
తెరపైకి ట్రంప్ కోడలు
ఆష్ బర్న్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు హిల్లరీ క్లింటన్ వైపే మొగ్గుచూపుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్... ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం తన కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు.
వర్జీనియాలోని లాడన్ కౌంటీలో రాజధాని హిందూ దేవాలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ కోడలు లారా పాల్గొన్నారు. పనిలో పనిగా తన మామగారికి ఓటు వేయాలని ప్రవాస భారతీయులను అభ్యర్థించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్- అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అన్నారు. భారతదేశం అన్నా, భారతీయులన్నా తన మామగారికి ఎంతో అభిమానమని చెప్పారు. భారతీయ సంస్కృతిని తాను ఎంతోగానే గౌరవిస్తానని పేర్కొంటూ చెప్పులు బయట విడిచిపెట్టి ఆమె ఆలయంలోకి ప్రవేశించారు. హిందూ సాంప్రదాయాలు అంటే తనకెంతో ఇష్టమని ట్రంప్ రెండో కుమారుడు ఎరిక్ భార్య అయిన లారా చెప్పారు.
ట్రంప్ కుమార్తె ఇవాంకా ఇక్కడికి రావాల్సివుంది. అయితే ఆమె వేరే చోటికి వెళ్లాల్సిరావడంతో లారా ఈ వేడుకలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థులకు చెందిన కుటుంబంలోని సభ్యురాలు హిందూ ఆలయానికి రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. లారాకు ప్రవాస భారతీయ సంఘం నేత రాజేశ్ గూటి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానికులతో మమేకం అయేందుకు పండుగలు దోహం చేస్తాయని పేర్కొన్నారు.