అమెరికా 'అసలు' ఎన్నిక విజేత ఎవరో తెలుసా!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోని అసలు అంకం కూడా పూర్తయింది. ఎలొక్టరల్ కాలేజి కూడా డోనాల్డ్ ట్రంప్‌నే అధ్యక్షుడిగా ఎన్నుకుంది. దాంతో అగ్రరాజ్యానికి 45వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఖరారయ్యారు. రిపబ్లికన్లు వైట్‌హౌస్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రత్యర్థులు ఎంతగా ప్రయత్నించినా వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఎన్నిక ఫలితం రాగానే 70 ఏళ్ల ట్రంప్.. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. 'వుయ్ డిడ్ ఇట్!' అని, తనకు మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అధికారికంగా తాను ఎన్నికల్లో గెలిచానని చెబుతూనే... మీడియా ఎంత అసత్యాలు రాసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. ఆయనను అడ్డుకోడానికి డెమొక్రాట్లు ఎంతగా ప్రయత్నించినా ట్రంప్ మాత్రం అద్భుతమైన ఓట్లు సంపాదించారని ఆయన బృందం కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చారిత్రక అడుగుతో మనం మరింత మంచి భవిష్యత్తు దిశగా వెళ్తున్నామని, అమెరికన్లందరికీ తాను అధ్యక్షుడిగా ఉంటానని, దేశాన్ని సమైక్యంగా చేసేందుకు కష్టపడతానని కూడా ట్రంప్ అన్నారు.
ఏమిటీ ఎన్నిక.. ఎందుకు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ 8న జరిగింది. ఫలితం 24 గంటల్లోపే వచ్చింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. కానీ దాంతోనే రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయినట్లు కాదు. 48 రాష్ట్రాలు (మెయిన్, నెబ్రాస్కా పద్ధతి వేరు), రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి ఎన్నికైన 538 మంది ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లు తమ రాష్ట్ర రాజధానుల్లో సమావేశమై అధ్యక్షుడిని లాంఛనంగా ఎన్నుకోవాలి. అలా జరిగిన ఎన్నికల్లో కూడా ట్రంప్ విజయం సాధించారు.
అధ్యక్ష ఎన్నికల్లో మొదట్నించీ విజేతను ఎల క్టోరల్ కాలేజీ ఓటర్లే నిర్ణయిస్తున్నారు. 2016 ఎ న్నికలు సహా ఐదుసార్లు మాత్రమే గెలిచిన అధ్యక్ష అభ్యర్థి కన్నా ఓడిన పార్టీ నేత ఎక్కువ ప్రజా ఓట్లు సంపాదించారు. 2000 ఎన్నికల్లో అల్ గోర్(డెమోక్రాట్)కు జార్జి డబ్ల్యూ బుష్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంతకు మూడుసార్లు(1824, 1876, 1888) అత్యధిక ప్రజల ఓట్లు పొందిన అభ్యర్థులు ఓడిపోయా రు. మొన్నటి నవంబర్ ఎన్నికల్లో ట్రంప్ కన్నా దాదాపు 28 లక్షల ఓట్లు ఎక్కువ పొందిన హిల్లరీ పై నలుగురి జాబితాలో చేరారు.
అధ్యక్ష ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు పోలింగ్‌కు ముందే ఈ ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లను ఎంపిక చేస్తాయి. ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికే ఓటేస్తామని ఈ ఎలక్టర్లు మొదట ప్రమాణం చేస్తారు. 227 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంతవరకూ ఈ ఎలక్టర్లు 99 శాతానికి పైగా తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లేశారు. అలాగే ఓటు వేయాలని 29 రాష్టాల చట్టాలు చెబుతున్నాయి. 14 రాష్ట్రాల్లో మాత్రం ప్రమాణం చేసిన అభ్యర్థికి ఓటేయకపోయినా ఇబ్బంది ఉండదు. ప్రధాన అధ్యక్ష అభ్యర్థుల పేర్లు కాకుండా ఇతరు పేర్లు కూడా రాసి ఓటేయవచ్చు. ప్రతి ఎలక్టరూ రెండు కాగితాలపై అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థుల పేర్లు రాయాల్సి ఉంటుంది. ఇదీ రివాజు. ఓటేసిన తర్వాత ఈ 538 మంది సభ్యత్వం దానంతటదే రద్దవుతుంది.