అమెరికా ఎన్నికలను భారత్‌ నిర్వహిస్తే....! | Americans Outsource Their Polls To ECI Indians Advice | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికలను భారత్‌ నిర్వహిస్తే....!

Published Sat, Nov 7 2020 5:51 PM | Last Updated on Sat, Nov 7 2020 7:47 PM

Americans Outsource Their Polls To ECI Indians Advice - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగి మూడు రోజులైనా ఓట్ల లెక్కింపు పూర్తకాక పోవడం పట్ల అమెరికాలోని ప్రవాస భారతీయులతోపాటు స్థానిక భారతీయులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్నింట్లో అగ్రరాజ్యం అనిపించుకుంటున్న అమెరికా ఎన్నికల నిర్వహణలో మాత్రం ‘వెరీ పూర్‌’ అంటూ సోషల్‌ మీడియాలో తెగ తూర్పార పడుతున్నారు. ఇకనైనా అమెరికా ఎన్నికల నిర్వహణను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కు ‘ఔట్‌ సోర్సింగ్‌’ కింద అప్పగించాలంటూ సూచనలు కూడా ఇస్తున్నారు. నిజంగా మన ఎన్నికల సంఘానికి ఆ కాంట్రాక్టును అప్పగిస్తే ఆ బాధ్యతను దిగ్విజయంగా నెరవేర్చగలదా!?

91.1 కోట్ల మంది పౌరులు ఓటు వేశారు!
భారత్‌ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఉపయోగిస్తున్నప్పటి నుంచి అవకతవకలకు సంబంధించిన విమర్శలు తగ్గుతూ వచ్చాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల నిర్వహణలో ప్రశంసలు అందుకుంటున్న భారత ఎన్నికల సంఘం పురోగతి గురించి చెప్పాలంటే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలను ప్రస్తావించాల్సిందే. ఆ ఎన్నికల్లో సరాసరి 67 శాతం పోలింగ్, అంటే 91.1 కోట్ల మంది పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,35,918 పోలింగ్‌ కేంద్రాలకు దాదాపు 40 లక్షల ఓటింగ్‌ యంత్రాలను తరలించేందుకు ఎన్నికల సిబ్బంది ఏనుగులను, పడవలను, హెలికాప్టర్లను ఉపయోగించడంతోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎత్తైన పర్వత శిఖరాలకుపైకి కూడా ట్రెక్కింగ్‌ చేస్తూ వెళ్లారు. 2019 ఎన్నికలు ఏడు దశల్లో మే 19వ తేదీన ముగియగా, మే 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అత్యధిక ఓటర్లు కలిగిన భారత్‌లో పోలింగ్‌ నిర్వహించడంతో, ఓట్లను లెక్కించడంలో ఎన్నికల సంఘం నిర్వహించిన పాత్రను ప్రశంసించకుండా ఉండలేం. (చదవండి: నువ్వు కూడా ప్రెసిడెంట్‌ కావొచ్చు!)

ముందుగానే చెప్పారు!
మన ఎన్నికలకు, అమెరికా ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో, గంటల తరబడి క్యూలల్లో ప్రయాసపడి ఓటు వేయాల్సిన అవసరం లేకుండా అమెరికాలో పోలింగ్‌ నిర్వహిస్తారు. అక్కడ పోలింగ్‌ రోజునే కాకుండా ముందస్తు పోలింగ్‌ అంటూ ముందుగానే ఓటు వేసుకొని వెసలుబాటు కల్పించడం తెల్సిందే. అన్నింటికన్నా ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకునే అవకాశం అక్కడ అందరికి ఉంది. భారత్‌లో సైన్యంలో ఉన్నవారికి, పోలింగ్‌ విధుల్లో ఉన్న వారికి మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపగించుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వలసపోయిన మన ప్రజలకు కూడా బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించుకునే అవకాశం లేక ఓటువేసే భాగ్యాన్ని కోల్పోతున్నారు. పైగా ఈసారి కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికల నిర్వహణలోనూ, కౌంటింగ్‌లోనూ మరింత జాప్యం జరగుతుందని అమెరికా ఎన్నికల అధికారులు ముందుగానే చెప్పారు.

ప్రశంసలతో పాటు విమర్శలు కూడా!
భారత్‌లో ఎన్నికల నిర్వహణలో ప్రశంసలు ఎదుర్కొంటున్న ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని అమలు చేయడంలో ఘోరంగా విఫలం అవుతుందనే విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రధాన మంత్రి అభ్యర్థే సైనిక దళాల చర్యలను ప్రశంసించినా, మతాల పేర్లతో ఓట్లను ఆకర్షించేందుకు ప్రయత్నించినా భారత ఎన్నికల సంఘం ఏం చేయలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. జాతీయ పాలకపక్ష పార్టీ ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ టీవీ, రేడియో ఛానళ్లను ఉపయోగించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఓటర్లకు సంబంధించిన సమాచారిన్ని నేరుగా ప్రధాని కార్యాలయానికి పంపించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్‌ సంస్థ దేశంలోని బ్యూరోక్రాట్లకు ఈ మెయిల్స్‌ పంపించడంపై రాద్ధాంతం జరగడం మనకు తెల్సిందే. 

అప్పుడు కూడా ఇలా నవ్వుకోగలమా?
ఇక ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తోన్న వ్యక్తికి భారత ఎన్నికల సంఘం క్లీన్‌చిట్‌ ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్‌ అధికారి అశోక్‌ లావాస భార్య, కూతురు, కుమారుడిని ఆదాయం పన్నుశాఖ అధికారులు ముప్పు తిప్పలు విషయం నిజం కాదా?! తదుపరి చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ కావాల్సిన అశోక్‌ లావాస ఎన్నికల సంఘానికి రాజీనామా చేసి ‘ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌’కు ఎందుకు వెళ్లారో అర్థం చేసుకోలేమా?! అమెరికా ఎన్నికల ప్రక్రియను చూసి మనం హాయిగా నవ్వుకోవచ్చు. జోకులు కూడా వేసుకోవచ్చు. గురువింద చందంగా మన బండారాన్ని కూడా బయటి వారు బహిరంగంగా విమర్శిస్తే ఇంతే హాయిగా నవ్వుకోగలమా!?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement