
చలికి విమానం డోరు పూర్తిగా బిగుసుకుపోయింది. పిల్లలు, వృద్ధులు గడ్డకట్టుకు పోయేలా ఉన్నారు.
టొరంటో : తోటి ప్రయాణికుడి అనారోగ్యం, ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సుమారు 18 గంటల పాటు విమాన ప్రయాణికులు చలికి వణికిపోయారు. కెనడాలోని ఓ ఎయిర్‌పోర్టులో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 179 న్యూజెర్సీ నుంచి 250 ప్రయాణికులతో హాంగ్‌కాంగ్ బయల్దేరింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఈస్ట్‌కోస్ట్ కెనడాలోని గూజ్ బే ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.
కాగా అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీలకు పడిపోవడంతో విమానం టేకాఫ్ కాలేదు. చలికి విమానం డోరు కూడా పూర్తిగా బిగుసుకుపోయింది. దీనికితోడు ఆరోజు విధుల్లో ఉండాల్సిన కస్టమ్స్ ఆఫీసర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో సుమారు 18 గంటల పాటు ప్రయాణికులంతా ప్రత్యక్ష నరకం అనుభవించారు. ఆహారం, మంచినీళ్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్న అధికారులు బస్సు ద్వారా ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత హాంగ్‌కాంగ్ పంపించే ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ విషయం గురించి సంజయ్ దత్ అనే ప్రయాణికుడు.. ‘దయచేసి మాకు సహాయం చేయండి. ఇక్కడ పరిస్థితి అస్సలు బాగోలేదు. తగిన ఆహారం కూడా అందుబాటులో లేదు. నా జీవితంలో ‘అతిపెద్దదైన’ రోజు ఇదే. పిల్లలు, వృద్ధులు చలికి గడ్డకట్టుకు పోయేలా ఉన్నారు. కాళ్లు కదపడానికి కూడా రావడం లేదు. సుమారు 18 గంటల నిరీక్షణ తర్వాత గూజ్ బే నుంచి బయల్దేరాం’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు. కాగా కెనడా, ఈశాన్య అమెరికాలో మంచు కురుస్తున్న కారణంగా పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Just hit over 13 hours. Some passengers are being taken to customs area to stretch their legs. Only 20 at a time. Waiting for rescue plane en route to us.
— SONJAY (@sonjaydutterson) January 20, 2019