E-cigarettes
-
కళాశాలల్లో ‘నిషా పెన్’ !
సాక్షి, అమరావతి బ్యూరో : ఈ–సిగరెట్.. దీనిపై కేంద్ర ప్రభుత్వం గత నెల 18వ తేదీ నుంచి నిషేధం విధించింది. అయినప్పటికీ రాజధాని నగరం విజయవాడలో వీటి అమ్మకాలు, కొనుగోళ్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలోని ఓ కళాశాలలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేయగా ఈ–సిగరెట్ల బాగోతం వెలుగుచూసింది. విద్యార్థులు గంజాయితోపాటు వీటిని కూడా వినియోగిస్తున్నట్లు బహిర్గతమైంది. ప్రస్తుతం వీటి తయారీ, దిగుమతి, ఎగుమతి, విక్రయాలు, నిల్వ, పంపిణీ, ప్రచారం అన్నిటిపైనా నిషేధం అమలులో ఉంది. కానీ నగరంలో చాపకింద నీరులా ఈ–సిగరెట్ విక్రయాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎంతో ప్రమాదం.. ధూమపానం ప్రస్తుతం ఓ ఫ్యాషన్‌గా మారింది. ఊపిరితిత్తుల వ్యాధులతో మృతి చెందుతున్న వారిలో పొగ బాధితులే అధికం. పొగ ఊపిరితిత్తులకు చేరుకోగానే, గుండె ఎక్కువ శ్రమించాలి. సాధారణం కంటే ఇది 10–25 నిమిషాలు అదనంగా కొట్టుకోవాలి. రక్తపోటులో హెచ్చుతగ్గులు కన్పిస్తాయి. ప్రతి దమ్ముకు రక్తపోటు 10–15 శాతం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఆస్పత్రులకు వస్తున్న నోటి క్యాన్సర్ రోగుల్లో 40 శాతం పొగాకు బాధితులే. ఇంట్లో పొగ తాగే వారి కారణంగా మిగతా సభ్యులూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆస్తమా, దగ్గు, ఇతర ఊపిరితిత్తుల ఇబ్బందులతో ఆసుపత్రులకు వస్తున్నారు. ఇక 1 నుంచి 10 సిగరెట్లు తాగేవారిలో క్యాన్సర్ ప్రమాదం 20 శాతం ఉండగా 11–20 శాతం వరకు పీల్చేవారిలో 31 శాతం.. 21 ఆపైన 57 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ సిగరెట్ అంటే.. సాధారణ సిగరెట్లలో నికోటిన్, అసిటోన్, అమెనియా, ఆర్సెనిక్, బెంజిన్, బ్యూటేన్, కాడ్మియం, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనేడ్, మిథనాల్, నాఫ్తలీన్, నికెల్, ప్రొపైన్, స్టిరియారిక్ ఆమ్లం తదితర రసాయనాలు నేరుగా మనిషి దేహంపై ప్రభావం చూపుతాయి. ఇక ఈ–సిగరెట్‌ను ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్(ఈఎన్‌డీఎస్) అని వ్యవహరిస్తారు. దీనిలో నికోటిన్ మాత్రమే కాక ప్రొపైలిన్ గ్లెకాల్ అనే రసాయనం కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకమని వైద్యులు చెబుతున్నారు. ద్రవ రూపంలో ఉన్న నికోటిన్ ఎలక్ట్రానిక్ పరికరంలో ఉంటుంది. అందులో బ్యాటరీ అమర్చి ఉంటుంది. నోట్లో పెట్టుకొని పీల్చినప్పుడు బ్యాటరీ నికోటిన్‌ను మండిస్తుంది. దీర్ఘంగా పీల్చే అవకాశం ఉంటుంది. దీంతో ధారాళంగా పొగ ఊపిరితిత్తులకు చేరి శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కసారి అలవాటు పడితే బయటకు రావడం కష్టమే. తొలుత ఒక దమ్ము.. రానురాను రోజుకు 10–20 దమ్ముల వరకు వెళుతుంది. దీనిని మానేసేందుకు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సూచనలతో నికోటిక్ ఛూయింగ్గమ్తో పాటు నికోటిక్ ప్యాచ్ వాడితే కొంత వరకు ప్రయోజనం ఉంటుంది. నిషా పెన్ ఇదే ఇంజినీరింగ్ విద్యార్థులే అధికం.. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్, స్వయంప్రతిపత్తి విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే విద్యార్థులు గంజాయి మత్తులో జోగుతున్నారు. ఇటీవల కాలంలో కిలోల కొద్దీ అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. విచారణలో ఇది విద్యార్థుల కోసం రవాణా చేసినట్లుగా తేలింది. తాజాగా ఈ–సిగరెట్ విక్రయాలు, వినియోగం కూడా సాగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. -
ప్రజలు పొగాకుకు దూరంగా ఉండాలి : మోదీ
