హిల్లరీ ఎన్నికల ఫండ్ రూ. 1740 కోట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం డెమోక్రట్ల తరఫు నుంచి హిల్లరీ క్లింటన్, బెర్నీ సాండర్స్, రిపబ్లికన్ల తరఫు నుంచి డొనాల్డ్ ట్రంప్, ట్రెడ్ క్రుజ్, జాన్ కాసిక్‌లు పోటీ పడుతున్నా వారిలో హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్‌లే ముందుకు దూసుకుపోతున్నారు. ఎవరు ఎంత ముందుకు దూసుకుపోతున్నా ఐదుగురు అభ్యర్థుల ప్రచారానికి భారీ మొత్తాల్లో డబ్బులు కావాల్సిందే. ఈ విషయంలో అందరికన్నా హిల్లరీ క్లింటన్ అగ్రస్థానంలో ఉన్నారు.
హిల్లరీ ప్రచారం ద్వారా, వివిధ గ్రూపుల నుంచి వచ్చిన విరాళాల ద్వారా, ఆన్‌లైన్ డొనేషన్ల ద్వారా ఏప్రిల్ ఆరవ తేదీ నాటికి 1740 కోట్ల రూపాయలను సమీకరించారు. ఈ మొత్తంలో ఎన్నికల ప్రచారం ద్వారా ఆమె 70 శాతం విరాళాలను సమీకరించగా, సూపర్ ప్యాక్ లేదా వివిధ గ్రూపుల ద్వారా 30 శాతం విరాళాలను సమీకరించారు. డెమోక్రట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న హిల్లరీ, సాండర్స్‌లు రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థులకన్నా ఎక్కువగా ఎన్నికల విరాళాలు సేకరించారు.
సాండర్స్ 1436.5 కోట్ల రూపాయలను సమీకరించడం ద్వారా ఐదుగురిలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారం ద్వారా 99.7 శాతం విరాళాలు సేకరించగా సూపర్ ప్యాక్స్ లేదా వివిధ గ్రూపుల నుంచి కేవలం 0.3 శాతం విరాళాలను మాత్రమే సేకరించారు. వివిధ గ్రూపుల నుంచి విరాళాలను సేకరించడంలో హిల్లరీ తనకు, తన భర్త బిల్ క్లింటన్‌కున్న వ్యక్తిగత సంబంధాలు ఎంతో ఉపయోగపడ్డాయి.
రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న టెడ్ క్రుజ్ ప్రైమరీ స్టేట్స్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కన్నా వెనకబడినప్పటికీ విరాళాల సేకరణలో మాత్రం ముందున్నారు. 958 కోట్ల రూపాయల విరాళాల సమీకరణలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఈ మొత్తంలో ఆయన ఎన్నికల ప్రచారం ద్వారా 55 శాతం నిధులను సమీకరించగా, ఇతర గ్రూపుల నుంచి 45 శాతం నిధులను సమీకరించారు. ఇతర గ్రూపుల నుంచి విరాళాలు సమీకరించడంలో ఆయన అందరికన్నా ముందున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ల తరఫున ఫ్రంట్ రన్నర్‌గా నిలిచిన డొనాల్డ్ ట్రంప్ 346 కోట్ల రూపాయల సమీకరణతో విరాళాల్లో వెనకబడ్డారు.
ఈ మొత్తంలో ఆయనకు ఎన్నికల ప్రచారం ద్వారా 95 శాతం విరాళాలు రాగా, సూపర్ ప్యాక్స్ లేదా ఇతర గ్రూపుల నుంచి ఐదు శాతం విరాళాలు వచ్చాయి. వివాదాస్పద ప్రకటనలతో మీడియాను విశేషంగా ఆకర్షించిన ట్రంప్‌కు ఈ కళే ఎన్నికల ప్రచారం సందర్భంగా విరాళాలు సేకరించేందుకు ఎక్కువగా ఉపయోగపడింది. కేవలం 197 కోట్ల రూపాయల విరాళాల సమీకరణతో రిపబ్లికన్ల అభ్యర్థి జాన్ కాసిక్ అందరికన్నా వెనకబడ్డారు. మొత్తం ఐదుగురు అభ్యర్థుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే బిలియనీర్.