బామ్మ ప్రాణాన్ని కాపాడిన ఫేస్‌బుక్
సోషల్ మీడియాలో రారాజుగా వెలిగిపోతున్న ఫేస్‌బుక్... ఓ వృద్ధురాలి ప్రాణాలను కాపాడింది. ఎలాగంటే... అమెరికాలోని న్యూయార్క్‌కి చెందిన 61 ఏళ్ల లెస్సీఖాన్ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న స్టెప్స్ మీద కూర్చొని ఫేస్‌బుక్ చూస్తోంది. అనుకోకుండా ఒక్కసారిగా నిచ్చెన విరిగిపోవడంతో బామ్మ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయింది. బ్రెస్ట్ కేన్సర్ కారణంగా ఎంతో కాలంగా మందులు వాడుతున్న ఆ బామ్మ ఎంతో బలహీనంగా తయారయింది. దీంతో ఆ స్విమ్మింగ్ పూల్ గట్టు పైకి ఎక్కలేక ఒక చివరన నీళ్లలో మూడు గంటలకు పైగా నిలబడింది.
అప్పుడే ఆమెకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే తన పరిస్థితిని వివరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. తనకు సాయం చేయాలంటూ కోరింది. ఎప్పింగ్ స్కీవాక్స్ గ్రూప్‌లో పెట్టిన ఈ పోస్టును పక్కనే ఉంటున్న స్నేహితుడు చూసి, వెంటనే వచ్చి బామ్మను కాపాడాడు. అయితే అప్పటికే బామ్మకు సాయం చేసేందుకు గ్రూప్‌లోని 3,981 మంది తమ గమ్యస్థానాల నుంచి స్టార్ట్ అయ్యారట. కానీ పక్కింటి వ్యక్తి కాపాడిన విషయాన్ని కూడా బామ్మ పోస్ట్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారట.