Brats
-
ట్యూషన్ వెళ్తున్న విద్యార్థినులపై ఆకతాయిల ఆగడాలు..
-
పట్టపగలే రెచ్చిపోతున్న ఆకతాయిలు.. మాయమవుతున్న బైక్‌లు
అల్లిపురం: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నిత్యం వారి ఆగడాలతో అవస్థలు పడతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలల్లో వేర్వేరు చోట్ల ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయని పోలీసుల రికార్డులు ద్వారా తెలుస్తోంది. ఇంటి బయట వాహనాలు పెట్టుకుంటే తెల్లారేసరికి ఉంటుందో లేదో తెలియడం లేదని అల్లిపురంవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారుమెట్టలో పట్టపగలే వాహనాల్లో పెట్రోలు దొంగిలిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. గత నెల 28న నేరెళ్లకోనేరు, కంఠంవారి వీధి ప్రాంతాల్లో రాత్రి వేళ ఇంటి బయట నిలిపిన వాహనాలను దుండగులు తగులబెట్టారు. దీనిపై టూ టౌన్ శాంతి భద్రతల పోలీసులకు ఫిర్యాదు అందటంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. మత్తు పదార్థాలు వినియోగించే వారి పనే.. 32, 34 వార్డుల్లో గంజాయి, మత్తు ఇంజక్షన్లు వాడే వారు ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నారని, వారే మత్తులో ఇలాంటిì పనులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు కోరారు. సీసీ కెమెరాలు అవసరం.. టూ టౌన్ పరిధిలోని ప్రధాన రహదారుల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ వాటిని ఏర్పాటు చేసి ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను స్థానికులు కోరుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. స్థానిక సంఘాల ప్రతినిధులు దాతలను ఏర్పాటు చేస్తే అందుకు తగిన విధంగా వారికి పోలీసు శాఖ సహకరిస్తుంది. ఇప్పటికే కొబ్బరితోటలో స్వస్ఛంద సంస్థల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతి రోజు ఈ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేస్తాం. – నరసింహారాజు, ఎస్ఐ,టూటౌన్ పోలీస్ స్టేషన్ అనుమానాస్పద వ్యక్తుల సమాచారం అందించండి 32, 34 వార్డుల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన, కొత్త వారు కనిపించినా వారిని నిలువరించి ప్రశ్నించండి. లేదా పోలీసులకు సమాచారం అందజేయండి. ఇప్పటికే బీట్లు పెంచాం. నిరంతర నిఘా ఏర్పాటు చేసాం. ఎవరి మీదైన అనుమానం వస్తే డయల్ 100కి గాని టూటౌన్ పోలీస్ స్టేషన్ 0891–2783672 నంబర్లకు తెలియజేయండి. – కూనిబిల్లి శ్రీను, క్రైం ఎస్ఐ, టూటౌన్ -
ఆకతాయి చేష్టలు...పంటలు బుగ్గిపాలు
కడప అగ్రికల్చర్: ఆకతాయిలు నిప్పు పెట్టడం వల్ల, విద్యుత్ షార్ట్‌సర్క్యూ వల్ల మామిడి, కంది, టమాటా, బుడ్డశగన పంటతోపాటు, వర్మీకంపోస్టు యూనిట్లు, డ్రిప్ పరికరాలు బుగ్గిపాలవుతున్నాయి. దీంతో రైతన్నలు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. విత్తనం మొదలుకొని పంట నూర్పిళ్ల దాకా అనేక రకాల సమస్యలను అధిగమించేందుకు రాత్రింబవళ్లు స్వేదాన్ని చిందించి శ్రమించినా తీరా పంట దిగుబడులతో మంచి ఆదాయాన్ని పొందుతామనుకున్న తరుణంలో ఇలా అగ్గిపాలవుతుండడాన్ని అన్నదాత తట్టుకోలేకపోతున్నాడు. అడవులకు నిప్పుపెడితే కేసులు పెడతామని బీరాలు పలికిన అటవీశాఖ అధికారులు ఆకతాయిల ఆగడాలను చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదని రైతు సంఘాలు బాహటంగా విమర్శిస్తున్నాయి. లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లె, టి. సుండుపల్లె, చిన్నమండెం, పెద్దముడియం, బి.కోడూరు, ఓబుళవారిపల్లె, పుల్లంపేట మండలాల సమీపంలో కొండ, గుట్టలున్నాయి. ఈ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, నిమ్మ, కూరగాయతోటలు, బుడ్డశగన పంట సాగులో ఉన్నాయి. రెండు నెలలుగా ఏదో ఒక చోట పంటతోటలు, చేలు తగలబడుతూనే ఉన్నాయి. దీనికి తోడు తుంపర, బిందు సేద్య పరికరాలు అగ్గిపాలయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీన రామాపురం మండలం చిట్లూరు దళితవాడకు చెందిన కౌలు రైతులు గంపాల వెంకటసుబ్బమ్మ, బాలిపోగు గంగమ్మ, చిన్నికృష్ణయ్య, వెంకటరమణ, ముసలిరెడ్డిపల్లెకు చెందిన రైతులు చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లకు చెందిన 150 ఎకరాల మామిడి చెట్లు, 30 ఎకరాల్లో సాగుచేసిన కందిపంట కాలిపోయింది. దీనికి ప్రధాన కారణం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నిప్పులు ఎగసిపడటమే. దీనివల్ల దాదాపు రూ.10లక్షల మేర నష్టం సంభవించింది. అదే నెల 6వ తేదీన రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన కాటిగారి ప్రతాప్‌రెడ్డికి చెందిన 5 ఎకరాల్లోని బుడ్డశనగ కట్టె కుప్ప కాలిపోయి రూ.2.50 లక్షల నష్టపోయినట్లు రైతు ఆవేదనతో తెలిపారు. ఆ నెల్లోనే 5వ తేదీన సంబేపల్లె మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన యువరాజా నాయుడు, రెడ్డి నారాయణకు చెందిన 30 ఎకరాల మామిడితోట దగ్ధమై రూ.12లక్షలు నష్టపోయినట్లు తెలిపారు. ఫిబ్రవరి1వ తేదీన లక్కిరెడ్డిపల్లె మండలం కాకుళారం గ్రామానికి చెందిన రైతు కత్తి రామచంద్ర, కత్తి వెంకటరమణ, గొర్లవీరుకు చెందిన 150 మామిడి చెట్లు ఆకతాయి చేష్టల వల్ల కాలిపోయాయి. దీంతో పాటు వర్మీకంపోస్టు యూనిట్ కూడా కాలిపోవడంతో మొత్తం రూ.5లక్షలు నష్టం సంభవించినట్లు రైతులు తెలిపారు. జనవరి నెల 28వ తేదీన పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామానికి చెందిన రైతులు కటారి జకరయ్య, కటారి ప్రభాకర్ 5 ఎకరాల్లోని బుడ్డశనగ కట్టె కల్లంలో దగ్ధం అయిందని, ఈ ప్రమాదం వల్ల రూ.1.20లక్షలు నష్టపోయామని వాపోయారు. ఫిబ్రవరి 21వ తేదీన ఓబుళవారిపల్లె మండలం పెద్ద ఓరంపాడు గ్రామ మహిళా రైతు ఆళ్ల నరసమ్మకు చెందిన 2 ఎకరాల్లోని అరటి తోట, బోరు మోటారు, టేకు చెట్లు, కొబ్బరి చెట్లు, వర్మీకంపోస్టు యూనిట్టు కాలిబూడిదయ్యాయి. దీని కారణంగా రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత మహిళా రైతు వాపోయారు. ఈ రైతులేకాదు జిల్లాలో చాలా మంది పంటలు అగ్నికి ఆహుతై పోవడంతో ఏమి చేయలేని స్థితిలో ఆందోళన చెందున్నారు. చోద్యం చూస్తున్న అధికారులు గుట్టలకు, కొండలకు ఆకతాయిలు నిప్పుపెట్టకుండా నిరోధించాల్సిన ఫారెస్టు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కొండలు, గుట్టల సమీపాన ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాల్సి ఉన్నా అలా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఏటా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది వారోత్సవాలు నిర్వహిస్తున్నా ఎందుకు నష్టాలు సంభవిస్తున్నాయనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అగ్నికి ఆహుతైన ఉద్యాన, వ్యవసాయ పంటలకు ప్రకృతి వైవరీత్యాల పథకంలోనైనా సాయం అందించాలని ప్రభుత్వానికి రైతులు విన్నవించుకుంటున్నారు. -
బరితెగించిన ఆకతాయిలు!
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ఆకతాయిలు బరితెగించారు. ఆటోలో వెళ్తున్న యువతిని వెంబడించి మరి వేధించారు. సోమవారం సాయంత్రవేళ నడిరోడ్డు మీద ఈ ఘటన జరిగింది. జైరా అనే బాను అనే యువతి షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఐదుగురు యువకులు ఆమెను దారిలో అడ్డిగించే ప్రయత్నం చేశారు. ఏకంగా ఆమె ప్రయాణిస్తున్న ఆటోలోకి ఎక్కి.. ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. ఆమెను బయటకు లాగి దాడి చేసేందుకు యత్నించారు. ఈ ఘటనను తన సెల్ఫోన్లో చిత్రీకరించిన బాధిత యువతి మైలార్ దేవ్‌పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆకతాయిల్లో ఒకతను తనను పెళ్లి చేసుకోవాలని బలవంతపెడుతూ ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అమ్మాయికి తెలిసిన ఆకతాయే ఇలా ప్రవర్తించినట్టు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మొత్తం ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని గుర్తించారు. వివిధ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆకతాయిలపై కఠిన చర్యలకు కొత్త చట్టం
ప్రతిపాదనలను కేంద్రానికి పంపాం: డీజీపీ హైదరాబాద్: మహిళలను వేధించే ఆకతాయిలు, పోకిరీలపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఇందుకు ‘యాంటీ ఈవ్ టీజింగ్ యాక్ట్’పేరుతో మరింత కఠినమైన చట్టాన్ని రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపినట్లు తెలిపారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్ హోటల్లో ‘బీ బోల్డ్ ఫర్ ఛేంజ్’పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత చట్టాల వల్ల పెద్దగా ఉపయోగం లేదని, స్వల్ప ఫైన్ చెల్లించి ఈవ్‌టీజర్లు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. తాము కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో కనీసం 10 వేల నుంచి 15 వేల అపరాధ రుసుము, జైలు శిక్ష ప్రతిపాదించినట్లు తెలిపారు. మహిళల రక్షణ, వారి హక్కులు కాపాడేందుకు పలు చట్టాలు అమలు అవుతున్నాయని, వాటిపై చదువుకున్నవారికి కూడా సరైన అవగాహన లేకపోవడం విచారకరమని అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా అన్నారు. మొత్తం పోలీసుల్లో మహిళలు 5 శాతం కంటే తక్కువగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. వరకట్న వ్యతిరేక చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవమే అని డీజీపీ అన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్పర్సన్ కామినీ షరాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో రెచ్చిపోయిన ఆకతాయిలు..
విజయవాడ : విజయవాడలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు. పోస్టల్ కాలనీలోని గుడిసెలకు నిప్పంటించారు. బాధిత కుటుంబాలు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది కాలనీలోని ఖాళీ ప్రదేశంలో నాలుగు కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుడిసెలకు బయటి నుంచి గడిపెట్టి, పై కప్పుకు నిప్పంటించి పరారయ్యారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు అప్రమత్తమై స్ధానికులను నిద్ర లేపారు. స్ధానికులు తలుపులు తెరవడంతో నాలుగు కుటుంబాలు ప్రాణాలతో బయటపడ్డారు. ఇంటిలోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కొందరు కావాలనే తమ గుడిసెలకు నిప్పంటించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
విజయవాడలో రెచ్చిపోయిన ఆకతాయిలు..