న్యూఢిల్లీ : దేశ ప్రజలు పొగాకుకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇ సిగరెట్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి ప్రస్తావించారు. అలాగే దేశ ప్రజలకు నవరాత్రి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రి దేశ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే తను అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్తో మాట్లాడే అవకాశం లభించిందని మోదీ పేర్కొన్నారు. లతాజీ 90వ వసంతంలోకి అడుగుపెడుతున్నారని.. ఆమెను మనం దీదీ అని సంబోధించాల్సి ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సిగరెట్లు చాలా ప్రమాదకరమైనవి. ఆరోగ్యం మీద ఇవి చెడు ప్రభావాన్ని చూపుతాయి. పొగాకు వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టం. పొగాకు బారిన పడిన చాలా మంది క్యాన్సర్, బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత మానసిక ఎదుగుదల మీద ఇది చెడు ప్రభావన్ని చూపెడుతుంద’ని అన్నారు. అలాగే వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడిన మోదీ.. మహాత్ముని 150 జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ప్రజలంతా నిషేధించాలి. 130 కోట్ల మంది భారతీయులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడకాన్ని నిషేధిస్తూ ప్రతిజ్ఞ తీసుకోవడం దేశానికే కాకుండా, ప్రపంచానికే గర్వకారణం. దేశ ప్రజలంతా ఇందుకు సహకరిస్తారనే నమ్మకం తనకుంద’ని ధీమా వ్యక్తం చేశారు. దీపావళి రోజున కూతుళ్లను గౌరవిద్దాం.. పండుగ సందర్భంగా కుటుంబాల్లో ఎంతో సందండి నెలకొంటుంది.. ఇలాంటి సందర్భంలో పండుగ జరుపుకోలేని వారికి సాయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీపావళి రోజున లక్ష్మి దేవి ప్రతి ఒక్కరి ఇళ్లలోకి ఆనందాన్ని, సంపదను తీసుకురావాలని ఆకాంక్షించారు. మన ఇళ్లలోని కూతుళ్ల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మన కూతుళ్లు సాధించిన ఘనత ప్రపంచానికి తెలిసేలా.. వారి విజయాలను సోషల్ మీడియాలో #BHARATKILAXMI హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయాలని కోరారు. గతంలో ‘సెల్ఫీ విత్ డాటర్’ ఏ విధంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ దీపావళి రోజున కూతుళ్లను గౌరవిద్దామని మోదీ పేర్కొన్నారు. -
సంపద పెంచుకోవడానికే కదా నిషేధం!
న్యూఢిల్లీ: ఇ- సిగరెట్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇ-సిగరెట్లతో పాటు మొత్తంగా పొగాకు ఉత్పత్తులన్నింటిపై నిషేధం విధించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా అత్యధిక ఆదాయం ఇచ్చే పొగాకు సిగరెట్లపై కూడా నిషేధం విధించడానికి కేంద్రానికి మనసు ఎలా ఒప్పుతుందిలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇ-సిగరెట్ల తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, పంపిణీ, నిల్వ, అమ్మకాలు, సిగరెట్ల వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. అమెరికాలో ఇ-సిగరెట్లు యువతను ఎంతగా బలి తీసుకుంటున్నాయో గ్రహించాక ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకొని నిషేధం విధించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా ఇ-సిగరెట్లపై నిషేధంతో ఖజానాకు రూ.2,028 కోట్ల నష్టం వాటిల్లే వీలుంది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఎవరి దగ్గరైనా ఇ-సిగరెట్లు ఉంటే వారికి (తొలిసారి) రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మళ్లీ నేరం చేస్తే రూ.5లక్షల జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు.(చదవండి : 460 బ్రాండ్లు.. 7,700 ఫ్లేవర్లు..ఎందుకు హానికరం) ఇక ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు...‘ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇ-సిగరెట్లను నిషేధించలేదు. ఖజానాను నింపుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ సిగరెట్లపై నిషేధం విధిస్తే ఇబ్బడిముబ్బడిగా వచ్చే ఆదాయం కోల్పోతారు కదా. అందుకే వాటిని నిషేధించే ధైర్యం చేయలేరు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే అన్ని రకాల సిగరెట్లపై నిషేధం విధించాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా..‘ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పొగాకు ఉత్పత్తుల వినియోగదారుల జాబితాలో భారత్ ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. పొగాకు ఉత్పత్తుల కారణంగా ఏడాదికి 9 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్‌లో వీటి గురించి ప్రస్తావన లేదు. చాలా ఆనందం. ఇ- సిగరెట్లపై నిషేధంతోనే సరిపెట్టండి. బాగుంది అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. సిగరెట్ తాగే అలవాటు మానుకోవడానికి ఇ- సిగరెట్లు ఆశ్రయించే వారు ఇప్పుడు సాధారణ సిగరెట్ కాలుస్తారు. కాబట్టి వాటిని అమ్మే వారి ఆదాయం బాగానే పెరుగుతోంది అంటూ వివిధ రకాల మీమ్స్‌తో విమర్శలు గుప్పిస్తున్నారు. Banning #ecigarettes by the Government is not because of Health, It is because of Wealth. They'll not ban regular cigarettes, because of heavy revenue from it. If they really cares about the Health and Disease , then they have to ban the entire cigarette of all types. pic.twitter.com/EtXOpAOTfg — Md Furquan Ahmad (@FurquanAMU) September 18, 2019 The short journey of #ecigarettes Dealers, retailers and smokers pic.twitter.com/jsdwtLZ6Kz — gajender (@gajender00) September 18, 2019 -
ఇ–సిగరెట్లపై నిషేధం
న్యూఢిల్లీ : ఇ–సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇ–సిగరెట్ల తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, పంపిణీ, నిల్వ, అమ్మకాలు, సిగరెట్ల వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇ–సిగరెట్లపై నిషేధంతో ఖజానాకు రూ.2,028 కోట్ల నష్టం వాటిల్లే వీలుంది. ఎవరి దగ్గరైనా ఇ–సిగరెట్లు ఉంటే వారికి (తొలిసారి) రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మళ్లీ నేరం చేస్తే రూ.5లక్షల జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఇ–సిగరెట్లను నిల్వ చేయడం నేరమే. వీరికి రూ.50 వేల వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష వరకు విధిస్తారు. ఇ–సిగరెట్లను నిల్వ చేసినవారు ఆర్డినెన్స్ అమలయ్యే నాటికి వాటిని సమీప పోలీస్ స్టేషన్లలో జమ చేయాలి. జూల్ ల్యాబ్స్, ఫిలిప్ మారిస్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు తమ ఇ–సిగరెట్ వ్యాపారాలను భారత్‌కు విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై చట్టం తీసుకురానున్నారు. అమెరికాలో ఇ–సిగరెట్లు యువతను ఎంతగా బలి తీసుకుంటున్నాయో గ్రహించాక ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకొని నిషేధం విధించామని నిర్మల చెప్పారు. ఇ–సిగరెట్లను చూపుతున్న మంత్రి నిర్మల ఇ–సిగరెట్లు ఎందుకు హానికరం ? ఇ–సిగరెట్లలో ద్రవరూపంలో ఉండే నికోటిన్ అనే పదార్థం వేడెక్కి ఆవిరిగా మారి పొగ పీల్చడానికి అనువుగా మారుతుంది. సంప్రదాయంగా పొగాకు తాగడం, సిగరెట్లు కాల్చడం కంటే ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరమనే వివిధ నివేదికలు వెల్లడించాయి. పొగతాగడం కంటే ఇ–సిగరెట్స్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని, ఇ–సిగరెట్లను నిషేధించాల్సిన సమయం వచ్చిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ‘ప్రస్తుతం అమెరికా కంటే భారత్‌లోనే ఇ–సిగరెట్లను పీల్చడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అయితే నగరాలకే ఈ ట్రెండ్ పరిమితం కావడంతో వ్యాధులు, మృతులు వంటివేవీ వెలుగులోకి రాలేదు’ అని పల్మనాలజిస్ట్ అర్జున్ ఖన్నా అన్నారు. 