
నిక్కిహేలీ
న్యూయార్క్: సిరియా కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయడంలో ఐక్యరాజ్యసమితి, రష్యా విఫలమయ్యాయని అమెరికా విమర్శించింది. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని ఐక్యరాజ్యసమతిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ వ్యాఖ్యానించారు. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, రష్యా కలిసి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ... సిరియాలో ఉన్నా రష్యా, ఇరాన్ సంకీర్ణ సేనలను వెనక్కు పిలిపించడంలో సమితి విఫలమైందన్నారు.
డమాస్కస్ సమీపంలో తూర్పు ఘౌటా ప్రాంతంలో కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి 30 రోజులు గడిచినా పరిస్ధితిలో ఎటువంటి మార్పులేదన్నారు. అసద్, రష్యా సంకీర్ణ బలగాలు ఈ ఒప్పందాన్ని అతిక్రమించాయని మండిపడ్డారు. ‘ఇది చాలా తప్పు. భద్రతామండలిలోని ప్రతి సభ్యుడికి ఇది అవమానకరమైన రోజు’ అని నిక్కీ హేలీ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కాల్పులు విరమణ ఒప్పందానికి ఓటు వేసిన రష్యా కట్టుబాటు చాటలేదని, ఈ విషయంలో మాస్కో కంటే తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.