Afghan Social Media Accounts: అఫ్గనిస్తాన్ ఆక్రమణ తర్వాత.. ఎలాంటి హాని ఉండబోదని తాలిబన్లు ప్రకటించినప్పటికీ ప్రతీకార దాడులకు దిగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకుంటున్న తాలిబన్లు.. వీటి ద్వారా అఫ్గన్లను టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ యూజర్ల భద్రతా కోసం వీలైనంత ప్రయత్నాలు చేస్తున్నాయి.
అఫ్గన్ యూజర్ల డిజిటల్ హిస్టరీ, ఇతరులతో సోషల్ కనెక్షన్స్‌పై తాలిబన్ల నిఘా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మానవ హక్కుల సంస్థలు. ఈ తరుణంలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విటర్, లింకెడ్‌ఇన్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యూజర్లకు భరోసా ఇస్తున్నాయి. అకౌంట్ల భద్రత కోసం వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించాయి. ఇప్పటికే ఫ్రెండ్స్ సెర్చ్ ఆప్షన్‌ను తాత్కాలికంగా తొలగించింది ఫేస్‌బుక్. ఈ మేరకు ఫేస్‌బుక్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నాథనెయిల్ గ్లెయిచర్ గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు అఫ్గన్‌లో ఉన్నవాళ్లు.. తాలిబన్ల కంటపడకుండా ఇతర ప్రాంతాలకు, దేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవాళ్లు, సోషల్ మీడియాలో తాలిబన్ల వ్యతిరేక పోస్టులు పెడుతున్న అఫ్గన్‌లు, ఇతర దేశస్తులు కూడా అఫ్గన్ పౌరుల కోసం ఇంటర్నెట్‌లో వెతుకులాట చేయొద్దని.. తద్వారా తాలిబన్ల దృష్టిలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
హ్యాకర్ల సాయం
మరోవైపు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ట్రేస్ చేసి అఫ్గన్లపై తాలిబన్లు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత కొన్నేళ్లుగా టెక్నాలజీని విపరీతంగా వాడేసుకుంటున్న తాలిబన్లు.. హ్యాకర్ల సాయం తీసుకునే అవకాశాలూ ఉండొచ్చని సైబర్ నిపుణులు చెప్తున్నారు. తద్వారా ఆర్థిక నేరాలకు, భద్రతాపరమైన సమాచారాన్ని తస్కరించే అవకాశాలు కనిస్తున్నాయి. ఇక అఫ్గన్‌లో విద్యావేత్తలు, జర్నలిస్టులు, అమెరికా దళాలకు సాయం అందించిన వాళ్లు ఇప్పటికే తాలిబన్ లిస్ట్‌లో ఉన్నారని, కాబట్టి వాళ్లంతా సోషల్ మీడియాకు వాళ్లు కొన్నాళ్లూ దూరంగా ఉండడం మంచిదని హెచ్చరిస్తున్నారు.
ఇది చదవండి: తాలిబన్ల కంటపడకుండా ఎలా పారిపోతున్నారంటే..
అకౌంట్ల టెంపరరీ సస్పెన్షన్
దయచేసి సోషల్ మీడియా అకౌంట్లను శాశ్వతంగా తొలగించమని, పబ్లిక్ ఐడెంటింటీలో ఉన్న గుర్తులన్నీ తీసేయాలంటూ అఫ్గన్ ఫుట్‌బాల్ టీం మాజీ కెప్టెన్ ఆటగాళ్లకు సలహా ఇచ్చింది. మరోవైపు తాలిబన్ల నుంచి ప్రమాదం పొంచి ఉన్న ట్విటర్ అకౌంట్లు, పాత ట్వీట్లను తొలగించేందుకు ట్విటర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ‘రిస్క్ కలిగించే కంటెంట్ ఉన్న అకౌంట్లను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తామని, తిరిగి లాగిన్ కావడమో లేదంటే డిలీట్ చేయడమో యూజర్ ఇష్టమ’ని ట్విటర్ ఇదివరకే పేర్కొంది. ఇక మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెషనల్ ఫ్లాట్‌ఫామ్ ‘లింకెడ్‌ఇన్’ అఫ్గన్ యూజర్ల అకౌంట్లను తాత్కాలికంగా కనిపించకుండా చేసినట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: అలెక్సాలో మెగాస్టార్ వాయిస్!
Comments
Please login to add a commentAdd a comment