-
తిరుపతిలో ఆకతాయిలు వీరంగం
-
నయీం గ్యాంగ్ పేరుతో ఆకతాయిల బెదిరింపులు ?
ములుగు : పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ పేరుతో కొంతమంది ఆకతాయిలు మండల కేంద్రానికి చెంది న ఓ ఫర్టిలైజర్ వ్యాపారికి బెదిరింపు కాల్ చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం గ్యాంగ్‌స్టర్ నయీమ్ పోలీసుల చేతిలో ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నయీ మ్ కథ ముగిసింది. అయినా కొంతమంది ఆకతాయిలు న యీమ్ గ్యాంగ్ పేరుతో ములుగు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారిని డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు తెలి సింది. దీంతో బాధిత వ్యాపారి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
ఫేస్బుక్ వారిద్దరిని కలిపింది...
లండన్: టొరాంటోలో పుట్టి లండన్ కాలేజీలో పీహెచ్డీ చేస్తున్న కై త్లిన్ రెగర్ అనే అమ్మాయి వారం క్రితం ఆక్టన్‌కు వెళుతున్న 207 బస్సు ఎక్కింది. బస్సు అంత రద్దీగా లేకపోవడమే కాకుండా రాత్రి పూట అవడంతో ఓ ఆకతాయి ఆ అమ్మాయిని దగ్గరకు లాక్కొని అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ అపరిచితుడు జోక్యం చేసుకొని ‘నీకు తల్లీ, చెల్లీ ఉండే ఉంటారు. మాకు ఉన్నారు. మనమంతా కలిస్తేనే సమాజమైంది. మనం పరస్పరం గౌరవించుకోవాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. ఓ చెల్లి పట్ల అలా ప్రవర్తించడం తప్పు, తప్పుకో’ అంటూ ఆ ఆకతాయిని కట్టడి చేశారు. ఇంతలో తన గమ్యస్థానం రావడంతో ఆ అపరిచితుడు బస్సు దిగిపోయారు. షాక్ నుంచి తేరుకున్న తర్వాత కైత్లిన్, ధన్యవాదాలు చెబుతామని ఆ అపరిచితుడి కోసం చుట్టూ కలియజూసింది. అతను ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్లాక కూడా ఆ సంఘటనను మరచిపోలేక పోయింది. ఆ అపరిచితుడిని ఎలాగైనా కలుసుకొని థాంక్స్ చెప్పాలనుకుంది. వెంటనే జరిగిన విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘మంచి రక్షకుడు’ టైటిల్‌తో అపరిచితుడిని గురించి రాసింది. నీటైన దుస్తులు ధరించి హుందాగా కనిపిస్తున్న ఆ అపరిచితుడి గురించి తెలియజేయండి. ఎర్రగా ఉంటారు. గడ్డం, మీసాలను అందంగా ట్రిమ్ చేసుకున్నారు. ఆయనెవరో కనుక్కోవడంలో నాకు సహకరించండి. ఆయనకు ఓ మగ్గు బీరు పార్టీ ఇవ్వాలనుకుంటున్నా’అని యూజర్లకు విజ్ఞప్తి చేసింది. అలాగే అపరిచితుడిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘నాకు అండగా నిలబడినందుకే కాదు. నేను సురక్షితంగా బస్సులో ప్రయాణించగలననే భరోసా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విశాల నగరంలో నాకెందుకీ గొడవంటూ నీ దారిన నీవు వెళ్లిపోలేదు. నీవు ఓ విలువ కోసం కట్టుబడి ప్రవర్తించావు. మానవత్వం ఉన్న మనిషిలా ప్రవర్తించావు. అందుకు థాంక్స్’ అని కైత్లిన్ వ్యాఖ్యానించింది. ఫేస్బుక్లో ఈ పోస్ట్‌ను 86 వేల మంది షేర్ చేసుకున్నారు. 1,60,000 లైక్స్ వచ్చాయి. వారం తిరక్కుండానే ఆ ఆపరిచితుడిని ఫేస్బుక్ యూజర్లు కనిపెట్టగలిగారు. ఫిరాత్ ఓజ్సెలిక్గా ఆయన్ని గుర్తించారు. వారిద్దరిని కలిపారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫిరాత్ను కైత్లిన్ పబ్‌కు తీసుకెళ్లి బీరు పార్టీ ఇచ్చింది. తమను కలిపిన ఫేస్బుక్ యూజర్లకు విడిగా, ఫిరాత్తో కలసి ఫేస్బుక్లో థాంక్స్ చెప్పింది. ‘మీరు కలసుకున్నందుకు, కథ సుఖాంతమైనందుకు సంతోషం అని కొందరు, ఫిరాత్ లాంటి వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటారని ఇంకొందరు, మనకు మరింత మంది ఫిరాత్ల అవసరం ఉంది’ అంటూ ఇంకొందరు ఫేస్బుక్ యూజర్లు స్పందించారు. (లండన్ కాలేజీలో చదువుకుంటూనే కత్లిన్ ఓ టీవీలో ప్రోగ్రామర్‌గా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా పనిచేస్తున్నారు). -
