ఫేస్‌బుక్ వారిద్దరిని కలిపింది...
లండన్: టొరాంటోలో పుట్టి లండన్ కాలేజీలో పీహెచ్‌డీ చేస్తున్న కై త్లిన్ రెగర్ అనే అమ్మాయి వారం క్రితం ఆక్టన్‌కు వెళుతున్న 207 బస్సు ఎక్కింది. బస్సు అంత రద్దీగా లేకపోవడమే కాకుండా రాత్రి పూట అవడంతో ఓ ఆకతాయి ఆ అమ్మాయిని దగ్గరకు లాక్కొని అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ అపరిచితుడు జోక్యం చేసుకొని ‘నీకు తల్లీ, చెల్లీ ఉండే ఉంటారు. మాకు ఉన్నారు. మనమంతా కలిస్తేనే సమాజమైంది. మనం పరస్పరం గౌరవించుకోవాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. ఓ చెల్లి పట్ల అలా ప్రవర్తించడం తప్పు, తప్పుకో’ అంటూ ఆ ఆకతాయిని కట్టడి చేశారు. ఇంతలో తన గమ్యస్థానం రావడంతో ఆ అపరిచితుడు బస్సు దిగిపోయారు.
షాక్ నుంచి తేరుకున్న తర్వాత కైత్లిన్, ధన్యవాదాలు చెబుతామని ఆ అపరిచితుడి కోసం చుట్టూ కలియజూసింది. అతను ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్లాక కూడా ఆ సంఘటనను మరచిపోలేక పోయింది. ఆ అపరిచితుడిని ఎలాగైనా కలుసుకొని థాంక్స్ చెప్పాలనుకుంది. వెంటనే జరిగిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ‘మంచి రక్షకుడు’ టైటిల్‌తో అపరిచితుడిని గురించి రాసింది. నీటైన దుస్తులు ధరించి హుందాగా కనిపిస్తున్న ఆ అపరిచితుడి గురించి తెలియజేయండి. ఎర్రగా ఉంటారు. గడ్డం, మీసాలను అందంగా ట్రిమ్ చేసుకున్నారు. ఆయనెవరో కనుక్కోవడంలో నాకు సహకరించండి. ఆయనకు ఓ మగ్గు బీరు పార్టీ ఇవ్వాలనుకుంటున్నా’అని యూజర్లకు విజ్ఞప్తి చేసింది.
అలాగే అపరిచితుడిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘నాకు అండగా నిలబడినందుకే కాదు. నేను సురక్షితంగా బస్సులో ప్రయాణించగలననే భరోసా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విశాల నగరంలో నాకెందుకీ గొడవంటూ నీ దారిన నీవు వెళ్లిపోలేదు. నీవు ఓ విలువ కోసం కట్టుబడి ప్రవర్తించావు. మానవత్వం ఉన్న మనిషిలా ప్రవర్తించావు. అందుకు థాంక్స్’ అని కైత్లిన్ వ్యాఖ్యానించింది. ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్‌ను 86 వేల మంది షేర్ చేసుకున్నారు. 1,60,000 లైక్స్ వచ్చాయి.
వారం తిరక్కుండానే ఆ ఆపరిచితుడిని ఫేస్‌బుక్ యూజర్లు కనిపెట్టగలిగారు. ఫిరాత్ ఓజ్‌సెలిక్‌గా ఆయన్ని గుర్తించారు. వారిద్దరిని కలిపారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫిరాత్‌ను కైత్లిన్ పబ్‌కు తీసుకెళ్లి బీరు పార్టీ ఇచ్చింది. తమను కలిపిన ఫేస్‌బుక్ యూజర్లకు విడిగా, ఫిరాత్‌తో కలసి ఫేస్‌బుక్‌లో థాంక్స్ చెప్పింది. ‘మీరు కలసుకున్నందుకు, కథ సుఖాంతమైనందుకు సంతోషం అని కొందరు, ఫిరాత్ లాంటి వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటారని ఇంకొందరు, మనకు మరింత మంది ఫిరాత్‌ల అవసరం ఉంది’ అంటూ ఇంకొందరు ఫేస్‌బుక్ యూజర్లు స్పందించారు. (లండన్ కాలేజీలో చదువుకుంటూనే కత్లిన్ ఓ టీవీలో ప్రోగ్రామర్‌గా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా పనిచేస్తున్నారు).