ప్రధాని.. అధ్యక్షుడి మధ్య పోరు తప్పదా?
మాక్రాన్ ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే
ఫ్రాన్స్ అధ్యక్షుడికి ముందున్నది ముళ్లబాట
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమ్మాన్యుయల్ మాక్రాన్ ఎన్నికలో ఎన్ని విశేషాలు చోటుచేసుకున్నాయో, మున్ముందు ఆయనకు అన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. 59 ఏళ్లలో దేశ పార్లమెంట్ (నేషనల్ అసంబ్లీ)లో ఒక్క సీటు కూడా లేకుండానే దేశానికి అధ్యక్షుడై ఎల్సీ ప్యాలెస్‌లోకి అడుగుపెడుతున్న తొలి వ్యక్తి మాక్రాన్. ఫ్రాన్స్ ఐదో రిపబ్లిక్ (గణతంత్ర) వ్యవస్థ అమల్లోకి వచ్చిన 1958, అక్టోబర్ 4వ తేదీ నాటి నుంచి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేని పార్టీకి చెందిన వ్యక్తి దేశాధ్యక్షుడు కావడం ఇదే మొదటిసారి. గతంలో సోషలిస్ట్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్న మాక్రాన్ ‘ఎన్ మార్చే (ముందుకే)’ అన్న పార్టీని 2016లో స్థాపించి ఇప్పుడు ఆ పార్టీ తరఫున అధ్యక్షుడిగా పోటీచేసి విజయం సాధించారు. ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికల తర్వాతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్‌కు ఎన్నికైన వారిని డిప్యూటీలు అని పిలుస్తారు. డిప్యూటీలు మద్దతిచ్చే వ్యక్తినే ప్రధానమంత్రిగా దేశాధ్యక్షుడు నియమించాలి.
ప్రధానిని నియమించడం కత్తిమీద సామే
మాక్రాన్ కూడా వచ్చే నెలలో జరుగనున్న దేశ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశ ప్రధానమంత్రిని నియమించాలి. ఇదే ఇప్పుడు ఆయన ముందున్న రెండో పెద్ద సవాల్. మొదటి సవాల్ కింద ఆయన దేశాధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థి లా పెన్‌తో తలపడి రెండోరౌండ్ ఎన్నికల్లో గెలిచిన విషయం తెల్సిందే. వచ్చే నెలలో ఆయన దేశ ప్రధానమంత్రిని నియమించడం కత్తిమీద సాము లాంటిదే. వచ్చే ఎన్నికల్లో మాక్రాన్ పార్టీ ‘ఎన్ మార్చే’ పోటీ చేసినా ఆయన పార్టీకి 15 నుంచి 20 సీట్లకు మించి రావని తాజా ఎన్నికల సర్వేలు తెలియజేస్తున్నాయి. జాతీయ అసెంబ్లీగా వ్యవహరించే ఫ్రాన్స్ పార్లమెంట్‌లో మొత్తం 577 సీట్లు ఉన్నాయి. మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొని వారి అభిప్రాయం మేరకే దేశ ప్రధాన మంత్రిని దేశాధ్యక్షుడు నియమించాలని దేశ ఐదో రిపబ్లిక్ రాజ్యాంగం సూచిస్తోంది. అందుకు భిన్నంగా దేశాధ్యక్షుడు వ్యవహరిస్తే ప్రధాన మంత్రిపై అవిశ్వాస తీర్మానంపెట్టి సదరు ప్రధానిని తీసివేసే హక్కు పార్లమెంట్ సభ్యులకు ఉంది.
