ట్రంపే విజేత
• ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలోనూ గెలుపు
• అమెరికా 45వ అధ్యక్షునిగా ఖరారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన లాంఛనం ముగిసింది. ప్రజా ఓటులో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎలక్టోరల్ కాలేజీ మద్దతును సైతం పొందారు. మంగళవారం జరిగిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికలోనూ విజయం ఆయనను వరించింది. తద్వారా అగ్రరాజ్యం అమెరికా 45వ అధ్యక్షునిగా తన ఎన్నికను ట్రంప్ ఖరారు చేసుకున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసేలా రిపబ్లికన్ ఎలక్టర్లను మార్చేందుకు విశ్వప్రయత్నం చేసిన ప్రత్యర్థుల ఎత్తులు ఫలించలేదు.
డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్ అనూహ్య విజయం సాధించిన ఆరువారాల అనంతరం జరిగిన ఈ ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ ఆయన్ను అమెరికా అధ్యక్షునిగా ఖరారు చేసింది. ఆయనకు 304 ఎలక్టోరల్ ఓట్లు లభించగా.. హిల్లరీ క్లింటన్‌కు 227 ఓట్లు వచ్చాయి. అయితే విజయానికి 270 ఓట్లు చాలు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్లు 538. తమ తమ అభ్యర్థుల పట్ల ‘విశ్వాసం లేని’ ఏడుగురు ఎలక్టర్లు వేరేవారికి ఓటేశారు.
చరిత్రాత్మకం: ట్రంప్
ఈ విజయాన్ని చరిత్రాత్మకమైందిగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. అమెరికా తదుపరి అధ్యక్షునిగా తనను ఎన్నుకున్నందుకుగాను అమెరికన్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన ట్విటర్ ద్వారా స్పందిస్తూ... మీడియాపై విరుచుకుపడ్డారు. సాధారణ ఎన్నికల సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ‘వుయ్ డిడ్ ఇట్’(మనం సాధించాం) అంటూ.. తనకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
సాధారణంగా ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక లాంఛనమైంది. ఎందుకంటే వీరిలో అధికులు ఆయా పార్టీలకు చెందినవారే అయ్యుంటారు. వీరంతా తమ రాష్ట్ర రాజధానుల్లో సమావేశమై అధ్యక్షుడిని లాంఛనంగా ఎన్నుకోవాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఏమాత్రం ఇష్టం లేని ప్రత్యర్థులు ఆయనకు వ్యతిరేకంగా ఎలక్టర్లను కూడగట్టేందుకు ప్రయత్నించడంతో ఈ ఎన్నిక పట్ల ఉత్కంఠ నెలకొంది.