లండన్ః ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రానిక్ సిగరెట్ గురించి వినే ఉంటారు. ధూమపాన ప్రియులకు ప్రత్యామ్నాయంగా ఈ ఇ-సిగరెట్ ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆధునిక పరిజ్ఞానం కూడ ఒక్కోసారి నష్టాన్నే తెచ్చి పెడుతుందంటున్నారు తాజా పరిశోధకులు. సిగరెట్ వ్యసనం మానుకోవాలనుకునే వారికోసం సృష్టించిన ఇ-సిగరెట్లలో పొగాకు కు బదులుగా ఆవిరితో తయారయ్యే నికోటిన్ కలిసిన పొగతో ఎలక్ట్రానిక్ సిగరెట్ అందుబాటులోకి తెచ్చారు. అయితే ధూమపానం మానేయాలనుకునే వారికోసం కనిపెట్టిన వీటివల్ల కూడ అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఇ-సిగరెట్ల ను రద్దు చేసే యోచనలో పడింది.
పొగరాయుళ్ళకు నికోటిన్ తో కూడిన నీటి ఆవిరిని పీల్చే పద్ధతిలో ఉపశమనాన్ని కలిగిస్తున్న ఇ-సిగరెట్లు తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. పొగాకుతో తయారు చేసిన సిగరెట్ల వాడకాన్ని మానుకునే క్రమంలో లండన్ యువత ఎలక్ట్రానిక్ సిగరెట్లను ఆశ్రయిస్తున్నారని, ఇకపై వీటినికూడ వైద్యుల సలహా మేరకు తప్పించి వాడవద్దని అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. తక్కువ ధరలో దొరకడమే కాక, క్యాన్సర్ వంటి ఇతర సమస్యలకు దారి తీయకుండా ఉంటుందన్న ఆలోచనలో ఇ-సిగరెట్లను పరిచయం చేశారు. అయితే వీటి వాడకం కూడ అధికం అవ్వడంవల్ల సమస్యలు తలెత్తుతాయని, ఊపిరితిత్తులపై ప్రత్యక్ష ప్రభావం పడుతోందని సైంటిస్టులు చెప్తున్నారు.
యువత అత్యధికంగా ఇ-సిగరెట్లకు బానిసలౌతున్నారంటూ పరిశోధకులు తమ అధ్యయనాల వివరాలను బీఎంసీ పబ్లిక్ హెల్గ్ ఓపెన్ యాక్సెస్ జర్నల్ లో ప్రచురించారు. వయోజనులు ధూమపాన వ్యసనాన్ని తగ్గించుకునేందుకు పరిచయం చేసిన ఇ-సిగరెట్లు యువతకు నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయని, ఈ విషయాన్ని పాలసీ మేకర్లు పరిగణలోకి తీసుకోవాలని బ్రిటన్ లోని స్టిర్లింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన కాథరిన్ బెస్ట్ చెప్తున్నారు. స్కాట్లాండ్ లోని ఉన్నత పాఠశాలల్లో ఇ-సిగరెట్ల అంశంపై సర్వే నిర్వహించారు. దీనిలో 11 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసున్న విద్యార్థుల్లో కొందరు వాటి గురించి విన్నామని, కొందరు ఇప్పటికే ఉపయోగించి చూశామని, మరి కొందరు మరో ఆర్నెల్లలో ప్రయత్నిద్దామనుకుంటున్నామని తెలిపారు. దీన్నిబట్టి భవిష్యత్తులో ఇ-సిగరెట్ల వాడకం మరింత పెరిగే అవకాశం ఉందని.. దీంతో క్రమంగా నికోటిన్ కు అలవాటుపడిన వారు మామూలు పొగాకు సిగరెట్లవైపు కూడ మొగ్గు చూసే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ సిగరెట్లతోనూ ప్రమాదమే!
Published Thu, Apr 14 2016 5:20 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM
Advertisement
Advertisement