
ఓ బాతు సాహసం
చెరువులో పిల్లలతో పాటు ఈదుతున్న ఓ బాతు.. తల్లి ప్రేమకు తార్కాణంగా నిలిచింది. భుజాలపై పిల్లల బాధ్యతను మోస్తూ.. ప్రత్యక్షంగా సాక్షాత్కరించింది. తన పిల్లలన్నింటినీ తీసుకుని చెరువులో రయ్యిన ఈదుతూ పోవడం చూపరులను ఆకట్టుకుంది. ఓ ఫొటో గ్రాఫర్ కెమెరాను క్లిక్‌మనిపించేలా చేసింది.
ఇంగ్లాండ్ రోచ్ డాలె.. లాంక్‌షైర్‌లో 16 పిల్లలతో ఓ బాతు.. చెరువును దాటడం సందర్శకులను ఆశ్చర్యపరచింది. అతి పెద్ద కుంటుంబాన్ని సాకడం అత్యంత కష్టమైన విషయం. అయితేనేం ఆ బాతు మాత్రం తల్లి ప్రేమకు హద్దులుండవని నిరూపించింది. తన 16 పిల్లలతో లక్ష్యాన్ని చేరేందుకు ప్రయత్నించింది. ఆరు పిల్లలను వీపుపైన, మిగిలిన వాటిని ఒకదాని వెనుక ఒకటి ఉండేలా చూసుకుని.. కుటుంబంతో పాటు.. సునాయాసంగా చెరువు దాటింది. బాతు ప్రయత్నం సందర్శకులకు కనువిందు చేసింది. క్వీన్స్ పార్క్ హేవుడ్ లోని చెరువులో కనిపించిన ఈ దృశ్యాన్ని చూసిన... 49 ఏళ్ళ మార్క్ క్రైమ్స్ తన కెమెరాలో బంధించాడు.
''బాతు వీపుపై మోస్తున్న పిల్లల సంఖ్య లెక్క పెట్టిన నేను నిజంగా నమ్మలేకపోయాను. అంత చిన్న ప్రాణానికి అది ఎలా సాధ్యమయ్యింది అని ఆశ్చర్యపోయాను. నిజానికి బాతులు కెమెరాను చూస్తే పక్కకు వెళ్లిపోతాయి. ఫొటో తీసేవరకూ ఆగవు. అలాంటిది నా కెమెరాకు ఈ దృశ్యం చిక్కడం ఎంతో ఆనందంగా ఉంది'' అంటున్నాడు ఫొటోగ్రాఫర్ మార్క్ క్రైమ్స్. బాతులు సాధారణంగా 12 గుడ్లను పెడతాయని, ఈ బాతు 16 పిల్లలతో చాలా పెద్ద కుటుంబాన్ని సాకడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందని మార్క్ అంటున్నాడు.