బిడ్డతో జహాన్‌తప్
కాబూల్ : మహిళలకు కనీస హక్కులు కూడా లేని దేశం. మత ఛాందసభావాలు ప్రబలంగా ఉన్న సమాజం. ఆపై అంతర్యు ద్ధం..! ఇలాంటి తీవ్ర ప్రతికూల పరిస్ధితుల్లో ఉన్నత పాఠశాల స్థాయి వరకే చదువుకున్న ఓ మహిళ.. పైచదువులు చదవాలనుకుంది..! నిరక్షరాస్యుడైన భర్త, ఐదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు ఉన్నప్పటికీ స్థైర్యం కోల్పోలేదు. పట్టుదలతో చదివి, యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించింది. ఆపై అదృష్టం కలిసి వచ్చింది... ఫేస్‌బుక్(ఎఫ్‌బీ) ద్వారా ఆమె కల నెరవేరింది.. యూనివర్సిటీలో చేరింది..!
అఫ్గానిస్తాన్‌లోని నీలి ప్రావిన్స్‌కు చెందిన జహాన్‌తప్ అహ్మదీ(25) ఉన్నత పాఠశాల స్థాయి వరకు చదువుకుంది. వివాహం కావటంతో మెట్టినింటికి చేరుకుంది. భర్త నిరక్షరాస్యుడు. ఆ గ్రామంలో ఉన్న ఏకైక ప్రాథమిక పాఠశాలలో చదువు చెప్పేందుకు ఆమెకున్న విద్యార్హత సరిపోతుంది. అయితే, ఇంకా చదవాలన్నది ఆమె ఆశయం. అందుకోసం వర్సిటీ ప్రవేశపరీక్షకు ప్రిపేరయింది. ప్రొవిన్షియల్ రాజధాని దైకుందిలో జరిగే పరీక్షకు వెళ్లాంటే చాలాదూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ గ్రామం నుంచి జహాన్‌తప్ తన రెండు నెలల పసికందును ఎత్తుకుని కాళ్లు బొబ్బలెక్కేలా నడిచింది. అనంతరం 10 గంటలపాటు గతుకుల రోడ్డులో, కిక్కిరిసిన బస్సులో ప్రయాణించి దైకుంది చేరుకుంది.
పక్కనే బిడ్డను పడుకోబెట్టుకుని, నేలపైనే కూర్చుని పరీక్ష రాసింది. ఈ పరీక్షలో 200కు గాను 152 మార్కులు సంపాదించింది. ఆమె అలా పరీక్ష రాయటాన్ని ఒక టీచర్ చూసి మెచ్చుకున్నారు. ఆ ఫొటో తీసి, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కాబూల్‌లో పనిచేసే జహ్రా యగానా అనే ఓ స్వచ్ఛంద నిర్వాహకురాలు చూసి జహాన్‌తప్‌ను పిలిపించుకున్నారు. యూనివర్సిటీలో చేరేందుకు సాయపడ్డారు. అక్కడి మహిళా అధికారులను ఒప్పించి.. ట్యూష న్ ఫీజు, ఇతర ఖర్చులు, ఆమె కుటుంబం బస చేయటానికి వసతులను కల్పించారు. ‘నా పిల్లల కోసమే చదువుకోవాలనుకున్నా. నేను చదువుకుంటా.. మా గ్రామస్తులకు, తోటి వారికి సాయం చేస్తా..’అంటోంది జహాన్‌తప్. అలా..ఆమె కలను ఫేస్‌బుక్ నిజం చేసింది..! అఫ్గానిస్తాన్‌లోని బడి అంటే తెలియని 35 లక్షల మంది చిన్నారుల్లో మూడొంతుల మంది బాలికలేనని ఐరాస గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment