ఈ సిగరెట్లతో నోటి సమస్యలు
న్యూయార్క్: ఎలక్ట్రానిక్ సిగరెట్లు సైతం ఇతర సిగరెట్ల మాదిరిగానే నోటి సమస్యలకు కారణమౌతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ-సిగరెట్ల ద్వారా వచ్చే పొగ నోటిలోని కణాలను ప్రేరేపించడం వలన.. వాటిలో తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని.. ఇది అనేక నోటి సమస్యలకు కారణమౌతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని రోచెస్టర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ ఇర్ఫాన్ రహ్మాన్ వెల్లడించారు.
ఈ-సిగరెట్లలో.. బ్యాటరీ సహాయంతో కాట్రిడ్జ్‌లోని లిక్విడ్ వేడెక్కడం ద్వారా పొగ వెలువడుతుంది. దీనిలో సాధారణంగా కొన్ని ఫ్లేవర్స్, రసాయనాలు, నికోటిన్ ఉంటాయి. ఎంత తరచుగా ఈ సిగరెట్లను ఉపయోగిస్తున్నారనే దానిపై అది నోటిపై చూపించే దుష్ప్రభావాల తీవ్రత ఆధారపడి ఉంటుందని రహ్మాన్ వెల్లడించారు. ఈ-సిగరెట్‌లోని ఫ్లేవర్స్ సైతం చిగుళ్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని 3-డీ టెక్నాలజీ సహాయంతో నిర్వహించిన పరిశీలనలో తేలిందని ఆయన తెలిపారు.