460 బ్రాండ్లు.. 7,700 ఫ్లేవర్లు భారత్‌లో 460 ఇ–సిగరెట్ బ్రాండ్లు 7,700 ఫ్లేవర్స్‌లో లభిస్తున్నాయి. అయితే ఇవేవీ భారత్‌లో తయారవడం లేదు. 20 సిగరెట్లలో ఎంత నికోటిన్ ఉంటుందో, ఇ–సిగరెట్ ఒక్క కేట్రిడ్జ్‌లో అంతే పరిమాణంలో నికోటిన్ ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇ–సిగరెట్లపై నిషేధం విధించారు. అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, థాయ్‌లాండ్ సహా 31 దేశాలు ఇ–సిగరెట్లపై నిషేధం విధించాయి. అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రం వీటిపై నిషేధం విధించింది. అమెరికాలో దాదాపు 30 లక్షల మంది రెగ్యులర్‌గా ఇ–సిగరెట్లను వాడుతున్నారు. 2011–16 సంవత్సరాల మధ్య వీటి వాడకంలో 900 శాతం వృద్ధి నెలకొంది. పొగాకు వల్ల వచ్చే వ్యాధులతో భారత్‌లో ప్రతీ ఏడాది 9 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచంలో చైనా తర్వాత పొగ తాగే వారు అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారు. మొత్తంగా 10.6 కోట్ల మంది పొగాకు బానిసలుగా మారారు. -
కేంద్రం కీలక నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ర్టానిక్ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ వివరాలను వెల్లడించారు. దేశంలోని యువతపై ఈ-సిగరెట్లు చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని, దానిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ, వాడకంపై నిషేధం విధిస్తున్నాం. వాటిపై ప్రకటనలు, విక్రయం కూడా ఇక నేరమే. దీనికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది’ అంటూ కేబినెట్ నిర్ణయాలను నిర్మలా వివరించారు. పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట్లను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ-సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్‌గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో స్మోకర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దీనికి కేంద్ర కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. -
ఈ సిగరెట్లతో నోటి సమస్యలు
న్యూయార్క్: ఎలక్ట్రానిక్ సిగరెట్లు సైతం ఇతర సిగరెట్ల మాదిరిగానే నోటి సమస్యలకు కారణమౌతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ-సిగరెట్ల ద్వారా వచ్చే పొగ నోటిలోని కణాలను ప్రేరేపించడం వలన.. వాటిలో తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని.. ఇది అనేక నోటి సమస్యలకు కారణమౌతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని రోచెస్టర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ ఇర్ఫాన్ రహ్మాన్ వెల్లడించారు. ఈ-సిగరెట్లలో.. బ్యాటరీ సహాయంతో కాట్రిడ్జ్లోని లిక్విడ్ వేడెక్కడం ద్వారా పొగ వెలువడుతుంది. దీనిలో సాధారణంగా కొన్ని ఫ్లేవర్స్, రసాయనాలు, నికోటిన్ ఉంటాయి. ఎంత తరచుగా ఈ సిగరెట్లను ఉపయోగిస్తున్నారనే దానిపై అది నోటిపై చూపించే దుష్ప్రభావాల తీవ్రత ఆధారపడి ఉంటుందని రహ్మాన్ వెల్లడించారు. ఈ-సిగరెట్‌లోని ఫ్లేవర్స్ సైతం చిగుళ్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని 3-డీ టెక్నాలజీ సహాయంతో నిర్వహించిన పరిశీలనలో తేలిందని ఆయన తెలిపారు. -
ఎలక్ట్రానిక్ సిగరెట్లతోనూ ప్రమాదమే!
