
పోలీసును కారుతో ఢీ కొట్టి అలానే..
వేగంగా పోతున్న కారు, ముందు భాగంలో ఓ పోలీసు అధికారి. అచ్చం సినిమాల్లో స్టంట్లా కనిపించే వాస్తవ సంఘటనకు చెందిన దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. తప్పించుకునే ప్రయత్నంలో ఓ దుండగుడు కారుతో పోలీసు అధికారిని ఢీ కొట్టాడు. ఉత్తర చైనాలోని టియాజిన్ మున్సిపాలిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సీసీకెమెరాల్లో రికార్డయిన వీడియో ఫుటేజిని పోలీసులు విడుదల చేశారు.
వివరాలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన దుండగుడిని ఇద్దరు పోలీసులు వెంబడించారు. గ్యాస్ బంకు దగ్గర ఆగడంతో అతన్ని లైసెన్స్ చూపించాల్సిందిగా ఆదేశించారు. అతని దగ్గర ఉన్నవి నకిలీ ధృవ పత్రాలు అని పోలీసులు నిర్ధారణకు వచ్చేలోపే దుండగుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారును ఆపాలని చూసిన ఓ పోలీసు అధికారి, కారు ఢీకొట్టడంతో ముందు భాగం పై పడ్డాడు. అయినా కారును ఆపకుండా అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పై అతి వేగంగా పోనిచ్చాడు. ఈ మొత్తం తతంగం అక్కడే ఉన్న ట్రాఫిక్ సీసీ కెమరాల్లో చిక్కాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం నుంచి గాయాలతో పోలీసు అధికారి బయటపడ్డాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.