ఇండియా పాక్ మ్యాచ్కు ఎర్త్ అవర్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: సమతుల్య వాతావరణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవసరం లేని లైట్లను స్విచ్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ పాటించనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఎలా ఉన్నా భారత్, పాకిస్థాన్లో భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే ఇండియా పాకిస్థాన్ల మధ్య శనివారం సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్ గంటపాటు అంటే 8.30 నుంచి 9.30 వరకు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం ఈ మ్యాచ్ కోసం చూస్తున్న వారిపై పడే అవకాశం ఉంది.
ఆ సమయంలో చాలామంది ఇళ్లలో ఎన్ని టీవీలు ఉంటే అన్ని టీవీలు కచ్చితంగా ఆన్ చేసే ఉంటాయి. ఒక వేళ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని గౌరవిస్తూ ఎర్త్ అవర్ పాటించాల్సి వస్తే చాలామంది తమ ఇళ్లలో టీవీలు కట్టేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సోలార్ పవర్ ఉపయోగించేవారి ఇళ్లలో ఉండే టీవీలను షేర్ చేసుకుంటూ మ్యాచ్ చూడాల్సిందిగా ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేశారు. పారిస్ ప్రొటోకాల్ ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల రెండు శాతానికి మించకుండా ప్రతీ దేశంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్‌ను ప్రతీ ఏడాది పాటిస్తున్నారు.