కరుగుతున్న అమెరికా కలలు | Number of Indian students joining US engineering colleges declines | Sakshi
Sakshi News home page

కరుగుతున్న అమెరికా కలలు

Published Tue, Feb 27 2018 2:40 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

Number of Indian students joining US engineering colleges declines - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొస్తున్న  మార్పుల ప్రభావం   ఆ దేశంపై  పడవచ్చుననే ఆందోళన  వ్యక్తమవుతోంది. వీసాల నియంత్రణలో భాగంగా  హేచ్‌ 1–బీ  నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు, ఉద్యోగ విధానంలో ట్రంప్‌  తీసుకొచ్చిన సవరణలు కొంత ఇబ్బందికరంగా పరిణమించే పరిస్థితి ఏర్పడింది.  

దేశ ప్రయోజనాల పరిరక్షణ పేరిట ‘ అమెరికా ఫస్ట్‌’ విధానాల్లో భాగంగా తెచ్చిన మార్పుల ప్రభావం అక్కడి వర్శిటీలు, కంపెనీలు, ఆర్థికరంగంపై పడుతోందంటున్నారు. ఆ దేశ ఆర్థికరంగానికి  విదేశీ విద్యార్థుల రూపంలో గణనీయంగానే డబ్బు సమకూరుతున్నా ప్రస్తుతం విధానాల్లో మార్పుల  కారణంగా  వీరి సంఖ్య తగ్గుతుందని  నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) తాజా నివేదిక వెల్లడించింది. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ వివరాలను విశ్లేషిస్తూ ఆ సంస్థ ఈ నివేదిక రూపొందించింది.   

21  శాతం తగ్గిన భారత విద్యార్థులు...
అమెరికాలో కంప్యూటర్‌ సైన్స్, ఇతర ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే భారతీయుల సంఖ్య 2016తో పోల్చితే గతేడాది (2017) గణనీయంగా  21 శాతం (18,590 విద్యార్థులు) తగ్గింది. అదే ప్రపంచ దేశాల స్థాయిలో చూస్తే అమెరికా యూనివర్శిటీలోని  గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థులు 2016తో పోల్చితే 2017లో 6 శాతం (14,730 విద్యార్థులు) తగ్గారు.

ప్రధానంగా హేచ్‌ 1–బీ వీసాల జారీలో తీసురానున్న సవరణ కారణంగా విదేశీయులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణుల్లో ఎక్కువ శాతం అక్కడకు వెళ్లేందుకు  సుముఖంగా లేరని తెలుస్తోంది. అండర్‌ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్‌ కోర్సులు కలుపుకుని 2016లో 8,40,160 ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య, 2017లో 8,08,640కు (4 శాతం మేర) తగ్గినట్టు హోంల్యాండ్‌ సెక్యూరిటీ, స్టూడెంట్‌ అంyŠ  ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఈవీఈఎస్‌) సమాచారం బట్టి తెలుస్తోంది.

అమెరికాపై దుష్ప్రభావం చూపొచ్చు...
అమెరికా యూనివర్శిటీల్లో సైన్స్, ఇంజనీరింగ్‌ డిగ్రీలు పూర్తి చేసే భారతీయులే అక్కడి కంపెనీలకు ప్రతిభ విషయంలో ప్రధాన వనరుగా ఉంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. అక్కడి ప్రభుత్వం విధానాల పరంగా మార్పుల «ప్రక్రియను కొనసాగించిన పక్షంలో విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు, కంపెనీలు మొత్తంగా ఆర్థికరంగంపై వాటి దుష్ప్రభావం పడొచ్చని అభిప్రాయపడింది. విదేశీ విద్యార్థులు ఆయా రంగాల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాక అక్కడ పనిచేసే సామర్థ్యాన్ని అడ్డుకునే విధంగా ఉన్న అమెరికా ప్రభుత్వ విధానాలు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయొచ్చనే ఆందోళన వ్యక్తంచేసింది.

అక్కడ విదేశీ విద్యార్థులదే సింహభాగం...
అమెరికా యూనివర్శిటీల్లో ముఖ్యంగా వివిధ కోర్సులు చదివే వారిలో విదేశీ విద్యార్థుల సంఖ్యే ఎక్కువ. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో 93 శాతం, కంప్యూటర్‌ సైన్స్‌లో 88 శాతంగా ఉన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో తగిన సంఖ్యలో ఇతర దేశాల విద్యార్థులు లేకుండా మాస్టర్స్‌తో పాటు గ్రాడ్యుయేట్‌ కోర్సుల నిర్వహణ కూడా కష్టమని గతేడాది అక్టోబర్‌లో విడుదల చేసిన మరో నివేదికలో ఎన్‌ఎఫ్‌ఏపీ పేర్కొంది. విదేశీ విద్యార్థులకు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) లేదా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం ఓపీటీ ( స్టెమ్‌ ఓపీటీ) పరిమితం చేయడమో లేదో తొలగించడమో చేయనున్నట్టు ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల సూచించింది.  

ఓపీటీ ద్వారా విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ తర్వాత కూడా చదువు కొనసాగించేందుకు, శిక్షణ పొందేందుకు, పనిచేసేందుకు  అనుమతి లభిస్తుంది. కెనడా, ఆస్ట్రేలియాలలో  ఇతర దేశాల విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ తర్వాత పనిచేసేందుకు అనువైన విధానాలున్నాయని ఎన్‌ఎఫ్‌ఏపీ పేర్కొంది. అయితే ప్రస్తుత ట్రంప్‌ ప్రభుత్వ విధానాల వల్ల అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల నమోదుపై ప్రభావం పడవచ్చునని అభిప్రాయపడింది.  
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement