
ఐరోపా దేశాలకు దారి చూపిన మేక్రాన్ విజయం!
ఆర్నెల్లనాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాదిరిగానే ఐరోపా దిగ్గజాల్లో ఒకటైన ఫ్రాన్స్ ఎన్నికల్లోకూడా తీవ్ర జాతీయవాద అభ్యర్థి మరీన్ లా పెన్ గెలుస్తారేమోననే భయాందోళనలు నిజం కాలేదు.
ఆర్నెల్లనాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాదిరిగానే ఐరోపా దిగ్గజాల్లో ఒకటైన ఫ్రాన్స్ ఎన్నికల్లోకూడా తీవ్ర జాతీయవాద అభ్యర్థి మరీన్ లా పెన్ గెలుస్తారేమోననే భయాందోళనలు నిజం కాలేదు. సెంట్రిస్ట్ పార్టీ నేత ఇమానియేల్ మేక్రాన్ సాధించిన తిరుగులేని విజయం ప్రపంచవ్యాప్తంగా శుభవార్తయింది. దేశంలోకి వలసలు, ఇస్లాం, యూదులను వ్యతిరేకించడమేగాక యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటపడాలనే వాదనకు అనుకూలంగా కనిపించిన ఫ్రంట్ నేషనల్ అభ్యర్థి పరాజయంతో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో కుంగిపోయిన ప్రపంచ లిబరల్స్‌కు ఊరట లభించింది. ఒంటరి పోకడల విషయంలో తన మాదిరి విధానాలతో ముందుకొచ్చిన ట్రంప్ విజయాన్ని మరీన్ కోరుకున్నారు. బ్రెగ్జిట్, ట్రంప్ గెలుపు తర్వాత ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయమని మరీన్ ఆశించారు. అమెరికా స్వాతంత్య్ర సమరం నుంచి స్ఫూర్తి పొంది 1789లో హింసాత్మక విప్లవానికి వేదికయిన ఫ్రాన్స్ ఇప్పుడు దాదాపు 230 ఏళ్ల తర్వాత అగ్రరాజ్యం దారిలో నడవబోనని అధ్యక్ష ఎన్నికల ఫలితం ద్వారా నిరూపించింది.
ఇద్దరూ బయటివారే!
1958లో ఏర్పడిన ప్రస్తుత ఐదో ఫ్రెంచ్ రిపబ్లిక్‌ను అప్పటి నుంచి ఇప్పటి వరకూ వామపక్షంగా గుర్తింపు పొందిన సోషలిస్టులు, మితవాదులుగా ముద్రపడిన రిపబ్లికన్లు మాత్రమే పాలిస్తూ వచ్చారు. ప్రస్తుత సోషలిస్ట్ అధ్యక్షుడు ఫ్రాంకోయీ హాలండ్ ప్రభుత్వంలో మేక్రాన్ రెండేళ్లు ఆర్థిక మంత్రిగా పనిచేసి వైదొలిగినాగాని ఆయనను సోషలిస్ట్‌గా పరిగణించరు. అలాగే, మితిమీరిన జాతీయవాద పోకడులున్న ఫ్రంట్ నేతనల్ నాయకురాలు మరీన్‌ను కూడా మితవాదిగా భావించరు. అంటే, రెండు ప్రధాన జీవనస్రవంతి పక్షాలకు చెందని ‘బయటివారు’ ఇద్దరు 2017 అధ్యక్ష ఎన్నికల్లోపోటీపడడం మున్నెన్నడూ లేని గొప్ప పరిణామం.
గ్లోబలైజేషన్ ఫలాలు అందుకోవాలంటున్న మేక్రాన్!
పాశ్చాత్య ప్రపంచంలో ‘విఫలమైందని’ భావిస్తున్న గ్లోబలైజేషన్‌కు గట్టి మద్దతుదారు మేక్రాన్. ఆయన 2014–16 మ«ద్య ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఆయన∙స్వేచ్చా ఆర్థిక విధానాలకు ప్రతిఘటన ఎదురైంది. ఆ కాలంలో ఆదివారాలు మరిన్ని దుకాణాలు తెరిచి ఉంచడాన్ని ఆయన అనుమతించారు. అప్పటి వరకూ ప్రభుత్వ కట్టడికి పరిమితమైన రంగాల తలుపులు బార్లా తెరిపించారు. కార్మికుల ప్రయోజనాలు దెబ్బదీసేలా నిబంధనలు మార్చారనే విమర్శలు కూడా ఎదర్కొన్నారు. కిందటేడాది ఏప్రిల్‌లో ఎన్ మార్చ్ అనే కొత్త ఉద్యమం ప్రారంభించాక తాను ‘లెఫ్టూ కాదు, రైటూ కాదు’ అనేలా తనను చిత్రించుకునే ప్రయత్నంచేశారు. ‘రివల్యూషన్’ అనే పుస్తకంలో తాను వామపక్షవాది మాత్రమే కాదు ‘లిబరల్’అని కూడా చెప్పుకున్నారు. ఆర్థిక విషయాల్లో లిబరల్‌గా పేరొందినా, సామాజిక అంశాల్లో మాత్రం వామపక్షవాదిగా వ్యవహరించారు.
ప్రభుత్వ వ్యయం తగ్గించడం కుదరేపనేనా?
బలమైన పారిశ్రామిక దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్‌లో ఇప్పటికీ ప్రభుత్వ రంగం వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ పాత్ర పెద్దది. అయితే, ప్రభుత్వ వ్యయాన్ని ఏడాదికి 6400 కోట్ల డాలర్ల చొప్పును తగ్గించడమేగాక, రిటైరయ్యేవారి స్థానంలో నియామకాలు చేపట్టకపోవడం ద్వారా 1,20000 ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తానని కూడా మేక్రాన్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఈ మార్పులు చేయడం అంత తేలికకాదు. ఆయనది కొత్త రాజకీయపార్టీ. జూన్‌లో రెండు దశల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ మార్చ్‌కి ఎన్ని సీట్లొస్తాయో చెప్పడం కష్టం. అధ్యక్ష ఎన్నికల్లో లభించిన జనాదరణను చాలా వరకు నిలబెట్టుకుంటేనే పార్లమెంటులో మేక్రాన్ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. చట్టసభల్లో ఇప్పుడు ప్రాతినిధ్యమే లేని ఎన్ మార్చ్ జూన్ ఎన్నికల్లో గౌరవప్రదమైన రీతిలో సీట్లు వచ్చేలా చూడడం ప్రస్తుతం మేక్రాన్ ముందున్న లక్ష్యం.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్