అవి టీనేజర్లను ప్రేరేపిస్తున్నాయ్!
లండన్: సిగరెట్ అలవాటు ఉన్న వారిని మాన్పించడానికి మార్కెట్లోకి వచ్చిన ఈ-సిగరెట్ల గురించి ఓ విస్మయపరిచే నిజం తెలిసింది. మార్కెట్‌లో ఈ-సిగరెట్ల మితిమీరిన ప్రమోషన్ వల్ల స్మోకింగ్ను వదిలేసే వారి సంగతి అలా ఉంచితే.. కొత్తగా మొదలుపెట్టేవారి సంఖ్య పెరుగుతోందట. ముఖ్యంగా ఈ-సిగరెట్లు.. టీనేజర్లను విపరీతంగా ఆకట్టుకొని అటువైపు లాగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ స్టిర్లింగ్ పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో తేలింది.
ఈ-సిగరెట్ల ప్రమోషన్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని, లేదంటే 11 ఏళ్ల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులోని వారు వీటి ప్రభావానికి ఆకర్షితులౌతున్నారని పరిశోధనలో పాల్గొన్న కేథరిన్ బెస్ట్ పేర్కొన్నారు. సుమారు నాలుగు వేల మంది పాఠశాల విద్యార్థులపై జరిపిన పరిశీలనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ-సిగరెట్లను కేవలం వయోజన పొగరాయుళ్లకు ఉపశమనం కలిగించేందుకు మాత్రమే అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమోషన్ చేయాలని లేదంటే టీనేజర్లు భవిష్యత్తులో వీటికి బాగా అలవాటు పడే అవకాశం ఉందని వెల్లడించారు.