లండన్ః ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రానిక్ సిగరెట్ గురించి వినే ఉంటారు. ధూమపాన ప్రియులకు ప్రత్యామ్నాయంగా ఈ ఇ-సిగరెట్ ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆధునిక పరిజ్ఞానం కూడ ఒక్కోసారి నష్టాన్నే తెచ్చి పెడుతుందంటున్నారు తాజా పరిశోధకులు. సిగరెట్ వ్యసనం మానుకోవాలనుకునే వారికోసం సృష్టించిన ఇ-సిగరెట్లలో పొగాకు కు బదులుగా ఆవిరితో తయారయ్యే నికోటిన్ కలిసిన పొగతో ఎలక్ట్రానిక్ సిగరెట్ అందుబాటులోకి తెచ్చారు. అయితే ధూమపానం మానేయాలనుకునే వారికోసం కనిపెట్టిన వీటివల్ల కూడ అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఇ-సిగరెట్ల ను రద్దు చేసే యోచనలో పడింది. పొగరాయుళ్ళకు నికోటిన్ తో కూడిన నీటి ఆవిరిని పీల్చే పద్ధతిలో ఉపశమనాన్ని కలిగిస్తున్న ఇ-సిగరెట్లు తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. పొగాకుతో తయారు చేసిన సిగరెట్ల వాడకాన్ని మానుకునే క్రమంలో లండన్ యువత ఎలక్ట్రానిక్ సిగరెట్లను ఆశ్రయిస్తున్నారని, ఇకపై వీటినికూడ వైద్యుల సలహా మేరకు తప్పించి వాడవద్దని అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. తక్కువ ధరలో దొరకడమే కాక, క్యాన్సర్ వంటి ఇతర సమస్యలకు దారి తీయకుండా ఉంటుందన్న ఆలోచనలో ఇ-సిగరెట్లను పరిచయం చేశారు. అయితే వీటి వాడకం కూడ అధికం అవ్వడంవల్ల సమస్యలు తలెత్తుతాయని, ఊపిరితిత్తులపై ప్రత్యక్ష ప్రభావం పడుతోందని సైంటిస్టులు చెప్తున్నారు. యువత అత్యధికంగా ఇ-సిగరెట్లకు బానిసలౌతున్నారంటూ పరిశోధకులు తమ అధ్యయనాల వివరాలను బీఎంసీ పబ్లిక్ హెల్గ్ ఓపెన్ యాక్సెస్ జర్నల్ లో ప్రచురించారు. వయోజనులు ధూమపాన వ్యసనాన్ని తగ్గించుకునేందుకు పరిచయం చేసిన ఇ-సిగరెట్లు యువతకు నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయని, ఈ విషయాన్ని పాలసీ మేకర్లు పరిగణలోకి తీసుకోవాలని బ్రిటన్ లోని స్టిర్లింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన కాథరిన్ బెస్ట్ చెప్తున్నారు. స్కాట్లాండ్ లోని ఉన్నత పాఠశాలల్లో ఇ-సిగరెట్ల అంశంపై సర్వే నిర్వహించారు. దీనిలో 11 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసున్న విద్యార్థుల్లో కొందరు వాటి గురించి విన్నామని, కొందరు ఇప్పటికే ఉపయోగించి చూశామని, మరి కొందరు మరో ఆర్నెల్లలో ప్రయత్నిద్దామనుకుంటున్నామని తెలిపారు. దీన్నిబట్టి భవిష్యత్తులో ఇ-సిగరెట్ల వాడకం మరింత పెరిగే అవకాశం ఉందని.. దీంతో క్రమంగా నికోటిన్ కు అలవాటుపడిన వారు మామూలు పొగాకు సిగరెట్లవైపు కూడ మొగ్గు చూసే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
అవి టీనేజర్లను ప్రేరేపిస్తున్నాయ్!
లండన్: సిగరెట్ అలవాటు ఉన్న వారిని మాన్పించడానికి మార్కెట్లోకి వచ్చిన ఈ-సిగరెట్ల గురించి ఓ విస్మయపరిచే నిజం తెలిసింది. మార్కెట్లో ఈ-సిగరెట్ల మితిమీరిన ప్రమోషన్ వల్ల స్మోకింగ్‌ను వదిలేసే వారి సంగతి అలా ఉంచితే.. కొత్తగా మొదలుపెట్టేవారి సంఖ్య పెరుగుతోందట. ముఖ్యంగా ఈ-సిగరెట్లు.. టీనేజర్లను విపరీతంగా ఆకట్టుకొని అటువైపు లాగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ స్టిర్లింగ్ పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో తేలింది. ఈ-సిగరెట్ల ప్రమోషన్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని, లేదంటే 11 ఏళ్ల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులోని వారు వీటి ప్రభావానికి ఆకర్షితులౌతున్నారని పరిశోధనలో పాల్గొన్న కేథరిన్ బెస్ట్ పేర్కొన్నారు. సుమారు నాలుగు వేల మంది పాఠశాల విద్యార్థులపై జరిపిన పరిశీలనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ-సిగరెట్లను కేవలం వయోజన పొగరాయుళ్లకు ఉపశమనం కలిగించేందుకు మాత్రమే అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమోషన్ చేయాలని లేదంటే టీనేజర్లు భవిష్యత్తులో వీటికి బాగా అలవాటు పడే అవకాశం ఉందని వెల్లడించారు. -
