న్యూఢిల్లీ : ఇ–సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇ–సిగరెట్ల తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, పంపిణీ, నిల్వ, అమ్మకాలు, సిగరెట్ల వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇ–సిగరెట్లపై నిషేధంతో ఖజానాకు రూ.2,028 కోట్ల నష్టం వాటిల్లే వీలుంది. ఎవరి దగ్గరైనా ఇ–సిగరెట్లు ఉంటే వారికి (తొలిసారి) రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మళ్లీ నేరం చేస్తే రూ.5లక్షల జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఇ–సిగరెట్లను నిల్వ చేయడం నేరమే. వీరికి రూ.50 వేల వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష వరకు విధిస్తారు. ఇ–సిగరెట్లను నిల్వ చేసినవారు ఆర్డినెన్స్ అమలయ్యే నాటికి వాటిని సమీప పోలీస్ స్టేషన్లలో జమ చేయాలి. జూల్ ల్యాబ్స్, ఫిలిప్ మారిస్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు తమ ఇ–సిగరెట్ వ్యాపారాలను భారత్‌కు విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై చట్టం తీసుకురానున్నారు. అమెరికాలో ఇ–సిగరెట్లు యువతను ఎంతగా బలి తీసుకుంటున్నాయో గ్రహించాక ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకొని నిషేధం విధించామని నిర్మల చెప్పారు.
ఇ–సిగరెట్లను చూపుతున్న మంత్రి నిర్మల
ఇ–సిగరెట్లు ఎందుకు హానికరం ?
ఇ–సిగరెట్లలో ద్రవరూపంలో ఉండే నికోటిన్ అనే పదార్థం వేడెక్కి ఆవిరిగా మారి పొగ పీల్చడానికి అనువుగా మారుతుంది. సంప్రదాయంగా పొగాకు తాగడం, సిగరెట్లు కాల్చడం కంటే ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరమనే వివిధ నివేదికలు వెల్లడించాయి. పొగతాగడం కంటే ఇ–సిగరెట్స్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని, ఇ–సిగరెట్లను నిషేధించాల్సిన సమయం వచ్చిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ‘ప్రస్తుతం అమెరికా కంటే భారత్‌లోనే ఇ–సిగరెట్లను పీల్చడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అయితే నగరాలకే ఈ ట్రెండ్ పరిమితం కావడంతో వ్యాధులు, మృతులు వంటివేవీ వెలుగులోకి రాలేదు’ అని పల్మనాలజిస్ట్ అర్జున్ ఖన్నా అన్నారు.
460 బ్రాండ్లు.. 7,700 ఫ్లేవర్లు
- భారత్‌లో 460 ఇ–సిగరెట్ బ్రాండ్లు 7,700 ఫ్లేవర్స్‌లో లభిస్తున్నాయి. అయితే ఇవేవీ భారత్‌లో తయారవడం లేదు.
- 20 సిగరెట్లలో ఎంత నికోటిన్ ఉంటుందో, ఇ–సిగరెట్ ఒక్క కేట్రిడ్జ్‌లో అంతే పరిమాణంలో నికోటిన్ ఉంటుంది.
- భారత్‌లో ఇప్పటికే 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇ–సిగరెట్లపై నిషేధం విధించారు.
- అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, థాయ్‌లాండ్ సహా 31 దేశాలు ఇ–సిగరెట్లపై నిషేధం విధించాయి. అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రం వీటిపై నిషేధం విధించింది. అమెరికాలో దాదాపు 30 లక్షల మంది రెగ్యులర్‌గా ఇ–సిగరెట్లను వాడుతున్నారు. 2011–16 సంవత్సరాల మధ్య వీటి వాడకంలో 900 శాతం వృద్ధి నెలకొంది.
- పొగాకు వల్ల వచ్చే వ్యాధులతో భారత్‌లో ప్రతీ ఏడాది 9 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు.
- ప్రపంచంలో చైనా తర్వాత పొగ తాగే వారు అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారు. మొత్తంగా 10.6 కోట్ల మంది పొగాకు బానిసలుగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment