తాగదు... తూలదు!
ఈ బస్సు పెట్రోల్ తాగదు. ఎందుకంటే విద్యుత్‌తో నడుస్తుంది. ఈ బస్సు నిద్రకు తూలదు. ఎందుకంటే ఇందులో డ్రైవర్ ఉండడు. బస్సు నడిపేటప్పుడు డ్రైవర్ వేరే ధ్యాసలో ఉన్నా... కాస్త నిద్రమత్తుతో జోగుతున్నట్టు కనిపించినా మనకు గుండెలు దడదడా కొట్టుకుంటాయి. అలాంటిది బస్సును కంట్రోల్ చేయడానికి అసలు డ్రైవరే లేకపోతేనో? అమ్మో అనిపిస్తోంది కదూ! కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే భవిష్యత్తులో బస్సుల్ని డ్రైవర్లు నడపరు... వాటికవే నడుస్తాయి!
బస్సు అంటే కండక్టర్ రైట్ రైట్ అంటుండాలి. స్టీరింగ్ పట్టుకుని డ్రైవర్ బస్సుని నడుపుతుండాలి. ఇదీ మనం చూసేది, ఊహించేది కూడా. కానీ ఇది 21వ శతాబ్దం. పాత వాసనలను వదిలించుకుని టెక్నాలజీ ఆసరాతో కొత్తకొత్త వింతల్ని సృష్టిస్తున్న కాలం. అలాంటి ఓ వింతే... ఈ ఈజెడ్-10 బస్సు. దీనిలో డ్రైవర్ ఉండడు. స్టీరింగ్ వీలే కనపడదు. అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అడ్డంకులను అధిగమిస్తూంటే... జీపీఎస్ వంటి అప్లికేషన్ల సాయంతో సాగిపోతుంది. గమ్యం చేరిపోతుంది. ఇంతకీ ఎక్కడుందీ బస్సు?!
పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఈ బస్సును ఫిన్లాండ్‌లో చాలాకాలంగా వాడుతున్నారు. ఒకేసారి 12 మంది వరకూ ప్రయాణం చేయవచ్చు. ముందుగా నిర్దేశించిన మార్గంలో షటిల్ సర్వీస్ చేసేందుకు వాడుతున్నారు దీన్ని. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈజెడ్-10 మెట్రో స్టేషన్లను, బస్టాండ్‌లను అనుసంధానించేందుకు, పెద్ద పెద్ద మాల్స్ లేదా ఎయిర్‌పోర్టుల్లో ఒకవైపు నుంచి ఇంకోవైపునకు వెళ్లేందుకు బాగా ఉపయోగపడుతుందని అంచనా. బస్సు, ట్రామ్‌ల మాదిరిగా దీనికి ఏ విధమైన మౌలిక సదుపాయాలూ అవసరం లేదు. నిర్దేశిత రూట్లలో మొబైల్ యాప్ ద్వారా కూడా బస్సు సర్వీసు పొందవచ్చు. బస్సు రాగానే దానిపైన ఉండే బటన్ నొక్కితే తలుపులు తెరుచుకుంటాయి. వికలాంగులు లేదా చిన్నపిల్లల ట్రాలీతో ఉండేవారి కోసం ప్రత్యేకమైన ర్యాంప్ కూడా ఉంది.