హిల్లరీ బోరింగ్ స్పీకర్..!
కాలిఫోర్నియా: ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో మరోసారి ట్రంప్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వేలమంది గుమిగూడిన కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్ దేశంలో భారీ కరువు పరిస్థితులు నెలకొననుందనే వార్తలను ట్రంప్ కొట్టి పారేశారు. తాను దేశాధ్యక్షడు అయ్యాక నీటి కరువు తీరిపోతుందంటూ హామీ ఇచ్చారు. అనంతరం ట్రంప్ హిల్లరీ క్లింటనపై తన దాడిని కొనసాగించారు. ఆమె చాలా బోరింగ్ స్పీకర్ అని, అస్పలు వినలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలకోరు .. క్రూకెడ్ హిల్లరీ అని అంటూనే ఇంతకు మించి వ్యక్తిగతంగా , ఏమీ వ్యాఖ్యానించలేనన్నారు. ఇది రాజకీయంగా సరైన కాదని పేర్కొన్నారు. ఆమె అన్నీ తప్పుడు విషయాలు, అసత్యాలు ప్రచారం చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. హిల్లరీ ఆరోపించినట్టు తనకు నియంతల మీద ప్రేమ లేదన్నారు. ఈ సందర్భంగా నాటో దేశాలపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. తాను అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తరువాత వ్యాపారంలో, సైన్యంలో విజయాల పరంపర మొదలు కాబోతోందన్నారు. ఇప్పటివరకూ ఓడించలేకపోయిన ఐఎస్ఎస్ ను ఓడించబోతున్నామన్నారు. దేశం ఏదైనా విజయం మనదే, మన దేశాన్ని మళ్లీ పునర్నిర్మిచుబోతున్నాం అంటూ చేసిన ప్రసంగానికి చప్పట్లు మారు మోగాయి.
జూన్ 7న ప్రైమరీ ఎన్నికలు జరగనుండటంతో ప్రచారం నిమిత్తం శాండియాగోకు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అక్కడ ప్రచారం నిర్వహించారు. ఈ ర్యాలీ మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకులకు మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఇటీవల అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు బోర్డర్ గోడ కట్టనున్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు అక్కడివారిలో ఆగ్రహాన్ని రగిలించాయి. మెక్సికో బోర్డర్ సమీపంలో ఆ ప్రాంతం ఉన్న కారణంగా ఆందోళనకారులు ట్రంప్ ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో వివాదం నెలకొంది. వాటర్ బాటిళ్లు, కోడిగుడ్లు విసురుకున్నారు. ట్రంప్ గో హోమ్ అనే నినాదాలు మిన్నంటాయి. దీంతో పెప్పర్ స్ప్రే ప్రయోగించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కొంతమందిని అరెస్టు చేశారు.
ఫ్రెస్నో నగరంలో ర్యాలీ చాలా జరిగిందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అటు శాన్ డియాగో పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ వరుస ట్విట్లు చేశారు. ర్యాలీ ని చెడగొట్టడానికి చూసిన సందర్భంలో సమస్యను చాలా ప్రశాంతంగా చక్కదిద్దారని కొనియాడారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలకు ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న సంగతి తెలిసిందే.