అమెరికా అధ్యక్ష తరహా కాదు
ఫ్రాన్స్ పరిపాలనా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి తరహా లాంటిది కాదు, అలా అని భారత్ లాంటి పార్లమెంటరీ తరహా వ్యవస్థా కాదు. ఒకరకంగా సెమీ అధ్యక్ష పాలనావ్యవస్థ అనవచ్చు. భారత్ తరహాలో లోక్‌సభ, రాజ్యసభ ఉంటాయి. లోక్‌సభకు ప్రత్యక్ష, రాజ్యసభకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభను సెనేట్ అని పిలుస్తారు. ప్రభుత్వానికి ప్రధానమంత్రి అధిపతి అయితే దేశానికి దేశాధ్యక్షుడు అధిపతి. భారత్ తరహాలో కాకుండా ఫ్రాన్స్ ప్రజలు 1962 నుంచి దేశాధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు. రాజకీయానుభవం లేకపోయినా సరే దేశంలోని వివిధ స్థాయిల పాలనా వ్యవస్థల్లో ఎన్నికైన 500 మంది అభ్యర్థుల సంతకాలు సాధిస్తే ఎవరైనా దేశాధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు. అయితే విజయం సాధించాలంటే 50 శాతానికిపైగా ఓట్లు రావాల్సిందే. అలా రాలేదంటే ఎక్కువ ఓట్లతో ముందున్న ఇద్దరి మధ్య మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. వాటినే రెండో రౌండ్ ఎన్నికలంటారు. అంతకు ముందు లే పెన్ కంటే కేవలం మూడు శాతం ఓట్లు అధికంగా సాధించిన మాక్రాన్ రెండో రౌండ్ ఎన్నికల్లోనే 60 శాతానికిపైగా ఓట్లతో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఏ పార్టీ నుంచైనా ప్రధానిని నియమించవచ్చు
భారత్‌లో లాగా లోక్‌సభలో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ నుంచే ప్రధాన మంత్రిని దేశాధ్యక్షుడు ఎంపిక చేయాలనే నిబంధనేమీ లేదు. అయితే ఆయనకు మెజారిటీ లోక్‌సభ సభ్యుల మద్దతు ఉండాలి. ఇక లోక్‌సభ సభ్యులైన డిప్యూటీలను కేబినెట్ మంత్రులుగా నియమించే అధికారాలు కూడా దేశాధ్యక్షుడికి ఉన్నాయి. కేబినెట్ సమావేశాలను కూడా ఆయనే నిర్వహిస్తారు. తద్వారా ప్రభుత్వ పాలనను తన చేతుల్లో ఉంచుకునే అవకాశం దేశాధ్యక్షుడికి ఉంది. శాసనాలను చేసే అధికారం మాత్రం ఆయనకు లేదు. వాటిని ఉభయసభలు ఆమోదించాల్సిందే. వాటిని తిరస్కరించే అధికారం కూడా ఆయనకు లేదు.
అధ్యక్ష, పీఎంల మధ్య గొడవలు రావచ్చు
ప్రధానమంత్రిగా ఎంపికైన పార్లమెంట్ సభ్యుడికి స్వతహాగా మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే దేశాధ్యక్షుడి సూచనలను గౌరవించాల్సిన అవసరం లేదు. స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అలాంటి సందర్భాల్లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు ఏర్పడితే పార్లమెంటును రద్దుచేసే అధికారం దేశాధ్యక్షుడికి ఉంది. సొంత పార్టీ నుంచి కాకుండా ఇతర పార్టీల నుంచి ప్రధానమంత్రి అయినవారు ఇప్పటికే ముగ్గురే ఉన్నారు. వారి హయాంలో విభేధాల వల్ల ప్రభుత్వాలు సక్రమంగా నడవలేదు.
ఆరో రిపబ్లిక్ వ్యవస్థ అవసరం కావచ్చు
ఇప్పుడు మాక్రాన్‌కు కూడా ఇతర పార్టీల నుంచి ప్రధానిని ఎంపిక చేసుకోవడం మినహా మరో గత్యంతంరం లేదు. ఇరువురి మధ్య అధికార గొడవలు వస్తే. ఐదో రిపబ్లిక్ వ్యవస్థను రద్దుచేసి ఆరో రిపబ్లిక్ వ్యవస్థను తీసుకరావాల్సి వస్తుంది. ఇప్పటికే జన సమూహాలపై టెర్రరిస్టు దాడులు, తీవ్ర నిరుద్యోగ సమస్య, స్తంభించిపోయిన ఆర్థికవ్యవస్థ, సామాజిక అస్థిర పరిస్థితులు, గ్రామీణ–పట్టణాల మధ్య పెరిగిపోయిన అంతరాలతో సతమతమవుతున్న ఫ్రాన్స్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.