యువత చూపు.. ఈ-సిగరెట్ల వైపు
న్యూయార్క్ : ఎలక్ట్రానిక్ సిగరెట్ల వల్ల ఆరోగ్యానికి అంతగా ప్రమాదం ఉండదని ఇటీవలి ఓ సర్వేలో తేలింది. సాధారణ సిగరెట్లు, సిగార్లు, హుక్కాల లాగే అనుభూతి నివ్వటంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. సిగరెట్ల నుంచి వచ్చే నికోటిన్ ప్రభావం ఈ సిగరెట్ల నుంచి విడుదలవ్వదు. దీంతో యువత ఎక్కువగా ఈ సిగరెట్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకో విషయమేమంటే వీటి నుంచి ఆరోగ్య సమస్యలు అంతగా తలెత్తవని యువత అభిప్రాయపడుతున్నారని పరిశోధకుల సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రతి ఏడాది ఈ సిగరెట్లు వాడకం యువతలో పెరిగిందని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ, లాస్ ఏంజిల్స్ కు చెందిన అడమ్ లెవెన్తల్, అతని సహోద్యోగులు వెల్లడించారు. 2,530 విద్యార్థులను పరిశీలించగా.. ధూమపానం ప్రారంభదశలో మండే పొగాకును వాడలేదని తేలింది. గత రెండేళ్లుగా నిర్వహించిన సర్వేలలో కూడా ఇదే విషయం వెల్లడైందని తెలిపారు. 222 మంది విద్యార్థులను పరిశీలించగా.. 2013లో ఈ సిగరెట్లు వాడేవారు, సాధారణ సిగరెట్లు వాడేవారి నిష్పత్తి 31:8 శాతాలుగా ఉందని, 2014లో వీరి నిష్పత్తి 25:9 శాతంగా ఉందని కాలిఫోర్నియా వర్సిటీ రీసెర్చ్ లో తేలింది. దీంతో ఈ సిగరెట్ల వినియోగం యువతలో మరీ ఎక్కువైందని తెలుస్తోంది. -
స్మోకింగ్ అలవాటును పెంచుతున్నఈ సిగరెట్స్!
ముంబై: పొగరాయుళ్లును కట్టిపడేద్దమని ప్రవేశపెట్టిన ఈ సిగరెట్స్(ఎలక్ట్రానిక్ సిగరెట్స్) తో మరింత ప్రమాదం చేకూరుతుందట. పొగాకు అలవాటుకు స్వస్తి పలికేందుకు తయారు చేసిన ఈ సిగరెట్స్ యువతను మరింత బానిసలుగా మారుస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. బ్యాటరీతో తయారు చేసే ఈ సిగరెట్స్ తో పొగత్రాగాడాన్ని సాధ్యమైనంత వరకు నివారించవచ్చని గత నాలుగు సంవత్సరాలుగా వీటిని ప్రవేశపెట్టారు. అయితే ఈ సిగరెట్స్ తో పెను ముప్పు పొంచి ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ సిగరెట్స్ కు అలవాటు పడిన వారు సాధారణ సిగరెట్ల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. దీనికి తొలుత బానిసలైన వారు క్రమేపి నికోటిన్ కల్గిన మామూలు సిగరెట్లను సేవించడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు ఈ సిగరెట్స్ పై నిషేధం విధించినా.. ఆన్ లైన్ లో మాత్రం అవి సులభంగా అందుబాటులో ఉండటంతో యువత దీనిపై దృష్టి సారిస్తున్నారు. కొన్ని దేశాల్లో పొగాకు నియంత్రణపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నా.. మన దేశంలో మాత్రం ఆ తరహా విధానం లేకపోవడం బాధాకరమని హెల్త్ అసోసియేన్ ఆఫ్ ఇండియా వాలంటరీ భావనా ముఖోపాధ్యాయ తెలిపారు. పొగాకు త్రాగడం వల్ల వచ్చేప్రమాదంపై ఆస్ట్రేలియా, ఉరుగ్వే దేశాల్లో కచ్చితమైన నియమాలను పాటిస్తున్నా.. భారతదేశంలో మాత్రం ఆ తరహా విధానం లేదని ఆమె తెలిపారు. ఇకనైనా పొగత్రాగటంపై వచ్చే అనర్ధాలపై కఠిన వైఖరి అవలంభిచకపోతే ఆ ప్రభావం రాబోవు రోజుల్లో కనబడుతుందని ఆమె హెచ్చరించారు.