భారతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్: భారతీయ విద్యార్థులకు అనుకూలంగా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశాడు. అమెరికా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి తెలివైన పిల్లలను అమెరికాలో ఉంచాలని అన్నారు. దీంతో తొలిసారి ఇమ్మిగ్రేషన్ విధానంపై పరోక్షంగా ఆయన మద్ధతును ప్రకటించినట్లయింది. ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు.
'మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా.. వారు ఫీజులు చెల్లిస్తున్నారు కాబట్టి మనం ఎంతోమందిని విద్యావంతులుగా తయారు చేస్తున్నాం. వారిలో చాలామంది తెలివైనవారు ఉన్నారు. మనకు అలాంటి వారే కావాలి. అమెరికాలో ఉండిపోవాలని చాలామంది కోరుకుంటారు. అలాగని వారు నేరుగా అమెరికాకు రావొద్దు. హార్వార్డ్కు వెళ్లాలి. క్లాస్ రూంలో కూర్చొని చదువు నేర్చుకోవాలి. ఇండియన్స్ అయితే తిరిగి ఇండియాకు వెళ్లి కంపెనీలు పెట్టుకొని ఉద్యోగాలు సృష్టించాలి' అని ట్రంప్ అన్నాడు. ఎంతోమంది ఏళ్ల తరబడి ఇక్కడ చదువుకుంటున్నారని, వారందరినీ బయటకు పంపించొద్దనేది తన ఉద్దేశం అని చెప్పారు. ఇమ్మిగ్రేషన్ విధానంపై గతంలో వ్యతిరేక భావాన్ని ప్రకటించి ట్రంప్ పలు విమర్శలకు గురైన విషయం తెలిసిందే.