త్ కొరియా ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయనను మరోసారి దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు. గతనెలలో లోవాలో ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఆ ప్రాంతంలో ఇటీవల జరిగిన పోలింగ్లో చాలా తక్కువ ఓట్లు సాధించి ట్రంప్ ఓటమి పాలైన విషయం విదితమే.