
డ్రైవింగ్ టెస్ట్ అయిపోయి లైసెన్స్ పొందిన 10 నిమిషాలకే ఓ వ్యక్తి కారుతో నదిలోకి దూసుకెళ్లిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన జూంగ్ అనే వ్యక్తి ఇటీవలే కారు డ్రైవింగ్ పరీక్షలో పాసై లైసెన్స్ తీసుకున్నాడు. లైసెన్స్ పొందిన ఆనందంలో సొంతంగా కారు నడుపుకుంటూ రైడ్‌కు వెళ్లాడు. మార్గమధ్యలో వంతెనపై వెళుతుండగా ... అతగాడు ఫోన్ చూసుకుంటూ ఉండగా, ఒక్కసారిగా కారు అదుపు తప్పి పక్కనే ఉన్న నదిలోకి కారు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు జూంగ్ ప్రాణాలతో బయటపడ్డాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సంఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన కారు ప్రమాద దృశ్యాలను స్థానిక అధికారులు... సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఇక దీనిపై జూంగ్ మాట్లాడుతూ.. ‘నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వంతెనపై ఇద్దరూ వ్యక్తులు నా కారుకు ఎదురుగా వచ్చారు. అదే సమయంలో స్నేహితులు పంపించిన మెసేజ్‌లు చదువుతున్నాను. అయితే వారిని గమనించి కారును పక్కకు తిప్పే క్రమంలో నదిలోకి దూసుకెళ్లింది’ అని వివరించాడు. అదే సమయంలో కారు డోర్ తెరుచుకోవడంతో ఈ ఘటన నుంచి తప్పించుకోగలిగానని చెప్పుకొచ్చాడు. అనంతరం అధికారులు తన కారును క్రేన్ సాయంతో నది నుంచి బయటకు తీయించినట్లు జూంగ్ తెలిపాడు.