ట్రంప్ జోస్యం చెప్పిన ఒబామా
వాషింగ్టన్: తన అనంతరం తమ దేశ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ను ప్రజలు ఎన్నుకుంటారని అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా అనుకోవడం లేదని అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థులు మాట్లాడుతున్న మాటల కారణంగా వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రతి స్పందనను ప్రతి అమెరికన్ పౌరుడు గమనిస్తున్నాడని ఆ ప్రకటనలో పేర్కొంది.
అమెరికా ప్రజలు ట్రంప్ ను విశ్వసించడం లేదని, అతడిని తమ అధ్యక్షుడిగా ఎన్నికుంటారని భావించడం లేదని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. ట్రంప్ ప్రచార శైలిపై ఆయనను ప్రశ్నించగా ట్రంప్ ను ప్రజలు విశ్వసించడం లేదని, ఇప్పటికే రెండుసార్లు బహిరంగంగా జరిగిన సమావేశంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారని అన్నారు.
దీర్ఘదృష్టి ఉన్నవాడిని, తెలివైనవాడిని, సహనం, ఓర్పు ఉన్నవాడిని తమ అధ్యక్షుడిగా అమెరికన్లు ఎంచుకుంటారని, వారికి ఆ మాత్రం అవగాహన ఉందని తెలిపారు. అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ అందరికన్నా ముందున్నప్పటికీ ప్రతి రోజు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తనకు తానే ఉచ్చు బిగించుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన ముక్కోపి అని, ముస్లిం వ్యతిరేకి అని, విదేశాలతో మంచి సంబంధాలు కొనసాగించగలిగే సామర్థ్యం లేనివాడని ఆయన ప్రసంగాల ద్వారా పలువురు అంటున్నారు.