పోకిరికిరి
అనంతపురం క్రైం : ఆడవాళ్లు అర్ధరాత్రి నిర్భయంగా తిరగగలిగినప్పుడు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లన్నారు మహాత్మాగాంధీ. అర్ధరాత్రి సంగతి దేవుడెరుగు.. కనీసం పట్టపగలు కూడా అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. అనంతపురంలో యువతులు, మహిళలు పగటి పూట సైతం తండ్రో, అన్నో, తమ్ముడో, స్నేహితులో.. ఇలా ఎవరో ఒకరి తోడు లేకుండా వెళ్లలేకపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఇటీవల చైన్‌స్నాచింగ్‌లు ఎక్కువ కావడంతో మహిళలు ఆభరణాలు వేసుకుని కనీసం ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లడానికి కూడా జంకుతున్నారు. ఇక యువతుల పరిస్థితి మరీ ారుణం. నడిరోడ్డుపైనే ఆకతాయిల వెకిలి చేష్టలతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల నిఘా కొరవడడంతో రోడ్‌సైడ్ రోమియోలు రెచ్చిపోతున్నారు. కళాశాలల వద్ద కాపు కాస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. కొన్ని కళాశాలల్లో సైతం ఈ జాడ్యం పురుడుపోసుకుంటోంది. దీంతో ఎన్నో ఆశలతో ఉన్నత లక్ష్యంతో విద్యాభ్యాసం చేస్తున్న యువతులు మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంటి నుంచి కళాశాలకు, బయటకు వెళ్లాక తాము పడుతున్న ఇబ్బందులను ఇంట్లో వాళ్లకు చెబితే ఎక్కడ తమ చదువును అర్ధంతరంగా ఆపేస్తారోనన్న ఆందోళన విద్యార్థినులను వెంటాడుతోంది. ఈ క్రమంలో వారు నరకయాతన అనుభవిస్తున్నారు. గ్యాంగ్‌లుగా ఏర్పడి ఈవ్‌టీజింగ్ అనంతపురంలోని కొన్ని కూడళ్లలో యువకులు గ్యాంగ్‌లుగా ఏర్పడి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. అమ్మాయిలు, యువతులు, మహిళలను వేధించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇక హాస్టళ్లు ఎక్కువగా ఉండే సాయినగర్, జీసెస్‌నగర్, కమలానగర్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రెండో రోడ్డు, విద్యుత్ నగర్, కమలానగర్, పాతూరు ప్రాంతాల్లో పోకిరీల బెడద ఎక్కువవుతోంది. ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారిని గుర్తించి వారి వెంటే వెళ్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ సమయంలో ఎదురుతిరిగితే ఎక్కడ తమ పరువు బజారున పడుతుందోనని యువతులు భయపడుతున్నారు. మూడ్రోజుల క్రితం ఓ వివాహిత మెడికల్ కళాశాల మీదుగా అశోక్‌నగర్ వైపు ద్విచక్ర వాహనంలో ఒంటరిగా వెళ్తుండగా వెనుక వైపు నుంచి బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ‘హాయ్ ఆంటీ’ అని అసభ్యపదజాలంతో ఇబ్బంది పెట్టి వెళ్లిపోయారు. ఇదే తరహాలో సాయినగర్‌లోని ఓ హాస్టల్ యువతి కొన్ని వస్తువులు కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్తుండగా అక్కడే కాపు కాసిన యువకులు ఈవ్‌టీజింగ్ చేయడంతో ఆమె తిరుగుముఖం పట్టింది. విషయాన్ని హాస్టల్ నిర్వాహకులకు చెప్పిన తర్వాత స్థానికులు స్పందించేలోగా ఆ యువకులు పరారయ్యారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా తల్లిదండ్రులకు చెబితే ఇబ్బందులు వస్తాయని అమ్మాయిలు లోలోపలే కుమిలిపోతున్నారు. కాగా కొన్ని మహిళా కళాశాలల్లోకి బయట వ్యక్తులు కూడా వచ్చి ఈవ్‌టీజింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో కోచింగ్ సెంటర్లకు వెళ్తున్న యువతులు కూడా ఈవ్‌టీజింగ్ బాధితులుగా మారుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో వెంటబడి మరీ సతాయిస్తున్నారు. కొరవడిన నిఘా అనంతలో పరిస్థితి ఇంతగా దిగజారుతున్నా పోలీసులు మాత్రం నిఘా పెంచడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల విద్యార్థినులు, మహిళలకు భరోసా ఇచ్చేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో పోకిరీలు మరింత రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు ఉండే కళాశాలల వద్ద గతంలో మఫ్టీలో పోలీసులు ఉండేవారు. మహిళా కానిస్టేబుళ్లు గస్తీ నిర్వహించేవారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచి ఇలాంటి పోకిరీలకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇవ్వాలని విద్యార్థినులు, మహిళలు, ప్రజలు కోరుతున్నారు. కళాశాలల్లో, ప్రధాన కూడళ్లలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేసి.. అందులో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే ఏర్పాటు చేస్తే బావుంటుందని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పోకిరీల పనిపట్టే అవకాశం ఉంటుంది. ముందస్తు చర్యలపై దృష్టి సారించాలి నగరంలో ఈవ్‌టీజింగ్ జరుగుతున్నా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య మాత్రం నామమాత్రంగానే ఉంటోంది. అయితే ఫిర్యాదు అందిన తర్వాత మాత్రం పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఓ ఎయిడెడ్ కళాశాలకు చెందిన విద్యార్థిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలో ఈ విద్యార్థితో పాటు మరికొందరు ఈవ్‌టీజింగ్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తల్లిదండ్రులను పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపారు. కేసుకడితే విద్యార్థి భవిష్యత్తు నాశనమవుతుందని కళాశాల యాజమాన్యం విజ్ఞప్తి చేయడంతో కౌన్సెలింగుతోనే సర్దుకున్నారు. అలాగే ఫోన్లో తనను వేధిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఎస్ఐలు జాకీర్‌హుసేన్, విశ్వనాథచౌదరి నలుగురు పోకిరీలకు తమైదనశైలిలో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. నలుగురు యువకులకు సప్తగిరి సర్కిల్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా వివాహితను సైగలు చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన అనంతపురం రూరల్ జ్యోతిబసు కాలనీకి చెందిన శ్రీనివాసులుపై రూరల్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. కాగా తమను వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తున్న వారు చాలా అరుదుగా ఉంటున్నారు. తల్లిదండ్రుల సహాయంతో పోకిరీలకు అడ్డుకట్టవేయగలుగుతున్నారు. అయితే చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నా వారి తల్లిదండ్రులు మాత్రం మనకెందుకొచ్చిన గొడవంటూ సముదాయించి ముందడుగు వేయలేకపోతున్నారు. ఫిర్యాదు అందితే చర్యలకు ఉపక్రమిస్తున్న పోలీసులు ముందస్తుగా నిఘా పెంచి ఈవ్‌టీజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు.