ఫేస్‌బుక్ లేటెస్ట్ యాప్ ‘లైఫ్‌స్టేజ్’
న్యూయార్క్: హైస్కూల్ విద్యార్థుల కోసం సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్ ‘లైఫ్‌స్టేజ్’ పేరుతో కొత్త ఐఓఎస్ యాప్‌ను ప్రారంభించింది. ఇందులో... వినియోగదారుడు వీడియో రూపంలో ఇచ్చిన ఇష్టాయిష్టాలు, బెస్ట్ ఫ్రెండ్, అభిరుచులు, సంతోషం, బాధ కలిగించిన సందర్భాలు తదితర వివరాలను వర్చువల్ ప్రొఫైల్ వీడియోగా మార్చి ఈ నెట్‌వర్క్‌లోని ఇతర విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. దీంతో తోటివారితో ఉన్న ఉమ్మడి ఆసక్తులు, కోరికల గురించి వారు మరింత తెలుసుకోవచ్చని శనివారం ఓ పోస్టులో ఫేస్‌బుక్ వెల్లడించింది.
21 ఏళ్లకు కిందనున్న వారికే ఈ సౌకర్యం ఉంటుంది. ఎవరైనా తమ పేజీని అప్‌డేట్ చేసిన ప్రతిసారి దాన్ని చెక్ చేసుకునేలా ఇతరులకు ఫీడ్ వెళ్తుంది. యాప్‌లోకి లాగిన్ అయిన తరువాత స్కూల్ పేరు తెలపగానే ఇతరుల ప్రొఫైల్‌లను చూపుతుంది. ఒకే స్కూల్ నుంచి కనీసం 20 మంది ఇందులో నమోదై ఉండాలి. 21 ఏళ్లకు పైనున్న వారు కూడా ఈ యాప్‌తో ప్రొఫైల్‌లు తయారుచేసుకోవచ్చు. కానీ వీరికి ఇతరుల ప్రొఫైల్‌లను చెక్ చేసే అవకాశం ఉండదు.